చెయ్యి చాపితే అందేంత దూరంలో నా టేబుల్ మీద అణుబాంబు బటన్ ఉంది. జాగ్రత్త, అని ఒకరంటే.. నా టేబుల్ మీద కూడా ఉంది , అది ఇంకా పెద్దది, మరింత శక్తిమంతమైనది అంటూ మరొకరు తీవ్రమైన హెచ్చరికలు చేసుకొని ప్రపంచ దేశాల్లో దడ పుట్టించిన ఇద్దరు అధినేతలు ఎట్టకేలకు సమావేశం కానున్నారు. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ నెల 12న సింగపూర్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం 6.30 గంటలకు సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియా అధినేతతో సమావేశం కావడం ఇదే తొలిసారి. దీంతో వీరి భేటీతో ఏం జరగబోతోంది ? చర్చల ఫలితం ఎలా ఉండబోబోతంది అన్న అంశంపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది
ట్రంప్ ఆశిస్తున్నదేంటి ?
ఉత్తర కొరియా అణ్వస్త్రరహిత దేశంగా మారిపోవాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తర్వాత, ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా దారిలోకి తెచ్చుకునే అంశంలో విజయం సా«ధించాలన్న పట్టుదలతో ట్రంప్ ప్రభుత్వం ఉంది. ఈ సమావేశంతో సానుకూల ఫలితాలే వస్తాయన్న సంకేతాలను ఇప్పటికే ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ)కి ట్రంప్ ప్రభుత్వం పంపింది. ఉత్తర కొరియాలో అణు తనిఖీలు నిర్వహించడానికి మరి కొద్ది వారాల్లో ఐఏఈఏ బృందం ఆ దేశానికి వెళ్లడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే ఇద్దరు అధినేతలు సమావేశం కానున్నారు. కిమ్‌తో చర్చల ద్వారా ఉత్తర కొరియా భూభాగంలో పట్టు పెంచుకోవడానికి ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉభయ కొరియాలను చైనా నుంచి వేరు చేసే ఎల్లో సముద్రంపై కొంతవరకైనా ఆధిపత్యం సాధించాలనే యోచనలో ఉన్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన 30 వేల బలగాలు ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ సమావేశం సానుకూలంగా సాగితే అమెరికాకు సైనిక వ్యయం తగ్గడమే కాకుండా, చైనా కార్యకలాపాలను కూడా ఓ కంట కనిపెట్టేలా ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
కిమ్ కోరుకుంటున్నదేంటి?
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తన పరిపాలనకు ఒక గుర్తింపు, ఉత్తర కొరియాకు అణుదేశం అన్న హోదా దక్కించుకోవాలన్న ప్రధాన ధ్యేయంతో ఈ సమావేశానికి హాజరవుతున్నారు. తన ఉనికిని కాపాడుకోవాలన్నా, దేశానికి భద్రత ఉండాలన్నా అణు బాంబు అత్యంత అవసరం అన్న భావనలో ఇప్పటికీ కిమ్ ఉన్నారు. అందుకే తమ దేశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయలేరన్న ధీమా కూడా ఆయనలో ఉంది. ఇక సింగపూర్ చర్చల ద్వారా ఉత్తరకొరియాపై ఆర్థిక ఆంక్షలను తొలగించేలా అడుగులు ముందుకు పడాలని కిమ్ కోరుకుంటున్నారు. తన తండ్రి హయాంలో ఉత్తర కొరియా కరువు బారిన పడి అల్లాడిపోయిందని, తన పాలనలో అలాంటి పరిస్థితి రాకూడదని కిమ్ తన ప్రసంగాల్లో తరచు చెబుతూ వస్తున్నారు. ఆర్థిక ఆంక్షలు తొలగిపోతే దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు తీయించవచ్చునన్న ఆలోచనలో కిమ్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఖుక్రీలు, రైఫిల్స్‌తో నేపాలీ గూర్ఖాల భద్రత
ట్రంప్, కిమ్ చరిత్రాత్మక సమావేశానికి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇద్దరు అధినేతలు తమ తమ భద్రతా సిబ్బందిని వెంట తెచ్చుకుంటున్నప్పటికీ సింగపూర్ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది. సంప్రదాయంగా వస్తున్న నేపాలీ గూర్ఖాలతో భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.ప్రపంచంలో అత్యంత పోరాటపటిమను, తెగువను ప్రదర్శించే గిరిజన తెగగా వీరికి పేరుంది. వీరిద్దరి భేటీ జరిగే సెంటోసా దీవులు, అధినేతలు ఇద్దరూ బస చేసే హోటల్స్, ఆ చుట్టుపక్కల రోడ్లన్నీ ఈ గూర్ఖాలే డేగ కళ్లతో కాపలా కాస్తారు. ప్రత్యేక పరిస్థితుల్లో భద్రతా ఏర్పాట్ల కోసం సింగపూర్ పోలీసులు ఏరికోరి నేపాలీ గూర్ఖాలను తీసుకొని వారికి శిక్షణ ఇస్తూంటారు.. వీరి చేతిలో ఎప్పుడూ బల్గేరియాలోతయారైన అత్యంత ఆధునికమైన అతి పెద్ద రైఫిల్స్ , కాళ్ల దుస్తుల్లో పిస్టల్స్ ఉంటాయి.
ఎన్ని రకాల ఆధునిక ఆయుధాలు చేతికి ఇచ్చినా ఈ గూర్ఖాలు తరతరాలుగా తమ దగ్గరున్న సంప్రదాయ ఆ«యుధం ఖుక్రీ (వంపులు తిరిగి ఉన్న కత్తి) లేకుండా కదన రంగంలోకి దిగారు. ఈ ఖుక్రీ అత్యంత పదునైనది. అందుకే అది లేకుండా గూర్ఖాలు తమ విధులకు కూడా హాజరు కారు. గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాటిస్ పర్యటన సమయంలోనూ నేపాలీ గూర్ఖాలే భద్రత నిర్వహించారు. సింగపూర్‌కు చెందిన ఆరు పారామిలటరీ బలగాల్లో నేపాలీ గూర్ఖాలదే ప్రధాన పాత్ర. మొత్తం 1800 మంది నేపాలీ గూర్ఖాలు సింగపూర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. 200 ఏళ్లకి పూర్వం బ్రిటీష్ వలస పాలనా కాలం నుంచే సింగపూర్‌లో నేపాలీ గూర్ఖాల నియామకం జరుగుతూ వస్తోంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment