'తల' రాత మారుతుందా? | 'Dr Frankenstein' ready to perform first human head transplant | Sakshi
Sakshi News home page

'తల' రాత మారుతుందా?

Published Sat, May 7 2016 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

'తల' రాత మారుతుందా?

'తల' రాత మారుతుందా?

శుక మహర్షి.. వినాయకుడు.. నరసింహస్వామి... పురాణ పాత్రలుగా కాకుండా వీరిలోని సారూప్యమేమిటో తెలుసా. ముగ్గురిదీ మానవ దేహమేకానీ తలలు మాత్రం వేర్వేరు జంతువులవి. మరి అలాంటివి ఇప్పుడు సాధ్యమవుతాయా? అంటే అసాధ్యమేమీ కాదంటున్నాడు ఇటలీకి చెందిన న్యూరోసర్జన్ సెర్గియో కానవెరో. జంతువు తలకాకపోయినా ఒక మనిషికి మరో మనిషి తల అతికించి చూపిస్తానని చెబుతున్నాడు. దానిపై ప్రయోగానికీ సిద్ధమైపోయాడు. ఇది వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తుందో.. లేక ఇద్దరు పిచ్చివాళ్ల ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోతుందో మాత్రం వేచిచూడాల్సిందే.. ఆ ప్రయోగం కథా కమామిషు ఇదీ..

తల మార్పిడి శస్త్రచికిత్స సాధ్యమేనని దాదాపు ఏడాది కింద సెర్గియో కానవెరో ప్రకటించాడు. దీనిపై విమర్శలు, చర్చలు వంటివెన్నో జరిగినా.. తర్వాత విషయం సద్దుమణిగింది. తర్వాత తల మార్పించుకునేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడంతో కానవెరో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.

ప్రయోగానికి తల తాకట్టు..
కానవేరో ప్రయోగానికి సహకరించేందుకు, తన తలను పణంగా పెట్టేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి పేరు వాలరీ స్పిరిడినోవ్. రష్యాకు చెందిన ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ 31ఏళ్ల ప్రాయంలోనే ‘వర్డ్‌నిగ్ హాఫ్‌మ్యాన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కాళ్లూ చేతులు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైపోయిన వాలరీ... శరీర కండరాలు క్షీణిస్తూ మరింత నరకం అనుభవిస్తున్నాడు. ఓ లక్ష్యం కోసం తన ప్రాణాన్ని తాకట్టుపెడితే తప్పేంటంటూ ప్రయోగానికి సిద్ధమయ్యాడు.

కోతులపై ప్రయోగం సక్సెస్!
1970లో అమెరికా న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ ఓ కోతి తలను మరోదానికి అమర్చడంలో విజయం సాధించారు. తల మార్పిడి తరువాత కూడా ఆ కోతి కొన్ని రోజుల పాటు బతికింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ కాలపు స్పైనల్‌కార్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా తల మార్పిడి సాధ్యమేనని అంటున్నారు కానవేరో.

36 గంటలు.. రూ.140 కోట్లు ఖర్చు..
కానవెరో తలపెట్టిన తల మార్పిడి శస్త్రచికిత్సకు 36 గంటల సమయం పడుతుందని, దాదాపు రూ.140 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డాక్టర్లు, నర్సులు, సైకాలజిస్టులు, టెక్నాలజిస్ట్‌లు, వర్చువల్ రియాలిటీ నిపుణులు కలుపుకొని దాదాపు 150 మంది ఈ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారు. రాబర్ట్ వైట్ మాదిరిగా ఇటీవల ఓ కోతి తలను మార్చేసిన జియోపింగ్ రిన్ (హార్బిన్ వైద్య విశ్వవిద్యాలయం, చైనా), ఎలుక వెన్నుపూసను విరిచేసి మళ్లీ విజయవంతంగా అతికించిన సీ-యూన్ కిమ్ (కోన్‌కుక్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, దక్షిణ కొరియా)లు కానవేరో బృందంలో ఉన్నారు.

