neurosurgeon
-
కణతపై తగిలి ఉంటే ప్రాణాపాయం
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సీఎం వైఎస్ జగన్‌పై హత్యాయత్నానికి సంబంధించి ఆయన తలలో అత్యంత సున్నిత ప్రాంతంలో గాయమైందని.. గాయమైన చోటు నుంచి సుమారు ఒకటిన్నర – రెండున్నర సెంటిమీటర్లు వెనుక భాగాన అదే దెబ్బ తగిలి ఉంటే ఊహకు అందని రీతిలో ప్రాణాపాయం సంభవించేదని గుంటూరు జీజీహెచ్ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ న్యూరో సర్జన్ డాక్టర్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కపాలం(తల) ప్రధానంగా నాలుగు భాగాలైన ఎముకలతో కూడి ఉంటుందన్నారు. ఇందులో నుదురు భాగం (Frontal Bone), వెనుక భాగం (Parietal Bone).. మెడను కలుపుతూ దిగువ భాగాన టెంపోరల్ బోన్ (Temporal Bone).. ఈ మూడింటికి మధ్యలో అన్నింటిని కలుపుతూ స్పెనాయిడ్ బోన్ ( Sphenoid Bone) ఉంటాయని తెలిపారు. మొత్తం కపాలంలో కల్లా బలహీనమైంది.. టెరియన్ (Pterion) అని వివరించారు. ఈ భాగాన్నే వాడుకలో కణతగా పిలుస్తుంటారన్నారు. ఇక్కడే మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే అతి ముఖ్యమైన ప్రధాన రక్తనాళం ఉంటుందన్నారు. దీన్నే మిడిల్ మెనింజియల్ ఆర్టిరీ (Middle Meningeal Artery) అంటారని వివరించారు. ఇక్కడ ఒక మోస్తరు దెబ్బ తగిలినా.. మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ప్రధాన రక్తనాళానికి ప్రమాదం సంభవిస్తుందన్నారు. దీంతో తీవ్ర రక్తస్రావం జరుగుతుందని చెప్పారు. మెదడులోనూ రక్తస్రావం అవుతుందన్నారు. దీన్నే ఎపిడ్యూరల్ హెమటోమా (Epidural Hematoma) అంటారని తెలిపారు. ఇలా జరిగితే మెదడుకు రక్తప్రసరణ ఆగిపోతుందని.. కణత వద్ద దెబ్బ తగిలితే వెంటనే స్పృహ కోల్పోయి కోమాలోకి జారుకోవచ్చన్నారు. ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉంటుందన్నారు. సీఎం జగన్‌కు గాయమైన చోట నుంచి కేవలం ఒకటిన్నర– రెండున్నర సెంటిమీటర్ల వెనకభాగాన కణత వద్ద అదే దెబ్బ తగిలి ఉంటే ప్రమాద తీవ్రత అంచనాకు అందకుండా ఉండేదని వివరించారు. ఎందుకంటే సాధారణంగా నుదిటి భాగాన చర్మం బిగుతుగా ఉంటుందన్నారు. ఆ ప్రాంతంలో ఎముక తప్ప కండ ఉండదని చెప్పారు. అక్కడే అంత లోతున రక్తగాయం అయ్యిందంటే.. అదే దెబ్బ కణత వద్ద తాకి ఉంటే పెద్ద ప్రమాదం తలెత్తేదని వివరించారు. -
కూతురుకి మంచి ర్యాంకు రావాలని ఆ తండ్రి ఏం చేశాడంటే..? ఏకంగా..
పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులకు ఉంటుంది. అందుకోసం అదిలించేవారూ బెదిరించేవారూ ఎప్పుడూ నిఘా పెట్టేవారూ ఉంటారు. కాని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక తండ్రి అలా చేయలేదు. ‘నీతో పాటు నేనూ చదివి పరీక్ష రాస్తా. చూద్దాం ఎవరికి మంచి ర్యాంక్ వస్తుందో’ అన్నాడు. నీట్ – 2023లో కూతురి ర్యాంక్ కోసం తండ్రి చేసిన పని సత్ఫలితం ఇవ్వడమేగాక అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా అందరూ చేయకపోవచ్చు. కాని పిల్లల్ని చదివించడానికి పాత విధానాలు పనికి రావని తెలుసుకోవాలి.పిల్లల్లో తెలివితేటలు ఉన్నా, సామర్థ్యం ఉన్నా, ఏకాగ్రత ఉన్నా, ఆరోగ్యంగా ఉండి రోజూ కాలేజ్‌కు వెళ్లి పాఠాలు వింటున్నా అంతిమంగా వారిలో ‘సంకల్పం’ ప్రవేశించకపోతే కావలసిన ఫలితాలు రావు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే తల్లిదండ్రులు బయటి నుంచి పెట్టే వత్తిడి కంటే పిల్లల్లో లోపలి నుంచి వచ్చే పట్టుదల ముఖ్యం. ఆ పట్టుదలను వారిలో ఎలా కలిగించాలో, సంకల్పం బలపడేలా ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలుసుకోవడమే తల్లిదండ్రులు ఇప్పుడు చేయవలసింది. ‘స్ట్రిక్ట్’గా ఉండటం వల్ల పిల్లలు చదువుతారనే పాత పద్ధతి కంటే వారితో స్నేహంగా ఉంటూ మోటివేట్ చేయడం ముఖ్యం. అలాగే తల్లిదండ్రులు కూడా వారితో పాటు విద్యార్థుల్లాగా మారి, వారు సిలబస్ చదువుకుంటుంటే సాహిత్యమో, నాన్ ఫిక్షనో చదువుతూ కూచుంటే ఒక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లల్ని చదువుకోమని తల్లిదండ్రులు ఫోన్ పట్టుకుంటే, టీవీ చూస్తే... వారికీ అదే చేయాలనిపిస్తుంది. కాబట్టి నీట్, జెఇఇ వంటి కీలకపోటీ పరీక్షలు రాసే పిల్లలున్న తల్లిదండ్రులు తమ పిల్లలకి స్ఫూర్తి కోసం వారి స్వభావాన్ని బట్టి కొత్త విధానాలు వెతకాల్సిందే. తానే విద్యార్థి అయ్యి ఈ సంవత్సరం తన కూతురికి నీట్లో ర్యాంక్ రావడం కోసం ఒక తండ్రి చేసిన ప్రయత్నం తాజాగా బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)కు చెందిన డాక్టర్ ప్రకాష్ ఖైతాన్ (49) పెద్ద న్యూరో సర్జన్. అతను 1992లో ఎంట్రన్స్ రాసి మెడిసిన్‌లో సీట్ సంపాదించాడు. 1999లో పీజీ సీట్ సాధించి ఎం.ఎస్.సర్జరీ చేసి, 2003లో న్యూరో సర్జరీ చేశాడు. అంతేకాదు, 2011లో ఎనిమిదేళ్ల పాప మెదడు నుంచి 8 గంటల్లో 296 సిస్ట్లు తొలగించి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించాడు. అలాంటి వైద్యుడు తన కుమార్తె మిటాలి నీట్ పరీక్షకు తగినంత సంకల్పంతో చదవడం లేదని గమనించాడు. ఇంటర్ తర్వాత ఎం.బి.బి.ఎస్.లో చేరాలంటే నీట్లో ర్యాంక్ సాధించక తప్పదు. ‘కోవిడ్ సమయంలో నా కూతురి ఇంటర్ గడిచింది. కోవిడ్ ముగిసినా పాఠాల మీద మనసు లగ్నం చేసే స్థితికి నా కూతురు చేరలేదు. ఆమెను రాజస్థాన్‌లోని కోటాలో కోచింగ్ కోసం చేర్పించాను. కాని అక్కడ నచ్చక తిరిగి వచ్చేసింది. ఏం చేయాలా అని ఆలోచిస్తే ఆమెతో పాటు కలిసి చదవడమే మంచిది అనుకున్నాను. నేను కూడా నీతో చదివి నీట్ రాస్తాను. ఇద్దరం చదువుదాం. ఎవరికి మంచి ర్యాంక్ వస్తుందో చూద్దాం అని చెప్పాను’ అన్నాడు డాక్టర్ ప్రకాష్. ఆమెలో