
వయసు పెరగకుండా.. జీవితాంతం నిత్య యవ్వనంగా కనిపించాలని కోరుకోని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు.. రోజురోజుకూ పైబడుతున్న వయసును నియంత్రించేందుకు రకరకాల మార్గాలను అన్వేషించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సినిమా వాళ్లయితే వయసు పెరిగినా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు.. ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ థెరపీల వైపు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి కోరికే ఉన్న జర్మనీలోని మోనికర్ మానోష్ అనే 45 ఏళ్ల నటి ఓ వింత పనిచేసి కొంతమేర విజయం సాధించింది. అయితే ఆ నటి వయసు తక్కువగా కనపడేలా ఉండేందుకు చేసిన ప్రయత్నమే అందరినీ విస్తుపోయేలా చేసింది.
దాదాపు 3.5 మిలియన్ ఏళ్ల నాటి సైబీరియన్ మట్టిలో లభించే బాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియాను ఏకంగా తన శరీరంలోకి ఎక్కించేసుకుంది. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 2009లో వాయువ్య రష్యాలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాసిల్లస్ ఎఫ్ కణాలు వృద్ధాప్య లక్షణాలను అడ్డుకుని.. నిత్య యవ్వనంగా ఉండేలా చేయగలవు. దీన్ని తెలుసుకున్న సదరు నటి తన రక్తంలోకి ఆ బ్యాక్టీరియాను ఎక్కించుకుంది. ఈ బ్యాక్టీరియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే చాలా మందికి దీని గురించి తెలిసినా ఏ డాక్టర్ దీన్ని సూచించడు. దీంతో తనకు తెలిసిన ఓ డాక్టర్ నుంచి ఆ నటి అవసరమైనన్ని శాంపిల్స్‌ను తీసుకుంది.
ఆ శాంపిల్స్‌ను మాస్కో స్టేట్ యూనివర్సిటీలో జియోక్రయాలజీ విభాగాధిపతి డాక్టర్ అనటోలి బ్రోచ్‌కోవ్‌కు అందించింది. ఈ డాక్టర్ కూడా ఆ బ్యాక్టీరియాను తీసుకున్నాడు. అయితే నోటి ద్వారా తీసుకున్నాడు. కానీ మానోష్ మాత్రం నేరుగా రక్తంలోకి ఎక్కించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు వద్దని ఎంత వారించినా మానోష్ వినలేదు. ఆమె వయసు తక్కువగా కనబడడానికి చేసిన ప్రయత్నాల్లో ఇదేమీ మొదటిది కాదు.. 20 ఏళ్ల క్రితం 50 వేల డాలర్లు ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment