
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత, సరిహద్దుల్లో యుద్ధమేఘాల నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరివెళ్లారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించడంతో పాటు, మౌలిక వసతులను సమకూర్చుతుందనే ఆరోపణలకు ఆమె మద్దతు కూడగట్టనున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతిమిస్తోన్న పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకిని చేసేలా భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఓఐసీ విదేశాంగ మంత్రుల భేటీలో ముఖ్యఅతిధిగా పాల్గొననున్న సుష్మా స్వరాజ్ పనిలోపనిగా పాక్ దుర్నీతిని అరబ్ దేశాల్లో ఎండగట్టేందుకు ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
తమ భూభాగంలో ఉగ్రవాదులను ఏరివేయాలని ఇప్పటికే పాకిస్తాన్‌ను అమెరికా, చైనా సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించాయి. మరోవైపు గురువారం మధ్యాహ్నం ప్రధాని నివాసంలో జరిగిన ఉన్నతస్ధాయి సమావేశంలో పాల్గొన్న అనంతరం సుష్మా స్వరాజ్ సౌదీ బయలుదేరివెళ్లారు. పలువురు ఉన్నతాధికారులు, సీనియర్ మంత్రులు సహా త్రివిధ దళాధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతతో పాటు సరిహద్దుల్లో పరిస్థితి గురించి సమగ్రంగా సమీక్షించారు. కాగా అరబ్ దేశాల కూటమి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ) మార్చి 1, 2 తేదీల్లో దుబాయ్‌లో నిర్వహించనున్న విదేశాంగ మంత్రుల సమావేశాల్లో సుష్మా స్వరాజ్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment