
షాంగైలో భర్తల నర్సరీ...
మీలో చాలా మంది హీరో వెంకటేశ్ నటించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సినిమా చూసే ఉంటారు. అందులో ఆడవాళ్లతో హీరో షాపింగ్‌కు వెళ్లే సీన్ చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వని వాళ్లు ఉండరేమో కదా! అందులో ఆడవాళ్లతో షాపింగ్‌కు వచ్చిన మగవారు ఎన్నో రోజులుగా అక్కడే ఉంటూ బ్రష్ చేసుకుంటూ, షేవింగ్ చేసుకుంటూ షాపింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు.. ఇదంతా సినిమాలో చూసి రియల్ లైఫ్‌లో అలా ఉండదులే అని భావిస్తే పొరపడ్డట్లే... ఎందుకంటే చైనా షాంగైలోని ఓ షాపింగ్ మాల్‌లో అచ్చం సినిమాలోలాగే జరుగుతోంది.
భార్యలతో పాటు షాపింగ్‌కు వచ్చే భర్తల కోసం సదరు మాల్ నిర్వాహకులు భర్తల నర్సరీని ఏర్పాటు చేశారు. అందులో టీవీలు చూస్తూ, పేపర్స్, మేగజైన్స్ చదువుతూ, మసాజ్ చైర్‌లో సేదతీరుతూ వారు గడిపేస్తున్నారు. సాధారణంగా భర్తల కోసం మాల్స్‌లో బార్లు, కేఫ్‌లు నిర్వహిస్తుంటారు. కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని. కాని ఈ షాంగైలోని మాల్‌లో హస్‌బెండ్ నర్సరీ పూర్తిగా ఉచితం. కాబట్టి భార్యలందరూ తమ భర్తలను ఆ నర్సరీలో విడిచి వెళ్లి దర్జా గా గంటలు...గంటలు షాపింగ్ చేస్తున్నారు. అందుకే ఇటీవల ఆడవాళ్ల షాపింగ్‌లపై ఇంగ్లండ్‌లో జరిపిన ఓ సర్వే ప్రకారం సగటున 26 నిమిషాల షాపింగ్‌ను భార్యలు చేస్తే వారి భర్త ఆ తర్వాత బోర్‌గా ఫీలవుతున్నట్లు, 80 శాతం మంది షాపింగ్ అంటే బెంబెలెత్తిపోతున్నట్లు, మరో 45 శాతం మంది షాపింగ్‌కు రానంటే రామని భీష్మించుకుని కూర్చున్నారని తేలింది. దీనికి విరుగుడుగా చైనాలో ఇలా నర్సరీ చిట్కా ప్రయోగించారేమో.