చైనాకు పుండు మీద కారం చల్లినట్టైంది!
బీజింగ్: ఇటీవల జైషే మహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్‌పై నిషేధం విధించే తీర్మానానికి ఐక్యరాజ్యసమితిలో మోకాలడ్డి భారత్‌ను కవ్వించింది చైనా. ఇప్పుడా పొరుగు దేశానికి భారత్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. వరల్డ్ విఘర్ కాంగ్రెస్ (డబ్ల్యూయూసీ) నాయకుడు దొల్కన్ ఇసాకు మనం దేశంలో పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం వీసా మంజూరు చేసినట్టు తెలుస్తోంది. ముస్లింలు అధికంగా ఉండే కల్లోల జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదానికి డబ్ల్యూయూసీ మద్దతు తెలుపుతున్నదని చైనా ఆరోపిస్తున్నది. ఉగ్రవాదిగా భావించే ఆ సంస్థ నాయకుడికి ఇప్పుడు భారత్ వీసా ఇస్తున్నదన్న వార్తలతో చైనాకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది.
ఈ నెల 28న హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జరగనున్న సదస్సు కోసం దోల్కన్ ఇసాకు భారత్ అనుమతించినట్టు తెలుస్తున్నది. ప్రవాసంలోని టిబెట్ ప్రభుత్వం ధర్మశాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రవాస ప్రభుత్వాన్ని ఆమోదించని చైనా.. దలైలామాపై భారత్ వైఖరిని తరచూ తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇసాకు భారత్ వీసా వార్తలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇసా ఉగ్రవాది అని, అతనిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీచేసిందని, అతన్ని చట్టముందుకు తీసుకురావడానికి అన్ని దేశాలు సహకరించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నది.