పిజ్జా డెలివరీ రోబో ఇదిగో...
వస్తువులను వినియోగదారులకు అందించేందుకు డ్రోన్‌లను పరీక్షిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే డ్రోన్‌లను నిపుణులైన వారు నియంత్రించాలి. బాగా ఖరీదైన వ్యవహారం కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకొనే డొమినోస్ పిజ్జా సంస్థ ఒక రోబోను రూపొందించింది. చిత్రంలో కనిపిస్తున్నది పిజ్జా డెలివరీ రోబో. డొమినోస్ ఔట్‌లెట్ నుంచి 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ఏ చిరునామాకైనా ఇది పిజ్జాను తీసుకెళ్లి అందజేస్తుంది. ఆన్‌లైన్లో పిజ్జా ఆర్డర్ చేసి చెల్లింపు చేశాక... ఈ డీఆర్‌యూ (డొమినోస్ రోబోటిక్ యూనిట్) రోబో ఆర్డరిచ్చిన వస్తువులను తీసుకొని బయలుదేరుతుంది. ఫుట్‌పాత్‌పై నిర్ణీత వేగంతో వెళుతుంది.
నావిగేషన్ వ్యవస్థ ఆధారంగా డెలివరీ ఇవ్వాల్సిన చిరునామాకు చేరుకుంటుంది. మార్గమధ్యంలో రోడ్డుపై ఏవైనా ఆటంకాలు ఎదురైనా ఇందులో అమర్చిన సెన్సర్ల సహాయంతో వాటిని గుర్తించి... పక్కకు జరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అంటే దారిలో వచ్చిన దేన్నైనా ఢీ కొడుతుందనే భయం లేదు. పైగా ఇందులో పిజ్జాను వేడిగా, కూల్‌డ్రింక్స్‌కు చల్లగా ఉంచే ఏర్పాట్లున్నాయి. ఈ రోబో బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే... 20 కిలోమీటర్ల దూరం వెళ్లి పిజ్జాను డెలివరీ చేసి తిరిగి స్టోర్‌కు వచ్చేస్తుంది. ఈ డెలివరీ రోబో ప్రాజెక్టుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. మరో రెండేళ్లలో న్యూజిలాండ్‌లోని పట్టణాల్లో రోడ్లపై ఈ పిజ్జా డెలివరీ రోబోలను చూడొచ్చు.