
పురుషులకే గుండెపోటు ముప్పు ఎక్కువ
వాషింగ్టన్ : అమెరికాలోని ప్రతి తొమ్మిది మంది పురుషుల్లో ఒకరు, అలాగే ప్రతి 30 మంది స్త్రీలలో ఒకరు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్నారని నార్త్‌ఈస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. అమెరికాలో ఏటా సుమారు 4.5 లక్షల మంది గుండెపోటుతో మరణిస్తుంటే వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు.
45 సంవత్సరాల లోపున్న పురుషుల్లో 10.9 శాతం మంది అకస్మాత్తుగా గుండెపోటుకు గురవుతుంటే, అదే వయసున్నా స్త్రీలు కేవలం 2.8 శాతం మందికి మాత్రమే ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారని పరిశోధనలో వెల్లడైంది. ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు లేని 5,200 మందిపై దశాబ్దం పాటు పరిశోధనలు జరిగాయి. వీరిలో 375 మంది అకస్మాత్తుగా గుండెపోటుతో మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా రక్తపోటు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, డయాబెటిస్ వంటివి గుండెపోటుకు ప్రధాన కారణమని వారు తెలిపారు.