దుబాయ్ రాజా, మజాకా!
డ్రైవర్లకు కూడా'ఫైవ్‌స్టార్' వసతి...
లండన్: రాజు వెడలె రవి తేజములలరగ...అన్నట్టుగా ఇకముందు లండన్ వీధుల్లో కూడా దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ లగ్జరీ కారులో ముందుకు సాగిపోతుంటే వెంట మరో 114 లగ్జరీ కారులు రయ్...రయ్...మంటూ సాగిపోతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధానమంత్రిగా, ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్న దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన థేమ్స్ నది ఒడ్డున బ్యాటర్‌సీ హెలిపోర్టు పక్కన తన కార్ల పార్కింగ్ కోసం దాదాపు రూ. 200 కోట్లతో పలు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కేవలం కార్ల పార్కింగ్ కోసం భూగర్భంలో రెండు ఫోర్లు, భూ ఉపరితలంపై ఆరు అంతస్తులు, ఆపైన కార్ల డ్రైవర్లు, ఇతర సిబ్బంది కోసం ఐదు నక్షత్రాల హోటల్ వసతులతో అందమైన భవనాన్ని నిర్మిస్తున్నారు.
తన 23 మంది పిల్లలు హెలికాప్టర్లలో లండన్ వచ్చి తమకిష్టమైన లగ్జరీ కారులో షికారు చేయడానికి వీలుగా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే భవనం నిర్మించాలనుకుంటున్న ప్లాట్‌లో యువరాజు తన లగ్జరీ కార్లను పార్కు చేస్తున్నారు. ఇక శాశ్వత భవనాన్ని నిర్మించి, డ్రైవర్లకు ఫైవ్‌స్టార్ వసతులు కూడా కల్పిస్తే వారి కార్లతో కలుపుకొని ఆ వీధిలో దాదాపు 120 కార్ల రాకపోకల రొదతో తాము చావాల్సి వస్తుందని ఇరుగు, పొరుగువారు ఇప్పటికే స్థానిక కౌంటీ మున్సిపాలిటీకి ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారి ఫిర్యాదును ఖాతరు చేయకుండా యువరాజు షేక్ భవన ప్లాన్‌కు కూడా మున్సిపాలిటీ అవసరమైన అనుమతులు ఇచ్చింది. జుమీరా లగ్జరీ హోటళ్ల గ్రూపునకు అధిపతి కూడా అయిన దుబాయ్ యువరాజుకు లండన్‌లో పలు హోటల్ బ్రాంచ్‌లు, వసతి గృహాలు ఉన్నాయి. ఆయన 114 కార్ల డ్రైవర్లు మాత్రం తమకు కలగబోయే 'ఫైవ్‌స్టార్' వసతి గురించి అప్పుడే కలలు కనడం ప్రారంభించారు.