బీరట్: తనకు ప్రాణహాని ఉందంటూ లెబనాన్ ప్రధాని సాద్ హరీరి ఇటీవల ఆకస్మిక రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నప్పుడు ఆయన ఒక వీడియో సందేశం ద్వారా రాజీనామా ప్రకటన చేశారు. కాగా, సౌదీ నుంచి ప్రధాని హరీరి తిరిగి స్వదేశానికి చేరుకోలేదు. అప్పట్నుంచీ ఆయన ఎక్కడ ఉన్నారనేది తెలియడం లేదు. దీంతో లెబనాన్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు హరీరి సౌదీ అరేబియాలో కిడ్నాప్‌కు గురయ్యారంటూ హిజ్బుల్లా సంస్థ ఆరోపించింది.
ప్రధాని హరీరి అదృశ్యంపై లెబనాన్ అధ్యక్షుడు మైఖెల్ అవాన్ సౌదీ అరేబియాతో సంప్రదింపులు జరిపారు. తమ ప్రధాని ఇంతవరకూ స్వదేశానికి ఎందుకు తిరిగిరాలేదో వివరణ ఇచ్చుకోవాలన్నారు. ఆయనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోంది కాబట్టే తమ దేశంలో ఆశ్రయం కల్పించామని సౌదీ చెప్పినట్టు సమాచారం. లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం ప్రదర్శిస్తోందని.. అంతేగాక తన ప్రాణానికి ముప్పు ఉందని, తండ్రిలాగే తనను కూడా చంపేస్తారేమోనని హరీరి ఆందోళన వ్యక్తంచేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను అవాన్ ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. హరీరి రాజీనామా విషయం వెలుగుచూసిన రోజే సౌదీలో యువరాజులు, మంత్రులు, వ్యాపార దిగ్గజాల అరెస్టులు మొదలు కావడం పలు అనుమాలకు దారి తీస్తోంది.
సాదీ అరేబియా పర్యటనలో అదృశ్యమైన సాద్ హరీరి
Comments
Please login to add a commentAdd a comment