టోక్యో: జపాను దేశాన్ని భారీ తుపాన్ అతలాకుతలం చేసింది. గత 25ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా టైఫూన్ జెబీ గడగడలాడించింది. జెబీ ధాటికి ఏడుగురు మృతి చెందగా, వందల సంఖ్యలో ప్రజలు క్షతగ్రాతులయ్యారు. 2.3 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. గంటకు 210కి.మీ. వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లపై వాహనాలు గాలికి కొట్టుకుపోయాయి. దీంతో రవాణా పూర్తిగా స్థంభించింది. ముఖ్యంగా ఒసాకాలోని కన్‌సాయ ఎయిర్‌పోర్టులోకి వరద నీరు పోటెత్తడంతో పలు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 700 విమానాలను రద్దు చేశారు. క్యూటోలో రైల్వే స్టేషన్ పైకప్పు కూడా గాలికి కొట్టుకుపోయింది. జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దేశంలోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేల సంఖ్యలో గ్రామాలు, పట్టణాలు చీకట్లో ఉన్నాయి. సముద్ర తీరంలోని నిషినోమియా కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా వందల కార్లు అగ్నికి ఆహుతయ్యాయి.
1993లో సంభవించిన భారీ తుపాన్ తరువాత ఇదే అతిపెద్ద తుపాను అని అధికారులు తెలిపారు. మరోవైపు సురక్షిత ప్రాంతాలకు చేరాల్సిందిగా జపాన్ ప్రధాని షింజో అబే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్వాసితులను కాపాడటానికి అన్ని అవసరమైన చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment