
వాషింగ్టన్: హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు(జీఈఎస్)–2017 కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్ పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన పారిశ్రామికవేత్తలను కలిసేందుకు తనకు చాలా ఉత్సాహంగా ఉందన్నారు. భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉన్న బలమైన మైత్రీ బంధానికి ఈ సదస్సు ఒక సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ నెల 28న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న మూడు రోజుల జీఈఎస్ సదస్సు కోసం రానున్న అత్యున్నత స్థాయి అమెరికా అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలతో కూడిన ప్రతినిధి బృందానికి ఇవాంకా నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే.ఈ సదస్సులో 170 దేశాల నుంచి 1,500 మంది పారిశ్రామికవేత్తలు పాలుపంచుకోనున్నారు. ఒక్క అమెరికా నుంచే 350 మంది ప్రతినిధులు రానున్నారు. వీరిలో ఎక్కువ మంది ఇండియన్ అమెరికన్లే. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ సదస్సులో ఇవాంకా కీలక ప్రసంగం చేయనున్నారు.
అమెరికాకు భారత్ ఒక అద్భుతమైన మిత్ర దేశమని, భాగస్వామి అని ఇవాంకా పేర్కొన్నారు. ఈ సదస్సు ముఖ్య లక్ష్యం ఆర్థిక, భద్రతా రంగాల్లో అభివృద్ధిని గురించి పంచుకోవడమే అని అన్నారు. వుమెన్ ఫస్ట్, ప్రాస్పరిటీ ఫర్ ఆల్ అనే థీమ్‌తో ఈసారి సదస్సు జరుగుతోందని, మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించినప్పుడే సమాజంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమెరికా అధికారుల సమాచారం ప్రకారం.. ఇవాంకా కొద్ది సమయం ప్రముఖ స్థలాలు సందర్శించేందుకు కేటాయించే అవకాశం ఉంది.
వీలయితే చార్మినార్‌ను ఆమె సందర్శిస్తారు. సదస్సు సందర్భంగా ఇవాంకా రెండు సెషన్లలో పాల్గొంటారు. ఇందులో మొదట మంగళవారం సాయంత్రం ప్లీనరీ సెషన్‌లో ‘బీ ద చేంజ్– వుమెన్స్ ఎంట్రప్రెన్యూరల్ లీడర్‌షిప్’లోనూ.. బుధవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ సెషన్‌లో ‘వుయ్ కెన్ డూ ఇట్! ఇన్నోవేషన్స్ ఇన్ వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, స్కిల్ ట్రైనింగ్’లోనూ ఆమె పాల్గొంటారు.
బేగంపేట విమానాశ్రయానికి ఇవాంకా!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరంలో ఈ నెల 28న ప్రారంభం కానున్న ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు హజరవనున్న ఇవాంకా ట్రంప్ బృందం.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బదులు బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకోనున్నారని తెలిసింది. ఇవాంకా పర్యటన వల్ల శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జీఈఎస్ అతిథులకు అమెరికా తేనీటి విందు
30న నోవాటెల్‌లో..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సు (జీఈఎస్)కు వచ్చే అతిథులకు అమెరికా ప్రభుత్వం తరఫున స్థానిక యూఎస్ కాన్సులేట్ అధికారులు తేనేటి విందు ఇవ్వనున్నారు. ఈ నెల 30 సాయంత్రం నోవాటెల్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా అమెరికా గురించి ప్రజెంటేషన్ కూడా ఉండనుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సదస్సుకు హాజరయ్యే అతిథులకు ఈ నెల 28న ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోదీ, 29న రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ గోల్కొండ కోటలో విందు ఇవ్వనున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment