పరిపాలనా సంగతులు ఎలాఉన్నా ఇతర వ్యాపకాలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు కొందరు దేశాధినేతలు. గుర్రపుస్వారీ చేయటమో, బైక్ పై దూసుకెళ్లటమో, ప్రోటోకాల్ పక్కన పెట్టి నలుగురితో కలిసి చిందులెయ్యటమో లేక లక్షల రూపాయల సూట్లు ధరించడమో.. లాంటివి చేస్తూ జనం, మీడియా దృష్టిని ఆకర్షిస్తూంటారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికన్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఆయా సందర్భాల్లో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడీ జాబితాలో కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రుడెయు కూడా చేరిపోయారు.
44 ఏళ్లకే ఉత్తరఅమెరికా ఖండంలోని అతిపెద్ద దేశమైన కెనడాకు ప్రధానిగా ఎన్నికయిన జస్టిన్.. రాజకీయాల్లోకి రాకముందు అథ్లెట్. స్నో బోర్డింగ్, యోగాల్లో విశేష ప్రావిణ్యం సాధించారు. ఎన్నికల ప్రచారంలోనూ చంటిపిల్లల్ని ఒంటిచేత్తో పైకెత్తి తన ప్రతిభచాటుకున్నారు. ఉత్సాహవంతుడైన జస్టిన్ తన కార్యాలయంలోని టేబుల్ పై పీకాక్ పోజ్ (మయూరాసనం) వేసిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నిజానికి ఈ ఫొటో మూడేళ్ల కిందటిది. 2013, ఏప్రిల్ లో జస్టిన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఆయన అభిమానులు కొందరు ఆ పాత ఫొటోను మళ్లీ రీట్వీట్ చేయడంతో ఇప్పుడిది వైరల్ అయింది. ఫొటోతోపాటు 'మీ దేశ ప్రధాని ఇలా చెయ్యగలడా?' అంటూ జస్టిన్ అభిమానులైన కెనడియన్లు నెటిజన్లను ప్రశ్నిస్తున్నారు. మరి మీరేం బదులిస్తారు?