అరవైలో ఇరవై సాధ్యమే?
అరవైల్లోనూ ఇరవై ఏళ్ల యవ్వనం కావాలనుకునే వాళ్లు మనలో కోకొల్లలు. అయితే చావులేని జీవితం, నిత్య యవ్వనం కోసం ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు, ప్రయోగాలు ఒక ఎత్తు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు మరో ఎత్తు. ఎందుకంటే ఫ్యూచరాలజిస్టుల అంచనాల ప్రకారం మనిషి వృద్ధాప్యాన్ని అధిగమించే సమయం దగ్గరపడినట్లే. 2025 నాటికల్లా మన శరీరాల వయసును తగ్గించే విధానాలు అందుబాటులోకి వస్తాయని వీరు అంటున్నారు.
నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్‌లో ఇటీవల ప్రచురితమైన పరిశోధన వ్యాసం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. మైటోకాండ్రియాను ఆన్/ఆఫ్ చేయడం ద్వారా తామిప్పటికే మనిషి కణాల వయసును తగ్గించగలిగామని అంటున్నారు టస్కుబా విశ్వవిద్యాలయ (జపాన్) శాస్త్రవేత్త జున్ చీ హయాషీ. మరోవైపు... నికోటినామైడ్ అడినైన్ డైనూక్లియోటైడ్ (ఎన్‌ఏడీ) అనే పదార్థాన్ని ఎలుకల కండరాలపై ప్రయోగించినప్పుడు వాటి వయసు రెండేళ్ల నుంచి ఆరు నెలల స్థాయికి తగ్గిపోయిందని ఆస్ట్రేలియా, అమెరికా పరిశోధకులు అంటున్నారు.
అంటే 60 ఏళ్ల వ్యక్తికి ఈ పదార్థాన్ని అందిస్తే... వారం రోజుల్లో అతడి శరీరం వయసు 20 ఏళ్ల వ్యక్తి స్థాయికి తగ్గిపోతుందన్నమాట! అయితే కొన్ని చిక్కులూ ఉన్నాయండోయ్! ఈ ప్రక్రియలు అత్యంత ఖరీదైనవి కావడం ఒకచిక్కయితే... కొన్ని అనుకోని పరిణామాలు సంభవించే అవకాశాలూ లేకపోలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!