
ఈ బైకిస్టు గుండె ఆగినంతపనైంది
ఆస్ట్రేలియా: గాల్లో ఎగిరొచ్చిన ఒక పెద్ద పరుపు రోడ్డుపై వేగంగా వెళుతోన్న ఓ బైకిస్టుకి షాకిచ్చింది. అదే సమయంలో అతడి ప్రాణాలు కాపాడింది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ సంఘటన ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లోగల సొరంగ మార్గంలో ఆరన్ ఉడ్ అనే వ్యక్తి వేగంగా బైక్‌పై వెళుతున్నాడు. అదే సమయంలో అతడి ముందు పరుపులతో ఒక ట్రక్కు వెళుతోంది. అయితే, అనూహ్యంగా ఆ ట్రక్కులో నుంచి రెండు పరుపులు గాల్లోకి లేచాయి. అందులో ఒకదాన్ని ఆరన్ ఉడ్ తప్పించుకున్నా మరో పరుపు ఎగిరొచ్చి తన బైక్ ముందు పడిపోయింది.
అప్పటికే అతడు ఫుల్ స్పీడ్‌లో ఉన్నాడు. దీంతో బైక్‌తోపాటు అది ఈడ్చుకొచ్చింది. అమాంతం బ్రేక్ వేయడంతో అతడు కొద్ది ఎత్తు గాల్లోకి లేచి తిరిగి ఆ పరుపుపైనే నిలదొక్కుకుని హమ్మయ్య అనుకున్నాడు. అతడి వెనుకాలే వచ్చిన వాహనదారులు అనంతరం దానిని తీసి పక్కకు పెట్టి ముందుకు కదిలారు. ఈ ప్రమాదంలో అతడి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌కు 275 డాలర్ల ఫైన్ వేశారు. ఈ ప్రమాదంపై స్పందించిన ఆరన్ తాను గత 20 ఏళ్లుగా బైక్ నడుపుతున్నానని, ఇలాంటి సంఘటన ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పాడు. అంతపెద్ద ప్రమాదంలో తాను బతికుండటం చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారని తెలిపాడు.