ఆపరేషన్ జరిగే తీరు ఇలా..
తల మార్పిడి శస్త్రచికిత్స ఎలా జరుగుతుందన్న విషయంపై కానవెరో 2013లోనే సర్జికల్ న్యూరాలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ఓ పరిశోధనా వ్యాసం సమర్పించారు. 2015లో అకాడమీ ఆఫ్ న్యూరోలాజికల్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ 39వ సమావేశంలోనూ ఈ ప్రక్రియను వివరించారు. దాని ప్రకారం... తొలుత తలమార్పిడి శస్త్రచికిత్స కోసం ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు. వాలరీ (తల మార్పిడి ప్రయోగానికి ముందుకు వచ్చిన వ్యక్తి), శరీర దాత (బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తిని గుర్తించారు)ల శరీరాలకు రెండు బృందాలు ఏకకాలంలో వేర్వేరుగా శస్త్రచికిత్సలు జరుపుతాయి. మత్తుమందు ఇవ్వడంతోపాటు ఊపిరి ఆడేందుకు  గొట్టాలను అమరుస్తారు. తల కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ..మెదడు, గుండె పనితీరును గమనిస్తూ ఉంటారు. ముందుగా వాలరీ తలను శీతలీకరిస్తారు. తల ఉష్ణోగ్రత 12 నుంచి 15 డిగ్రీలకు తగ్గిపోయినప్పుడు మెదడు తాత్కాలికంగా పనిచేయడం మానివేస్తుంది. వాలరీ మెదడులోని రక్తం మొత్తాన్ని తీసేసి, సాధారణ సర్జరీ సొల్యూషన్‌ను నింపుతారు. మెదడు నుంచి రక్తం తీసేసిన కరోటిడ్, జగ్లర్ నాడుల చుట్టూ సిలికాన్, ప్లాస్టిక్‌లతో చేసిన గొట్టాలను అమరుస్తారు. ఈ దశలో వాలరీ, శరీర దాత మెడలపై లోతైన గాటు పెట్టి ఇద్దరి మెడ కండరాలను  గుర్తిస్తారు. తల మార్చేటప్పుడు ఒకదానిని మరోదానితో మ్యాచ్ చేసేందుకు ఇది అత్యవసరం.

రెండో అంకం..: రెండో అంకంలో వాలరీ, శరీర దాత వెన్నెముకలను కోసి తలలు వేరు చేస్తారు. ఇందుకోసం టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కోటి నలభై లక్షల రూపాయల విలువైన కత్తిని వినియోగిస్తారు. ఇద్దరి తలలు వేరు చేశాక.. గంటలోపే తల మార్పిడి జరగాలి. లేదంటే మెదడుకు రక్త ప్రసరణ జరగక మరణించే అవకాశం ఉంటుంది. వాలరీ తలను దాత దేహానికి అమర్చి, నాడులన్నింటినీ జాగ్రత్తగా అతికిస్తారు. దాత దేహం నుంచి వెచ్చటి రక్త ప్రసరణ చేయిస్తారు. దీంతో మెదడు పనిచేయడం మొదలవుతుంది. ఇదే సమయంలో వెన్నెముకను, దానిచుట్టూ ఉండే సున్నితమైన యాక్సాన్స్‌ను ప్రత్యేకమైన పాలిథిలీన్ గ్లైకాల్ పదార్థం సాయంతో అతికిస్తారు. మెడ, దేహాన్ని కలిపే అన్ని అవయవాల (కంఠనాళం తదితరాలు)ను కచ్చితంగా జోడించడం ద్వారా శస్త్రచికిత్స పూర్తవుతుంది. దాదాపు నాలుగు వారాలపాటు కోమాలో ఉన్న తరువాత వాలరీ మెదడు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కానవెరో అంచనా వేస్తున్నారు. 3 నుంచి 6 నెలల్లో వాలరీ అన్ని పనులు స్వయంగా చేసుకోగలడని చెబుతున్నారు. ఈ శస్త్రచికిత్స వెన్నెముక గాయాలకు మెరుగైన చికిత్స అందించడం వంటి అనేక ఇతర చికిత్సా విధానాల రూపకల్పన, అభివృద్ధికీ తోడ్పడుతుందని నిపుణుల అంచనా. ఈ శస్త్రచికిత్స ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement