పదేళ్లుగా అలా ఓ కర్రలా...
హైదరాబాద్: గడిచిన పదేళ్లుగా ఆమె ఒక కర్రలా అలా పడుంది. లేచి నడవలేదు కదా కనీసం కూర్చోలేదు కూడా. లక్షల్లో ఒకరికన్నట్టు వచ్చే ఒక వింత జబ్బు ఆమెను వెంటాడుతోంది. ఇండొనేషియాకు చెందిన సెంట్రల్ జావాలోని స్రాజెన్ ప్రాంతానికి సులామీ (35) అనే యువతి గడిచిన పదేళ్లుగా నడవలేదు. మంచంపైన తన ఇష్టానుసారంగా కదలలేదు. కేవలం ఒక కర్ర మాదిరిగా అలా ఉండిపోవలసిందే.
ఎవరో ఒకరు తోడుండీ మోసుకెళ్తే గానీ కదలలేని దయనీయ స్థితి. 90 ఏళ్ల అమ్మమ్మ ఆమెకు సేవలు అందించాలి. ఎవరైనా ఎత్తి నిలబెడితే కర్ర సహాయంతో కొద్ది కొద్దిగా కాళ్లను కదుపుతూ నడుస్తోంది. ఇండొనేషియా హెల్త్ డిపార్ట్ మెంట్ నివేదిక ప్రకారం ఆమె ఆంకిలోసింగ్ స్పాండిలైటిస్ అనే జబ్బుతో బాధపడుతోంది. జన్యు పరంగా వచ్చే అరుదైన జబ్బే ఆంకిలోసిస్ స్పాండిలైటిస్. ఇదొచ్చిన వాళ్లు వెన్నెముకతోపాటు ఇతర భాగాలు చచ్చుబడిపోతాయి. మొదట్లో ఇది నడుము నొప్పితో మొదలవుతుంది. అది క్రమేణా తీవ్రమై ఇలా కదలలేని స్థితికి చేరుకుంటారు. ఇది వచ్చిన వాళ్లు ఒక కర్ర మాదిరిగా అలా ఉండిపోవాల్సిందే. ఎటూ కదలలేరు. కూర్చోలేరు. నడవలేరు. శరీరంలోని ఏ భాగాన్ని కూడా కదల్చలేరు. ఎప్పుడూ అలా చచ్చుబడినట్టు ఉండాల్సిందే.
ఇది రావడం వల్ల జీవన కాలమేమీ తగ్గదు. కానీ దీని వల్ల గుండెపోటు, వెన్నుపూస విరగడం, ఛాతిలో ఇన్ఫెక్షన్ కు గురికావడం, మూత్ర పిండాల సమస్య వంటివి ఉత్పన్నం కావొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ వింత వ్యాధి సోకిన వాళ్లకు క్రమం తప్పకుండా మందులు వాడుతుండటంతో పాటు ఫిజియోథెరఫీ చేయించడం తప్పని సరి. అలా చేస్తున్న దశలో కొంచెం కొంచెంగా దానికదే పరిస్థితి మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.