luxurious accomodation
-
ఈ రైలులో ఒక టికెట్ ధర రూ. 38 లక్షలు..!
న్యూఢిల్లీ: పర్యాటక రంగం దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తుంది. పర్యాటకులను ఆకర్షించడం కోసం ప్రభుత్వాలు వినూత్న ఆలోచనలు చేస్తాయి. అలా భారతదేశం ప్రారంభించిన కార్యక్రమమే లగ్జరీ రైళ్లు. సాధారణంగా మన దగ్గర విమానం ఎక్కడం చాలా విలాసవంతంగా భావిస్తారు. కానీ ఒక్కసారి ఈ విలాసవంతమైన రైళ్లను చూస్తే.. ఆ ఆలోచన మారిపోతుంది. ఇక వీటి టికెట్ ఖరీదు కూడా అంతే లగ్జరీగా ఉంటుంది. ఒక్క టికెట్ ఏకంగా 38 లక్షల రూపాయలు ఉంటుంది. భారతదేశ రైల్వే సౌజన్యంతో దేశంలో నడుస్తున్న డెక్కన్ ఒడిస్సీ, మహారాజాస్ ఎక్స్‌ప్రెస్, ది గోల్డెన్ చారిట్ వంటి రైళ్లు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే కాదు, భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైళ్లు కూడా. ఇండియన్ రైల్వే నడుపుతున్న ఈ 5 లగ్జరీ రైళ్లను చూడండి. 1. దక్కన్ ఒడిస్సీ ఈ రైలులోకి ప్రవేశించగానే రాయల్ బ్లూ కలర్ అలంకరణ మిమ్మల్ని కట్టిపడేస్తుంది. అత్యంత ఖరీదైన విదేశీ ఇంటీరియర్స్, డీలక్స్ క్యాబిన్లు, రెస్టారెంట్ సహా సకల హంగులతో ఉన్న ఈ రైలులో ప్రయాణిస్తుంటే.. మీకు మీరే మహారాజా, మహారాణిలా అనిపించడం ఖాయం. ఈ రైలు ముంబై-ఢిల్లీ మధ్య ప్రయాణం చేస్తుంది. దీనిని తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ నిర్వహిస్తుంది. మహారాష్ట్ర టూరిజం శాఖ చొరవతో, డెక్కన్ ఒడిస్సీని 16 వ శతాబ్దంలో మహారాజుల విలాసవంతమైన జీవితాలను ప్రతిబింబించేలా రూపుదిద్దారు. ఛార్జీలు: డీలక్స్ క్యాబిన్: డబుల్ ఆక్యుపెన్సీ - రూ .7,79,362 ప్రెసిడెన్షియల్ సూట్: డబుల్ ఆక్యుపెన్సీ - రూ .11,76,837 2. గోల్డెన్ చారిట్ కర్ణాటక స్టేట్ టూరిజం బోర్డ్ అధ్వర్యంలో నడుస్తోన్న గోల్డెన్ చారిట్ అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలను మీకు చూపిస్తుంది. కర్ణాటకను పాలించిన రాజవంశాల పేరిట ఉన్న 11 అతిథి క్యాబిన్లలో ప్రతి ఒక్కటి సొగసైన మైసూర్ తరహా ఫర్నిచర్‌తో రూపొందించబడింది. ఈ రైలులో ఆయుర్వేద స్పా సెంటర్ కూడా ఉంది. ఛార్జీలు: గోల్డెన్ చారిట్లో 6 రాత్రులు, 7 రోజులు ఖర్చు రూ .5,88,000, 3 రాత్రులు, నాలుగు రోజుల ఖర్చు రూ .3,36,000. 3.మహారాజాస్ ఎక్స్‌ప్రెస్ దీనిలో ప్రయాణం మీ రోజువారి ఆలోచనల నుంచీ మీకు ఇది విశ్రాంతినిస్తుంది. ప్రపంచ ట్రావెల్ అవార్డుల ద్వారా దీనిని వరుసగా 6 సంవత్సరాల పాటు "వరల్డ్స్ లీడింగ్ లగ్జరీ ట్రైన్" గా గుర్తింపుపొందింది. భారతదేశ వారసత్వాన్ని వ్యాప్తి చేయాలనే ఆలోచనతో ఈ రీగల్ రైలు నిర్మించబడింది. రైలులో ప్రెసిడెంట్ సూట్ ప్రైవేట్ లాంజ్‌లు, బెడ్రూమ్లు, విలాసవంతమైన వాష్‌రూమ్‌లు, ఖరీదైన భోజన ప్రదేశంతో రాజుల ప్యాలెస్‌ను తలపిస్తుంది. ఛార్జీలు: ఈ రైలులో ఆరు రాత్రులు, ఏడు రోజులు ట్విన్ డీలక్స్ క్యాబిన్ టికెట్ రూ .8,94,000, ప్రెసిడెన్షియల్ సూట్ ధర రూ .37,93,000. 4. ప్యాలెస్ ఆన్ వీల్స్ ఒకప్పుడు హైదరాబాద్ నిజాంలు, సార్వభౌమ రాష్ట్రాలైన రాజ్‌పుతానా, గుజరాత్, ఇతరులు రవాణ కోసం ఉపయోగించారు. రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన మొదటి హెరిటేజ్ లగ్జరీ రైలు ఇది. భారతీయులకు, విదేశీ సందర్శకులకు రాజ ప్రయాణాన్ని పరిచయం చేసిన తొలి రైలు ఇదే. ఛార్జీలు: ఈ రైలులో ఏడు రాత్రుల డీలక్స్ క్యాబిన్ ధర రూ .5,23,000. అదే సమయంలో, ఏడు రాత్రులు సూపర్ డీలక్స్ క్యాబిన్ 9,42,000 రూపాయలు. 5. బుద్ధ ఎక్స్‌ప్రెస్ బుద్ధ ఎక్స్‌ప్రెస్ సహాయంతో మధ్యప్రదేశ్, బిహార్ లోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. వీటిలో బోధ్ గయా, రాజ్గీర్, నలంద వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ రైలులో చిన్న లైబ్రరీ, రెస్టారెంట్,ఇతర సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఛార్జీలు: ఈ రైలులో, ఒక రాత్రికి రూ .12,000, 7 రాత్రుల ఛార్జీలు రూ .86,000. -
ఖైదీలకు టీవీలు, సోఫాలా?
న్యూఢిల్లీ: జైళ్లలో ఖైదీలకు విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ‘ఖైదీలకు ఎల్ఈడీ టీవీలు, సోఫాలు, మినరల్ వాటరా? తీవ్ర ఆరోపణలతో అరెస్టయి జైళ్లలో ఉన్న వారికి లగ్జరీ సదుపాయాలు కల్పిస్తారా? జైళ్లలో ఏమైనా సమాంతర వ్యవస్థ నడుస్తోందా?’అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గృహ కొనుగోలుదారులను మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టయి తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న యూనిటెక్ ఎండీ సంజయ్ చంద్ర, అతని సోదరుడు అజయ్ చంద్రలకు లగ్జరీ సౌకర్యాలు కల్పిస్తున్నారన్న వార్తలపై సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుం టున్నారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు.. తీహార్ జైలులో సౌకర్యాలపై సదరు జైలు అధికారులు సహా జైళ్ల శాఖ డీజీ హస్తం ఉందని భావిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి తన నివేదికలో తెలిపారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తున్న వారిపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నివేదిక సహా పలువురు ఖైదీల లేఖల ఆధారంగా హైకోర్టు దీనిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం, జైళ్ల శాఖ డీజీ, పలువురు సీనియర్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై 2019 ఫిబ్రవరి 1లోగా స్పందనను తెలపాలని వారిని ఆదేశించింది. -
దుబాయ్ రాజా, మజాకా!
డ్రైవర్లకు కూడా'ఫైవ్‌స్టార్' వసతి... లండన్: రాజు వెడలె రవి తేజములలరగ...అన్నట్టుగా ఇకముందు లండన్ వీధుల్లో కూడా దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తూమ్ లగ్జరీ కారులో ముందుకు సాగిపోతుంటే వెంట మరో 114 లగ్జరీ కారులు రయ్...రయ్...మంటూ సాగిపోతాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ప్రధానమంత్రిగా, ఉపాధ్యక్షుడిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్న దుబాయ్ యువరాజు షేక్ మొహమ్మద్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన థేమ్స్ నది ఒడ్డున బ్యాటర్‌సీ హెలిపోర్టు పక్కన తన కార్ల పార్కింగ్ కోసం దాదాపు రూ. 200 కోట్లతో పలు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. కేవలం కార్ల పార్కింగ్ కోసం భూగర్భంలో రెండు ఫోర్లు, భూ ఉపరితలంపై ఆరు అంతస్తులు, ఆపైన కార్ల డ్రైవర్లు, ఇతర సిబ్బంది కోసం ఐదు నక్షత్రాల హోటల్ వసతులతో అందమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. తన 23 మంది పిల్లలు హెలికాప్టర్లలో లండన్ వచ్చి తమకిష్టమైన లగ్జరీ కారులో షికారు చేయడానికి వీలుగా ఈ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే భవనం నిర్మించాలనుకుంటున్న ప్లాట్‌లో యువరాజు తన లగ్జరీ కార్లను పార్కు చేస్తున్నారు. ఇక శాశ్వత భవనాన్ని నిర్మించి, డ్రైవర్లకు ఫైవ్‌స్టార్ వసతులు కూడా కల్పిస్తే వారి కార్లతో కలుపుకొని ఆ వీధిలో దాదాపు 120 కార్ల రాకపోకల రొదతో తాము చావాల్సి వస్తుందని ఇరుగు, పొరుగువారు ఇప్పటికే స్థానిక కౌంటీ మున్సిపాలిటీకి ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారి ఫిర్యాదును ఖాతరు చేయకుండా యువరాజు షేక్ భవన ప్లాన్‌కు కూడా మున్సిపాలిటీ అవసరమైన అనుమతులు ఇచ్చింది. జుమీరా లగ్జరీ హోటళ్ల గ్రూపునకు అధిపతి కూడా అయిన దుబాయ్ యువరాజుకు లండన్‌లో పలు హోటల్ బ్రాంచ్‌లు, వసతి గృహాలు ఉన్నాయి. ఆయన 114 కార్ల డ్రైవర్లు మాత్రం తమకు కలగబోయే 'ఫైవ్‌స్టార్' వసతి గురించి అప్పుడే కలలు కనడం ప్రారంభించారు.