ఉత్సాహం నింపి ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఎంబిబిఎస్ ఎంట్రన్స్ రాసి సీట్ కొట్టిన తండ్రి తన కోసం మళ్లోసారి పరీక్ష రాస్తాననేసరికి మిటాలికి ఉత్సాహం వచ్చింది. డాక్టర్‌గా బిజీగా ఉన్నప్పటికీ ప్రకాష్ ఉదయం, సాయంత్రం కూతురితో పాటు కూచుని చదివేవాడు. సిలబస్ డిస్కస్ చేసేవాడు. ఏ ప్రశ్నలు ఎలా వస్తాయనేది ఇద్దరు చర్చించుకునేవారు. అలా మెల్లమెల్లగా మిటాలికి పుస్తకాల మీద ధ్యాస ఏర్పడింది. మే 7న జరిగిన నీట్ ఎంట్రన్స్‌లో తండ్రీ కూతుళ్లకు చెరొకచోట సెంటర్ వచ్చింది. ఇద్దరూ వెళ్లి రాశారు. జూన్‌లో ఫలితాలు వస్తే మిటాలికి 90 పర్సెంట్, ప్రకాష్‌కు 89 పర్సెంట్ వచ్చింది. సెప్టెంబర్ చివరి వరకూ అడ్మిషన్స్ జరగ్గా మిటాలికి ప్రతిష్టాత్మకమైన మణిపాల్ కస్తూర్బా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. కలిసి సాగాలి పిల్లలు చదువులో కీలకమైన దశకు చేరినప్పుడు వారితోపాటు కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం తల్లిదండ్రులకు ఉంది. వారితో ఉదయాన్నే లేచి చిన్నపాటి వాకింగ్ చేయడం, బ్రేక్‌ఫాస్ట్ కలిసి చేయడం, కాలేజీలో దిగబెట్టడం, కాలేజీలో ఏం జరుగుతున్నదో రోజూ డిన్నర్ టైమ్‌లో మాట్లాడటం, మధ్యలో కాసేపైనా వారిని బయటకు తీసుకెళ్లడం, వారు చదువుకుంటున్నప్పుడు తాము కూడా ఏదో ఒక పుస్తకం పట్టుకుని కూచోవడం చాలా ముఖ్యం. దీనికంటే ఒక అడుగు ముందుకేసిన డాక్టర్ ప్రకాష్ కూతురుతో పాటు ఏకంగా ఎంట్రన్స్‌కు ప్రిపేర్ అవడం.. ఆ వయసులో తనే చదవగలిగినప్పుడు... నీ వయసులో నువ్వు చదవడానికి ఏమి అనే సందేశం ఇచ్చి కూతురిని గెలిపించుకున్నాడు. (చదవండి: ఒక్క పాటతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఆకాశ సింగ్) -
Hyderabad: హిందీ నేర్చుకుంటూ.. ఆదాయం అందుకుంటూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలోని రిసెప్షన్లో ఉన్న వ్యక్తుల్ని ‘‘కిత్నా రూపియా టెస్ట్ కే లియే? (పరీక్షలకు ఎంత ఖర్చవుతుంది?)’’అని ఆఫ్రికాకు చెందిన కవాంగు(25) అడుగుతోంది. కెన్యా నుంచి న్యూరో సర్జన్‌ను సంప్రదించడానికి నగరానికి వచ్చిన ముగ్గురు రోగులు తనకు కస్టమర్లుగా ఉన్నారు. వారికి అవసరమైన సంప్రదింపులు, పరీక్షల ఏర్పాట్ల నుంచి రెస్టారెంట్లో ఆహారాన్ని ఆర్డర్ చేయడం దాకా అన్నీ కవాంగు బాధ్యతలే. విదేశీయులకు అత్యున్నత వైద్యసేవల్ని మాత్రమే కాదు ఆదాయమార్గాలను కూడా నగర వైద్యం అందిస్తున్న తీరుకు కువాంగు ఒక ఉదాహరణ. తన కుటుంబంతో నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అలాంటి ఫెసిలిటేటర్ సహాయంతో సంక్లిష్టమైన కాలేయ సమస్యకు కవాంగు చికిత్స పొందింది. ఆ తర్వాత తానే ఫెసిలిటేటర్‌గా మారితే రోజుకు రూ.3 వేల నుంచి 5 వేల వరకు సంపాదించవచ్చని అర్థమయ్యాక కవాంగు మూడేళ్లుగా అదే పనిచేస్తూ నగరంలోనే ఉంటున్నారు. ఆ వృత్తి కోసం కొంచెం హిందీ కూడా నేర్చుకుందామె. ‘హిందీ భాష నేర్చుకోవడం కోసం కోర్సులో చేరడంతోపాటు బాలీవుడ్ సినిమాలు చూడటం ప్రారంభించాను‘అని ఆమె చెప్పారు. టోలీచౌకి కేంద్రంగా... ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తున్నవారికి కేంద్రంగా నగరంలోని టోలీచౌకి మారిందని ఓ ఆసుపత్రికి చెందిన మార్కెటింగ్ విభాగ ప్రతినిధి తెలిపారు. ఈ ఏరియాలోని ప్రీమియర్ అపార్ట్మెంట్లో అద్దెకుండేవారిలో అత్యధికులు ఈ తరహా సేవల్లో నిమగ్నమవుతున్నారన్నారు. చాలామంది ఇక్కడ ట్రావెల్ లేదా స్టడీ వీసాపై మాత్రమే ఉన్నారు. కాబట్టి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌కి సంబంధించిన సమస్యల గురించి భయపడివారు తమపేరు తదితర వ్యక్తిగత వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, ‘‘మాకు క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు నైరోబీలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాకు సహాయం చేస్తారు’’అని నైరోబీకి చెందిన మార్గరెట్ కారీ చెప్పారు. కొన్ని ఆసుపత్రులు దేశీయ రోగులతో పోలిస్తే అంతర్జాతీయ రోగులకు ట్రీట్మెంట్ రేట్లు అమాంతం 50 శాతం మేర పెంచేసి వసూలు చేస్తున్నారు. ఇలాంటి ఆసుపత్రులు ఫెసిలిటేటర్లకు బిల్లును బట్టి 15 నుంచి 20 శాతం కూడా ఇస్తున్నారని సమాచారం. ‘సోమాలియాలో ఆరోగ్య సంరక్షణకు సరైన మౌలిక సదుపాయాలు లేవు. దాంతో చికిత్స కోసం థాయ్‌లాండ్, మలేషియా, చైనాకు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు చాలామంది భారతదేశానికి, అందులోనూ హైదరాబాద్‌కు వస్తున్నారు, అందువల్ల నేనిక్కడ ఉంటూ బంధువులు, స్నేహితులకు సహాయం చేయడం ప్రారంభించాను. అలా చాలామంది నాతో కనెక్ట్ అయ్యారు’అని 10 ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన సోమాలియా జాతీయుడైన జువేద్ అన్నారు. ఏజెన్సీలూ ఉన్నాయి... మెడికల్ టూరిజమ్ సేవలు అందించే కొన్ని అంతర్జాతీయ కంపెనీలు చట్టప్రకారం కొందరిని ఫెసిలిటేటర్లుగా నియమించుకుని రోగులకు సహాయకులుగా వినియోగిస్తాయి. ఇలాంటి సంస్థలు ఢిల్లీ, ముంబై, బెంగుళూర్లలో ఎక్కువ. వాటి సేవలు హైదరాబాద్‌కు ఇంకా విస్తృతంగా వ్యాపించలేదు. దాంతో ఇక్కడ వ్యక్తిగతంగా సేవలు అందించే ఫెసిలిటేటర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. వీటిని అందిపుచ్చుకుంటున్న విదేశీ విద్యార్థులు నగరంలోని హైదరాబాద్, ఉస్మానియా వంటి యూనివర్సిటీల్లో చదువుకుంటూ పార్ట్‌టైమ్‌గా ఈ విధులు నిర్వర్తిస్తున్నారు. పదేళ్లు, పన్నెండేళ్ల పాటు నర్సింగ్ స్టాఫ్, ఫిజియోథెరపీ స్టాఫ్‌గా సేవలు అందించినవాళ్లు కూడా జోర్డాన్, ఇరాక్, సిరియా తదితర మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి వచ్చి అక్కడి పరిచయాలను, అరబిక్ భాష మీద పట్టు లాంటి సానుకూల అంశాలతో ఫెసిలిటేటర్ల అవతారం ఎత్తుతున్నారు. ఉభయ కుశలోపరి విధానం మా ఆసుపత్రికి నైజీరియా, కెన్యా, సుడాన్, సోమాలియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు వస్తుంటారు. వీరి కోసం మేం అధికారికంగా ఉన్న సంస్థల నుంచి ఫెసిలిటేటర్ల సేవలు అందుకుంటాం. అరుదుగా మాత్రం తెలిసిన, పరిచయస్తులను ఉపయోగించుకుంటాం. రోగులకు ఎదురయ్యే భాషా పరమైన ఇతర అవరోధాలకు పరిష్కారంగానూ, మరోవైపు ఇక్కడ విద్యార్జన తదితర పనులపై వచ్చేవారికి ఆదాయమార్గంగానూ ఈ విధానం ఉపకరిస్తోంది. –డా.కిషోర్‌రెడ్డి, అమోర్ ఆసుపత్రి -
తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్.. ‘హైదరాబాదీ’ విజయగాథ !
భారతదేశంలో ముస్లిం సముదాయం నుంచి తొలి మహిళా న్యూరోసర్జన్ అయిన ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీకి దక్కింది. ఆమె హైదరాబాదీ కావడంతో తెలంగాణకు కూడా ఈ ఖ్యాతి దక్కినట్లే. పదవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదివిన హఫిఫా ఆ తర్వాత నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనసాగించి అనేక రికార్డులు సాధించింది. ‘ఆడపిల్లలు తాము అనుకున్నది సాధించేవరకు ఓటమి అంగీకరించవద్దు’ అంటున్న హఫిఫా గురించి... కొన్ని అద్భుతాలు మన పక్కనే జరుగుతుంటాయి. అయితే అవి వినమ్రంగా ఉండటం వల్ల కూడా మనకు తెలియవు. చిన్న గెలుపుకు ఆకాశమంత ఆర్భాటం చేస్తారు కొందరు. పర్వాతాన్ని పిండి కింద కొట్టినా మెదలకుండా ఉంటారు మరి కొందరు. 28 ఏళ్ల మరియమ్ హఫిఫా అన్సారీకి తను సాధించిన విజయం పట్ల చాలా వినమ్రత ఉంది. ఎందుకంటే ఆమె అది తన గెలుపుగా భావించక ‘అల్లా మియా ఇచ్చిన కానుక’ అంటుంది కనుక. అదే ఆమె ఘనత డాక్టర్ మరియమ్ హఫిఫా అన్సారీ మన హైదరాబాద్‌లోనే ఉంటుంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో న్యూరోసర్జరీ రెసిడెంట్‌గా ఉంది. న్యూరో సర్జరీ విభాగంలో చురుగ్గా పని చేస్తూ ఉంది. త్వరలో ఆమె పూర్తిస్థాయి న్యూరో సర్జన్‌గా విధులు నిర్వహించనుంది. అయితే ఏమిటి ఘనత అంటారా? భారతదేశంలో ముస్లింలలో న్యూరోసర్జన్ అయిన తొలి మహిళ మరియమ్ హఫిఫా. సాధారణంగా మహిళా డాక్టర్లు పిడియాట్రిషియన్లుగా, గైనకాలజిస్టులుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ను ఎంచుకుంటారు. ఇతర ముఖ్య విభాగాలను ఎంచుకున్నా న్యూరోసర్జరీలోకి ప్రవేశించేవారు తక్కువ. ముస్లింలలో అసలు లేరు. ఆ అడ్డంకిని దాటి న్యూరోసర్జన్ అయ్యింది మరియమ్ హఫిఫా. తప్పు అని నిరూపించండి ‘ఆడపిల్లలు అది చేయలేరు.. ఇది చేయలేరు అని కొందరు విమర్శిస్తుంటారు. ఆడపిల్లలు వెనక్కి తగ్గకూడదు. అలా అనేవారి మాటలు తప్పు అని నిరూపించేలా విజయాలు సాధించాలి’ అంటుంది హఫిఫా. పెయింటింగ్‌లో హఫిఫాకు అభిరుచి ఉంది. కాలిగ్రఫీని కూడా సాధన చేస్తోంది. సర్జరీ చేస్తున్న హఫిఫా ఫొటోను షేర్ చేసి ‘భారతదేశపు తొలి ముస్లిం మహిళా న్యూరోసర్జన్’ అని గర్వపడింది ఆమె సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలోని ముస్లిం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (ఎం.ఎస్.ఓ). కాని ఆమె ఆ ఘనత సాధించిందంతా ఇక్కడే కనుక నిజంగా గర్వపడాల్సింది తెలంగాణనే. ఉర్దూ మీడియమ్‌లో చదివి హఫిఫా మరియంది మహారాష్ట్రలోని మాలేగావ్. అక్కడే ఏడవ తరగతి వరకూ ఉర్దూ మీడియంలో చదువుకుంది. తల్లి ఉర్దూ టీచర్. ఆమె సింగిల్ పేరెంట్‌గా తన కుమార్తెను పెంచడానికి సిద్ధపడి హైదరాబాద్ వలస వచ్చింది. ఇక్కడే పదోతరగతి వరకూ మళ్లీ ఉర్దూ మీడియంలోనే చదివి టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది హఫిఫా. చిన్నప్పటి నుంచి డాక్టర్ కానీ, సైంటిస్ట్ కాని కావాలని ఆమె కల. నెమ్మదిగా సైంటిస్ట్‌ను పక్కన పెట్టి డాక్టర్ కలను గట్టిగా పట్టుకుంది. ‘నా