కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి ఏం చేశాడంటే..? ఏకంగా.. | Prayagraj Neurosurgeon Father Takes NEET UG 2023 With Daughter | Sakshi
Sakshi News home page

కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి చేసిన పని తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Published Wed, Oct 25 2023 9:56 AM | Last Updated on Wed, Oct 25 2023 11:38 AM

Prayagraj Neurosurgeon Father Takes NEET UG 2023 With Daughter  - Sakshi

పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకోసం అదిలించేవారూ  బెదిరించేవారూ ఎప్పుడూ నిఘా పెట్టేవారూ ఉంటారు. కాని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక తండ్రి అలా చేయలేదు. ‘నీతో పాటు నేనూ చదివి పరీక్ష రాస్తా. చూద్దాం ఎవరికి మంచి ర్యాంక్‌ వస్తుందో’ అన్నాడు. నీట్‌ – 2023లో కూతురి ర్యాంక్‌ కోసం తండ్రి చేసిన పని సత్ఫలితం ఇవ్వడమేగాక అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అందరూ చేయకపోవచ్చు. 

కాని పిల్లల్ని చదివించడానికి పాత విధానాలు పనికి రావని తెలుసుకోవాలి.పిల్లల్లో తెలివితేటలు ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ఏకాగ్రత ఉన్నా, ఆరోగ్యంగా ఉండి రోజూ కాలేజ్‌కు వెళ్లి పాఠాలు వింటున్నా అంతిమంగా వారిలో ‘సంకల్పం’ ప్రవేశించకపోతే కావలసిన ఫలితాలు రావు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే తల్లిదండ్రులు బయటి నుంచి పెట్టే వత్తిడి కంటే పిల్లల్లో లోపలి నుంచి వచ్చే పట్టుదల ముఖ్యం. ఆ పట్టుదలను వారిలో ఎలా కలిగించాలో, సంకల్పం బలపడేలా ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలుసుకోవడమే తల్లిదండ్రులు ఇప్పుడు చేయవలసింది.

‘స్ట్రిక్ట్‌’గా ఉండటం వల్ల పిల్లలు చదువుతారనే పాత పద్ధతి కంటే వారితో స్నేహంగా ఉంటూ మోటివేట్‌ చేయడం ముఖ్యం. అలాగే తల్లిదండ్రులు కూడా వారితో పాటు విద్యార్థుల్లాగా మారి, వారు సిలబస్‌ చదువుకుంటుంటే సాహిత్యమో, నాన్‌ ఫిక్షనో చదువుతూ కూచుంటే ఒక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల్ని చదువుకోమని తల్లిదండ్రులు ఫోన్‌ పట్టుకుంటే, టీవీ చూస్తే... వారికీ అదే చేయాలనిపిస్తుంది. కాబట్టి నీట్, జెఇఇ వంటి కీలకపోటీ పరీక్షలు రాసే పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలకి స్ఫూర్తి కోసం వారి స్వభావాన్ని బట్టి కొత్త విధానాలు వెతకాల్సిందే.

తానే విద్యార్థి అయ్యి
ఈ సంవత్సరం తన కూతురికి నీట్‌లో ర్యాంక్‌ రావడం కోసం ఒక తండ్రి చేసిన ప్రయత్నం తాజాగా బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌)కు చెందిన డాక్టర్‌ ప్రకాష్‌ ఖైతాన్‌ (49) పెద్ద న్యూరో సర్జన్‌. అతను 1992లో ఎంట్రన్స్‌ రాసి మెడిసిన్‌లో సీట్‌ సంపాదించాడు. 1999లో పీజీ సీట్‌ సాధించి ఎం.ఎస్‌.సర్జరీ చేసి, 2003లో న్యూరో సర్జరీ చేశాడు. అంతేకాదు, 2011లో ఎనిమిదేళ్ల పాప మెదడు నుంచి 8 గంటల్లో 296 సిస్ట్‌లు తొలగించి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాడు. అలాంటి వైద్యుడు తన కుమార్తె మిటాలి నీట్‌ పరీక్షకు తగినంత సంకల్పంతో చదవడం లేదని గమనించాడు.

ఇంటర్‌ తర్వాత ఎం.బి.బి.ఎస్‌.లో చేరాలంటే నీట్‌లో ర్యాంక్‌ సాధించక తప్పదు. ‘కోవిడ్‌ సమయంలో నా కూతురి ఇంటర్‌ గడిచింది. కోవిడ్‌ ముగిసినా పాఠాల మీద మనసు లగ్నం చేసే స్థితికి నా కూతురు చేరలేదు. ఆమెను రాజస్థాన్‌లోని కోటాలో కోచింగ్‌ కోసం చేర్పించాను. కాని అక్కడ నచ్చక తిరిగి వచ్చేసింది. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఆమెతో పాటు కలిసి చదవడమే మంచిది అనుకున్నాను. నేను కూడా నీతో చదివి నీట్‌ రాస్తాను. ఇద్దరం చదువుదాం. ఎవరికి మంచి ర్యాంక్‌ వస్తుందో చూద్దాం అని చెప్పాను’ అన్నాడు డాక్టర్‌ ప్రకాష్‌.

ఆమెలో ఉత్సాహం నింపి
ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎంబిబిఎస్‌ ఎంట్రన్స్‌ రాసి సీట్‌ కొట్టిన తండ్రి తన కోసం మళ్లోసారి పరీక్ష రాస్తాననేసరికి మిటాలికి ఉత్సాహం వచ్చింది. డాక్టర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ప్రకాష్‌ ఉదయం, సాయంత్రం కూతురితో పాటు కూచుని చదివేవాడు. సిలబస్‌ డిస్కస్‌ చేసేవాడు. ఏ ప్రశ్నలు ఎలా వస్తాయనేది ఇద్దరు చర్చించుకునేవారు. అలా మెల్లమెల్లగా మిటాలికి పుస్తకాల మీద ధ్యాస ఏర్పడింది. మే 7న జరిగిన నీట్‌ ఎంట్రన్స్‌లో తండ్రీ కూతుళ్లకు చెరొకచోట సెంటర్‌ వచ్చింది. ఇద్దరూ వెళ్లి రాశారు. జూన్‌లో ఫలితాలు వస్తే మిటాలికి 90 పర్సెంట్, ప్రకాష్‌కు 89 పర్సెంట్‌ వచ్చింది. సెప్టెంబర్‌ చివరి వరకూ అడ్మిషన్స్‌ జరగ్గా మిటాలికి ప్రతిష్టాత్మకమైన మణిపాల్‌ కస్తూర్బా మెడికల్‌ కాలేజీలో సీట్‌ వచ్చింది

కలిసి సాగాలి
పిల్లలు చదువులో కీలకమైన దశకు చేరినప్పుడు వారితోపాటు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. వారితో ఉదయాన్నే లేచి చిన్నపాటి వాకింగ్‌ చేయడం, బ్రేక్‌ఫాస్ట్‌ కలిసి చేయడం, కాలేజీలో దిగబెట్టడం, కాలేజీలో ఏం జరుగుతున్నదో రోజూ డిన్నర్‌ టైమ్‌లో మాట్లాడటం, మధ్యలో కాసేపైనా వారిని బయటకు తీసుకెళ్లడం, వారు చదువుకుంటున్నప్పుడు తాము కూడా ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూచోవడం చాలా ముఖ్యం. దీనికంటే ఒక అడుగు ముందుకేసిన డాక్టర్‌ ప్రకాష్‌ కూతురుతో పాటు ఏకంగా ఎంట్రన్స్‌కు ప్రిపేర్‌ అవడం.. ఆ వయసులో తనే చదవగలిగినప్పుడు... నీ వయసులో నువ్వు చదవడానికి ఏమి అనే సందేశం ఇచ్చి కూతురిని గెలిపించుకున్నాడు.

(చదవండి: ఒక్క పాటతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ఆకాశ సింగ్‌)
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement