భారత్ నిజాన్నిదాచింది..! | JuD chief Hafiz Saeed threatens India: ‘Pakistan will show what surgical strikes are’ | Sakshi
Sakshi News home page

భారత్ నిజాన్నిదాచింది..!

Published Sat, Oct 1 2016 4:31 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM

భారత్ నిజాన్నిదాచింది..!

భారత్ నిజాన్నిదాచింది..!

సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందంటూ భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన ప్రకటన అంతా పెద్ద డ్రామా అని పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ చీఫ్, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పేర్కొన్నాడు. ఉడీ ఆర్మీ స్థావరంపై కాశ్మీరీ ముజాహిదీన్ నిర్వహించిన దాడుల్లో సుమారు 177 మంది వరకూ ఆర్మీ జవాన్లు చనిపోయారని, అయితే భారత్ మాత్రం కేవలం 19 మంది చనిపోయినట్లు ప్రకటించిందని అతడు వెల్లడించాడు.  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడం అంతా బూటకమంటూ ముంబై దాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కొట్టిపారేశాడు.

భారత్ పై పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో త్వరలోనే చూస్తారు అంటూ హఫీజ్ సయీద్ హెచ్చరికలు జారీ చేశాడు.శుక్రవారం ఫైజలాబాద్ లో నిర్వహించిన ఓ సమావేశంలో హఫీజ్ భారత్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు.  పాకిస్థాన్ తల్చుకుంటే అగ్ర దేశం అమెరికా కూడా అడ్డుకోలేదని, భారత్ కు సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఏమిటో చూపించేందుకు పాకిస్థాన్ ఆర్మీకి ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నిరకాలుగా అనుమతులు ఇవ్వాలని అతడు కోరాడు.

కాశ్మీరీలను చంపినప్పుడు ప్రపంచమంతా నిశ్శబ్దంగా ఉండిపోయిందని, కాశ్మీరీ ముజాహిదీన్ ఉడీలో దాడులు నిర్వహిస్తే మాత్రం ఆమెరికాతో పాటు అన్ని దేశాలు  ఎందుకు మేల్కొన్నాయంటూ ప్రశ్నించిన హఫీజ్... జూలై 8న జరిగిన ఎన్ కౌంటర్ లో హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వని మరణమే  కాశ్మీర్ వ్యాలీలో అశాంతికి కారణమైందన్నాడు. ఉరీ దాడిలో సైనికాధికారులు, మేజర్లతో కలిపి మొత్తం 177 మంది మరణించగా అనేకమంది గాయపడ్డారని, అయితే భారత్ నిజాన్ని కప్పిపుచ్చి..  కేవలం 19 మంది జవాన్లు మాత్రమే మృతి చెందినట్లు ప్రకటించిందని హఫీజ్ పేర్కొన్నాడు. కేవలం ప్రతీకారాన్ని ప్రకటించడంకోసం భారత్ ఎల్వోసీ దాటిందని, దానికి పాకిస్థాన్ నుంచి తగిన స్పందన త్వరలో ఎదుర్కోక తప్పదని హఫీజ్ సయీద్ తన ప్రసంగంలో  పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ఆర్మీకి పూర్తిశాతం అనుమతులు ఇవ్వాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను కోరాడు.

Advertisement
Advertisement