ఒంటి మీద తెల్లకోటు, మెడలో స్టెతస్కోపు ఉండాలి. నన్ను అందరూ డాక్టర్ హఫిఫా అని పిలవాలి అనుకున్నాను’ అంటుందామె. కాని మెడిసిన్ చదివించే స్తోమత లేదు. బాగా చదువుకుంటే తప్ప ఉచిత సీటు రాదు. దాంతోపాటు ఉర్దూ మీడియంలో చదవడం వల్ల ఇప్పుడు ఇంగ్లిష్ మీడియమ్‌కు అలవాటు పడాలి. అందుకే రేయింబవళ్లు చదివేది హఫిఫా. టెన్త్ అయ్యాక హైదరాబాద్‌లో ఇంటర్ విద్యార్థుల ఎంట్రన్స్ కోసం టాలెంట్ టెస్ట్ పెడితే టాపర్‌గా వచ్చింది హఫిఫా. దాంతో ఒక కాలేజీ వాళ్లు ఇంటర్లో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఆ తర్వాత మెడికల్ ఎంట్రన్స్‌లో ఏకంగా 99వ ర్యాంకు సాధించింది. ఉస్మానియాలో ఎం.బి.బి.ఎస్. చదివింది. ఎం.బి.బి.ఎస్.లో ఆమెకు ఐదు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఆ తర్వాత ‘పోస్ట్ జనరల్ సర్జరీ’లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఎఫ్.ఆర్.సి.ఎస్. (లండన్) పూర్తి చేసింది. 2020లో మళ్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ రాసి 137వ ర్యాంకు సాధించి ‘న్యూరోసర్జరీ’ విభాగాన్ని తీసుకుంది. చదవండి: Lotus: నీటి తొట్లలో తామరల పెంపకం.. ధర 300 నుంచి 4 వేల వరకు! నెలకు 50 వేల దాకా మైక్రోబయాలజీలో ఎమ్మెస్సీ! ఈ పూలు వాడిపోవు.. ఆమె హాబీ.. ఆదాయ వనరుగా ఎలా మారిందంటే! -
చావు బ్రతుకుల మధ్య 8 రోజులుగా..
ఆగ్రా : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పెరుగుతున్న రోగుల సంఖ్య కారణంగా అందరికీ సరైన వైద్యం అందటం లేదు. ఓ వైపు కొన్ని ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వేధిస్తుంటే.. మరో చోట సిబ్బంది కొరత. ఈ నేపథ్యంలో హైడ్రోసెఫాలస్తో బాధపడుతున్న ఓ మూడు నెలల ఆగ్రా చిన్నారి న్యూరోసర్జన్ కోసం చావు బ్రతుకుల మధ్య గత 8 రోజులుగా ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, ఆగ్రాకు చెందిన పూజ, లవ్‌కేశ్ కుమార్‌లకు మార్చినెలలో ఓ కూతరు పుట్టింది. చిన్నారి హైడ్రోసెఫాలస్తో బాధపడుతోందని తెలుసుకున్న వారు ఏప్రిల్ 15న ఎస్ఎన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆసుపత్రిలోని న్యూరోసర్జన్ చిన్నారికి ఆపరేషన్ చేశాడు. (స్టేట్ హోంలో 57 మందికి కరోనా.. ఐదుగురికి గర్భం!) పాప కోలుకోవటంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. అయితే కొద్ది రోజల తర్వాత చిన్నారి తల వాయటం మొదలైంది. దీంతో జూన్ 14న మళ్లీ ఆసుపత్రి తీసుకొచ్చారు. తమ ఆసుపత్రిలో ఉన్న ఒక్క న్యూరోసర్జన్ క్వారంటైన్లో ఉన్నాడని, వైద్యం అందించలేమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో చావు బ్రతుకుల మధ్య ఆ చిన్నారి గత ఎనిమిది రోజులుగా వైద్యుడి కోసం ఎదురు చూస్తోంది. దీనిపై చిన్నారి తండ్రి మాట్లాడుతూ.. ‘‘ న్యూరోసర్జన్ క్వారంటైన్లో ఉన్నాడని ఆసుపత్రి వారు చెప్పారు. ఆపరేషన్ చేసినప్పటికి పాప బ్రతకదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించేంత ఆర్థిక స్థోమత నాకు లేదు’’ అని అన్నారు. -
'తల' రాత మారుతుందా?
శుక మహర్షి.. వినాయకుడు.. నరసింహస్వామి... పురాణ పాత్రలుగా కాకుండా వీరిలోని సారూప్యమేమిటో తెలుసా. ముగ్గురిదీ మానవ దేహమేకానీ తలలు మాత్రం వేర్వేరు జంతువులవి. మరి అలాంటివి ఇప్పుడు సాధ్యమవుతాయా? అంటే అసాధ్యమేమీ కాదంటున్నాడు ఇటలీకి చెందిన న్యూరోసర్జన్ సెర్గియో కానవెరో. జంతువు తలకాకపోయినా ఒక మనిషికి మరో మనిషి తల అతికించి చూపిస్తానని చెబుతున్నాడు. దానిపై ప్రయోగానికీ సిద్ధమైపోయాడు. ఇది వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తుందో.. లేక ఇద్దరు పిచ్చివాళ్ల ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోతుందో మాత్రం వేచిచూడాల్సిందే.. ఆ ప్రయోగం కథా కమామిషు ఇదీ.. తల మార్పిడి శస్త్రచికిత్స సాధ్యమేనని దాదాపు ఏడాది కింద సెర్గియో కానవెరో ప్రకటించాడు. దీనిపై విమర్శలు, చర్చలు వంటివెన్నో జరిగినా.. తర్వాత విషయం సద్దుమణిగింది. తర్వాత తల మార్పించుకునేందుకు ఓ వ్యక్తి ముందుకు రావడంతో కానవెరో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. ప్రయోగానికి తల తాకట్టు.. కానవేరో ప్రయోగానికి సహకరించేందుకు, తన తలను పణంగా పెట్టేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి పేరు వాలరీ స్పిరిడినోవ్. రష్యాకు చెందిన ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 31ఏళ్ల ప్రాయంలోనే ‘వర్డ్నిగ్ హాఫ్‌మ్యాన్’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కాళ్లూ చేతులు చచ్చుబడిపోయి చక్రాల కుర్చీకి పరిమితమైపోయిన వాలరీ... శరీర కండరాలు క్షీణిస్తూ మరింత నరకం అనుభవిస్తున్నాడు. ఓ లక్ష్యం కోసం తన ప్రాణాన్ని తాకట్టుపెడితే తప్పేంటంటూ ప్రయోగానికి సిద్ధమయ్యాడు. కోతులపై ప్రయోగం సక్సెస్! 1970లో అమెరికా న్యూరోసర్జన్ రాబర్ట్ వైట్ ఓ కోతి తలను మరోదానికి అమర్చడంలో విజయం సాధించారు. తల మార్పిడి తరువాత కూడా ఆ కోతి కొన్ని రోజుల పాటు బతికింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ కాలపు స్పైనల్‌కార్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ ద్వారా తల మార్పిడి సాధ్యమేనని అంటున్నారు కానవేరో. 36 గంటలు.. రూ.140 కోట్లు ఖర్చు.. కానవెరో తలపెట్టిన తల మార్పిడి శస్త్రచికిత్సకు 36 గంటల సమయం పడుతుందని, దాదాపు రూ.140 కోట్లు ఖర్చవుతుందని అంచనా. డాక్టర్లు, నర్సులు, సైకాలజిస్టులు, టెక్నాలజిస్ట్‌లు, వర్చువల్ రియాలిటీ నిపుణులు కలుపుకొని దాదాపు 150 మంది ఈ ప్రాజెక్టులో పాలు పంచుకుంటున్నారు. రాబర్ట్ వైట్ మాదిరిగా ఇటీవల ఓ కోతి తలను మార్చేసిన జియోపింగ్ రిన్ (హార్బిన్ వైద్య విశ్వవిద్యాలయం, చైనా), ఎలుక వెన్నుపూసను విరిచేసి మళ్లీ విజయవంతంగా అతికించిన సీ-యూన్ కిమ్ (కోన్‌కుక్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్, దక్షిణ కొరియా)లు కానవేరో బృందంలో ఉన్నారు. ఆపరేషన్ జరిగే తీరు ఇలా.. తల మార్పిడి శస్త్రచికిత్స ఎలా జరుగుతుందన్న విషయంపై కానవెరో 2013లోనే సర్జికల్ న్యూరాలజీ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ఓ పరిశోధనా వ్యాసం సమర్పించారు. 2015లో అకాడమీ ఆఫ్ న్యూరోలాజికల్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ 39వ సమావేశంలోనూ ఈ ప్రక్రియను వివరించారు. దాని ప్రకారం... తొలుత తలమార్పిడి శస్త్రచికిత్స కోసం ప్రత్యేకమైన ఆపరేషన్ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు. వాలరీ (తల మార్పిడి ప్రయోగానికి ముందుకు వచ్చిన వ్యక్తి), శరీర దాత (బ్రెయిన్‌డెడ్ అయిన ఓ వ్యక్తిని గుర్తించారు)ల శరీరాలకు రెండు బృందాలు ఏకకాలంలో వేర్వేరుగా శస్త్రచికిత్సలు జరుపుతాయి. మత్తుమందు ఇవ్వడంతోపాటు ఊపిరి ఆడేందుకు గొట్టాలను అమరుస్తారు. తల కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటూ..మెదడు, గుండె పనితీరును గమనిస్తూ ఉంటారు. ముందుగా వాలరీ తలను శీతలీకరిస్తారు. తల ఉష్ణోగ్రత 12 నుంచి 15 డిగ్రీలకు తగ్గిపోయినప్పుడు మెదడు తాత్కాలికంగా పనిచేయడం మానివేస్తుంది. వాలరీ మెదడులోని రక్తం మొత్తాన్ని తీసేసి, సాధారణ సర్జరీ సొల్యూషన్‌ను నింపుతారు. మెదడు నుంచి రక్తం తీసేసిన కరోటిడ్, జగ్లర్ నాడుల చుట్టూ సిలికాన్, ప్లాస్టిక్‌లతో చేసిన గొట్టాలను అమరుస్తారు. ఈ దశలో వాలరీ, శరీర దాత మెడలపై లోతైన గాటు పెట్టి ఇద్దరి మెడ కండరాలను గుర్తిస్తారు. తల మార్చేటప్పుడు ఒకదానిని మరోదానితో మ్యాచ్ చేసేందుకు ఇది అత్యవసరం. రెండో అంకం..: రెండో అంకంలో వాలరీ, శరీర దాత వెన్నెముకలను కోసి తలలు వేరు చేస్తారు. ఇందుకోసం టెక్సాస్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కోటి నలభై లక్షల రూపాయల విలువైన కత్తిని వినియోగిస్తారు. ఇద్దరి తలలు వేరు చేశాక.. గంటలోపే తల మార్పిడి జరగాలి. లేదంటే మెదడుకు రక్త ప్రసరణ జరగక మరణించే అవకాశం ఉంటుంది. వాలరీ తలను దాత దేహానికి అమర్చి, నాడులన్నింటినీ జాగ్రత్తగా అతికిస్తారు. దాత దేహం నుంచి వెచ్చటి రక్త ప్రసరణ చేయిస్తారు. దీంతో మెదడు పనిచేయడం మొదలవుతుంది. ఇదే సమయంలో వెన్నెముకను, దానిచుట్టూ ఉండే సున్నితమైన యాక్సాన్స్ను ప్రత్యేకమైన పాలిథిలీన్ గ్లైకాల్ పదార్థం సాయంతో అతికిస్తారు. మెడ, దేహాన్ని కలిపే అన్ని అవయవాల (కంఠనాళం తదితరాలు)ను కచ్చితంగా జోడించడం ద్వారా శస్త్రచికిత్స పూర్తవుతుంది. దాదాపు నాలుగు వారాలపాటు కోమాలో ఉన్న తరువాత వాలరీ మెదడు పూర్తిస్థాయిలో పనిచేస్తుందని కానవెరో అంచనా వేస్తున్నారు. 3 నుంచి 6 నెలల్లో వాలరీ అన్ని పనులు స్వయంగా చేసుకోగలడని చెబుతున్నారు. ఈ శస్త్రచికిత్స వెన్నెముక గాయాలకు మెరుగైన చికిత్స అందించడం వంటి అనేక ఇతర చికిత్సా విధానాల రూపకల్పన, అభివృద్ధికీ తోడ్పడుతుందని నిపుణుల అంచనా. ఈ శస్త్రచికిత్స ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తారన్నది ఇంకా ప్రకటించలేదు.