నోబెల్ రేసులో అత్యాచార బాధితురాలు
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అత్యాచార బాధితురాలు యాజిదీ నడియా మురాడ్.. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి రేసులో నిలిచింది. 2016 ఏడాదికి ఇవ్వనున్న ఈ అవార్డుకు నడియాతో పాటు పోప్ ఫ్రాన్సిస్, అఫ్ఘాన్ మహిళల సైక్లింగ్ టీమ్ తదితరుల పేర్లను నామినేట్ చేశారు. నామినేషన్ల స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసింది.
ఐదుగురు సభ్యులతో కూడిన నార్వే నోబెల్ కమిటీకి 200 నామినేషన్లు వచ్చాయి. విజేతను ఎంపిక చేసేందుకు వచ్చే నెల 29న ఈ కమిటీ సమావేశం కానుంది. నోబెల్ అవార్డుకు నడియా పేరును నార్వేకు చెందిన చట్టసభ సభ్యుడు ఒకరు ప్రతిపాదించారు. ఐఎస్ సెక్స్ బానిసత్వం నుంచి తప్పించుకున్న నడియా.. ఐఎస్ బాధితులకు ప్రతినిధిగా నిలిచింది. పోప్ ఫ్రాన్సిస్ పేరును నోబెల్ శాంతి బహుమతి గ్రహీత డెస్మండ్.. అఫ్ఘాన్ మహిళల సైక్లింగ్ టీమ్ను ఇటలీ చట్టసభ సభ్యులు 118 మంది నామినేట్ చేశారు.