ఏడుగురు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి | Five Indians With Swiss Bank Accounts Named By Swiss Authorities | Sakshi
Sakshi News home page

ఏడుగురు నల్ల కుబేరుల పేర్లు వెల్లడి

Published Wed, May 27 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM

Five Indians With Swiss Bank Accounts Named By Swiss Authorities

గెజిట్‌లో వెల్లడించిన స్విట్జర్లాండ్  
జాబితాలో పారిశ్రామికవేత్త యశ్ బిర్లా

బెర్న్: స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో డబ్బు దాచిన ఏడుగురు భారతీయుల పేర్లను ఆ దేశం బహిర్గతపరిచింది. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త యశోవర్ధన్ బిర్లా(యశ్ బిర్లా), ప్రముఖ మద్యం, స్థిరాస్తి వ్యాపారి పాంటీ చద్ధా అల్లుడు గుర్జిత్ సింగ్ కొచ్చర్, ముంబైకి చెందిన ఇద్దరు వ్యాపార ప్రముఖులు సయ్యద్ మొహమూద్ మసూద్, చాద్ కౌజర్ మొహమ్మద్ మసూద్(వీరిద్దరు లైమోజిన్ స్కామ్‌లోనూ నిందితులు), ఢిల్లీకి చెందిన మహిళాపారిశ్రామికవేత్త రితికా శర్మ, స్నేహలత సాహ్ని, సంగీత సాహ్ని ఉన్నారు. వీరి పేర్లు, పుట్టినరోజుల వివరాలను స్విస్ ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.

యశ్ బిర్లా, రితికల భారత చిరునామాను సైతం ప్రకటించారు. భారత్‌లో పన్నుల కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్నందున భారత ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అధికారుల విన్నపం మేరకు ఈ ఏడుగురి వివరాలను గెజిట్‌లో వెల్లడించారు. అలాగే వీరికి సంబంధించిన మరికొన్ని వివరాలను స్విస్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు భారత్‌తో పంచుకున్నారు. పైన పేర్కొన్న ఏడుగురు తమ వివరాలను భారత్‌కు వెల్లడించకూడదనుకుంటే ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ కోర్టులో 30 రోజుల్లోగా అపీల్ చేసుకోవాలని గెజిట్‌లో పేర్కొన్నారు.

ఇలాంటి అప్పీలు నోటీసులను ఈ నెలలో 40కిపైగా గెజిట్‌లో ప్రచురించారని, అందువల్ల మరికొంత మంది ఖాతాల వివరాలు వెల్లడయ్యే అవకాశముందని భావిస్తున్నారు. గతంలో హెచ్‌ఎస్‌బీసీ వెల్లడించిన స్విస్ ఖాతాల జాబితాలో యశ్ బిర్లా పేరున్న విషయం తెలిసిందే. అయితే, యశ్ బిర్లా పేరుతో వ్యక్తిగతంగా కానీ, ఆయన నియంత్రణలో కానీ ఎలాంటి స్విస్ అకౌంట్ లేదని యశ్ బిర్లా గ్రూప్ సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్‌లోని ఆదాయ పన్ను అధికారులకు కూడా స్పష్టం చేశామన్నారు. మిగతావారి స్పందనను తెలుసుకునేందుకు మీడియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
 
హర్షణీయం..జైట్లీ: స్విట్జర్లాండ్ మరికొంతమంది నల్ల కుబేరుల పేర్లను వెల్లడించడం హర్షణీయమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఢిల్లీలో చెప్పారు. విదేశాల్లో అక్రమంగా డబ్బు దాచడం ఇక ఎంతమాత్రం క్షేమకరం కాదని గుర్తించాలన్నారు.
 

Advertisement

పోల్

Advertisement