everlasting youth
-
అరుదైన బ్యాక్టీరియాతో నిత్యయవ్వనం
వయసు పెరగకుండా.. జీవితాంతం నిత్య యవ్వనంగా కనిపించాలని కోరుకోని మనిషి ఉండడంటే అతిశయోక్తి కాదు.. రోజురోజుకూ పైబడుతున్న వయసును నియంత్రించేందుకు రకరకాల మార్గాలను అన్వేషించి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక సినిమా వాళ్లయితే వయసు పెరిగినా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు.. ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ థెరపీల వైపు పరుగులు పెడుతుంటారు. ఇలాంటి కోరికే ఉన్న జర్మనీలోని మోనికర్ మానోష్ అనే 45 ఏళ్ల నటి ఓ వింత పనిచేసి కొంతమేర విజయం సాధించింది. అయితే ఆ నటి వయసు తక్కువగా కనపడేలా ఉండేందుకు చేసిన ప్రయత్నమే అందరినీ విస్తుపోయేలా చేసింది. దాదాపు 3.5 మిలియన్ ఏళ్ల నాటి సైబీరియన్ మట్టిలో లభించే బాసిల్లస్ ఎఫ్ అనే బ్యాక్టీరియాను ఏకంగా తన శరీరంలోకి ఎక్కించేసుకుంది. ఈ బ్యాక్టీరియాను తొలిసారిగా 2009లో వాయువ్య రష్యాలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. బాసిల్లస్ ఎఫ్ కణాలు వృద్ధాప్య లక్షణాలను అడ్డుకుని.. నిత్య యవ్వనంగా ఉండేలా చేయగలవు. దీన్ని తెలుసుకున్న సదరు నటి తన రక్తంలోకి ఆ బ్యాక్టీరియాను ఎక్కించుకుంది. ఈ బ్యాక్టీరియా వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. అందుకే చాలా మందికి దీని గురించి తెలిసినా ఏ డాక్టర్ దీన్ని సూచించడు. దీంతో తనకు తెలిసిన ఓ డాక్టర్ నుంచి ఆ నటి అవసరమైనన్ని శాంపిల్స్‌ను తీసుకుంది. ఆ శాంపిల్స్‌ను మాస్కో స్టేట్ యూనివర్సిటీలో జియోక్రయాలజీ విభాగాధిపతి డాక్టర్ అనటోలి బ్రోచ్కోవ్కు అందించింది. ఈ డాక్టర్ కూడా ఆ బ్యాక్టీరియాను తీసుకున్నాడు. అయితే నోటి ద్వారా తీసుకున్నాడు. కానీ మానోష్ మాత్రం నేరుగా రక్తంలోకి ఎక్కించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు వద్దని ఎంత వారించినా మానోష్ వినలేదు. ఆమె వయసు తక్కువగా కనబడడానికి చేసిన ప్రయత్నాల్లో ఇదేమీ మొదటిది కాదు.. 20 ఏళ్ల క్రితం 50 వేల డాలర్లు ఖర్చు చేసి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించుకుంది. -
అరవైలో ఇరవై సాధ్యమే?
అరవైల్లోనూ ఇరవై ఏళ్ల యవ్వనం కావాలనుకునే వాళ్లు మనలో కోకొల్లలు. అయితే చావులేని జీవితం, నిత్య యవ్వనం కోసం ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఒక ఎత్తు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు మరో ఎత్తు. ఎందుకంటే ఫ్యూచరాలజిస్టుల అంచనాల ప్రకారం మనిషి వృద్ధాప్యాన్ని అధిగమించే సమయం దగ్గరపడినట్లే. 2025 నాటికల్లా మన శరీరాల వయసును తగ్గించే విధానాలు అందుబాటులోకి వస్తాయని వీరు అంటున్నారు. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధన వ్యాసం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. మైటోకాండ్రియాను ఆన్/ఆఫ్ చేయడం ద్వారా తామిప్పటికే మనిషి కణాల వయసును తగ్గించగలిగామని అంటున్నారు టస్కుబా విశ్వవిద్యాలయ (జపాన్) శాస్త్రవేత్త జున్ చీ హయాషీ. మరోవైపు... నికోటినామైడ్ అడినైన్ డైనూక్లియోటైడ్ (ఎన్ఏడీ) అనే పదార్థాన్ని ఎలుకల కండరాలపై ప్రయోగించినప్పుడు వాటి వయసు రెండేళ్ల నుంచి ఆరు నెలల స్థాయికి తగ్గిపోయిందని ఆస్ట్రేలియా, అమెరికా పరిశోధకులు అంటున్నారు. అంటే 60 ఏళ్ల వ్యక్తికి ఈ పదార్థాన్ని అందిస్తే... వారం రోజుల్లో అతడి శరీరం వయసు 20 ఏళ్ల వ్యక్తి స్థాయికి తగ్గిపోతుందన్నమాట! అయితే కొన్ని చిక్కులూ ఉన్నాయండోయ్! ఈ ప్రక్రియలు అత్యంత ఖరీదైనవి కావడం ఒకచిక్కయితే... కొన్ని అనుకోని పరిణామాలు సంభవించే అవకాశాలూ లేకపోలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!