లాటరీలో నెగ్గాను.. జీవితం కోల్పోయాను!
లండన్: లాటరీ గెలిస్తే జీవితంలో ఎన్నో సమకూర్చుకోవచ్చునని అందరూ భావిస్తుంటారు.. కానీ జేన్ పార్క్ అనే యువతి మాత్రం జీవితం కోల్పోయానంటోంది. ఒక్క లాటరీతో తన జీవితాన్ని నాశనం చేశారంటూ లాటరీ నిర్వాహకులపై మండిపడుతోంది. 2013లో 17 ఏళ్ల వయసులో జేన్ పార్క్ యూరో మిలియన్స్ లాటరీలో విజేతగా నిలిచి 1 మిలియన్ బ్రిటన్ పౌండ్లు (భారత కరెన్సీలో 8.34 కోట్ల రూపాయలు) అందుకుంది. 'డబ్బు చేతికి రావడమే తరువాయి నాకు ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్, ఫుట్ వేర్ కోసం షాపింగ్ చేశాను. ఆపై ఎప్పుడు చూసినా షాపింగ్స్, శరీర సౌందర్యాన్ని మెరుగు పరుచుకునేందు ఎన్నో సర్జరీలు చేయించుకున్నాను. అలా చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నా వద్ద డబ్బు లేదు. జల్సాలకు అలవాడుపడ్డాను. పని చేయలేకపోతున్నాను. జీవితంలో ఎంతో కోల్పోయాను' అని లాటరీ విన్నర్ జేన్ పార్క్ ఆవేదన వ్యక్తం చేసింది.
రోజురోజుకు మార్కెట్లో కొత్త ఉత్పత్తులు వస్తున్నాయని, దీంతో పాతవాటిపై మోజు తీరిపోతుందని అభిప్రాయపడింది. ఎంత డబ్బు మనతో ఉన్నా సంతోషాన్ని, బంధాలను మాత్రం సంపాదించుకోలేమని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆ లాటరీ తన జీవితాన్ని సర్వనాశనం చేసిందని యువతి ఆరోపిస్తోంది. 'కోట్ల రూపాయలు తనవద్ద లేనప్పుడు కేవలం గంటకు ఎనిమిది పౌండ్లు సంపాదించేదాన్ని. ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. అయితే కోట్ల డబ్బు నెగ్గకముందు తన జీవితం మరో పదిరెట్లు సంతోషంతో నిండి ఉండేదని. ఏ జాబ్ చేయలేకపోతున్నానని' ఆమె వాపోయింది.
అతి పిన్న వయసు(17)లో యూరో మిలియన్స్ లాటరీ విజేతగా నిలిచి నాలుగేళ్ల కింద రికార్డు సాధించింది. అయితే లాటరీ నెగ్గాలంటే కనీస వయసు 16 నుంచి 18 ఏళ్లకు మార్చాలని అభిప్రాయపడింది. లాటరీలతో డబ్బు వృథా చేయడం కంటే చారిటీ సంస్థలకు డబ్బు విరాళంగా ఇస్తే ఎంతో మేలు జరుగుతుందని సలహా ఇచ్చింది. రొమాంటిక్ పార్ట్‌నర్‌ను వెతికి అతడితో కలిసి ఉండాలనుకున్నాను, కానీ తన డబ్బు చూసి వెంటపడేవారే ఉన్నారని ప్రేమ లాంటి వ్యవహారాలకు దూరంగా ఉన్నట్లు వివరించింది.