వాషింగ్టన్: భారత్–అమెరికాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం రోజురోజుకూ పుంజుకుంటోంది. వచ్చే వారంలో భారత్ –అమెరికాల డిఫెన్స్ టెక్నాలజీస్ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (డీటీటీఐ) తొమ్మిదో సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ముగిసేనాటికి రెండు దేశాల మధ్య రక్షణ రంగ వాణిజ్యం 18 బిలియన్ డాలర్ల (రూ. లక్షా ఇరవై ఏడువేల కోట్లు)కు చేరుకుంటుందని పెంటగాన్ వర్గాలు అంచనావేశాయి. ఇరుదేశాల మిలిటరీ టు మిలిటరీ సంబంధాలను బలపరిచేందుకు తాము కట్టుబడి ఉన్నామని అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టైన్‌మెంట్ ఎలెన్ ఎం లార్డ్ తెలిపారు. 2008లో ఇరు దేశాల మధ్య సున్నాగా ఉన్న వాణిజ్యం ఈ సంవత్సరం ముగిసేనాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుకోవడం గొప్పవిషయమని తెలిపారు. గత ఆగస్టులో అమెరికా భారత్‌కు ట్రేడ్ అథారిటీ టైర్ 1 స్థాయిని ఇచ్చిందని, నాటో కూటమి దేశాలకు కాకుండా మరో దేశానికి ఈ గుర్తింపు ఇవ్వడం ఇదే ప్రథమమని తెలిపారు. వచ్చేవారం ఎలెన్ భారత్ చేరుకొని భారత డిఫెన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ అపూర్వ చంద్రతో భేటీ కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment