ఒంటరితనం ప్రమాదమే!
వాషింగ్టన్: ఊబకాయం కంటే ఒంటరితనమే చాలా ప్రమాదకరమని తాజా అధ్యయనంలో వెల్లడైంది.ఊబకాయం కంటే ఒంటరితనం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు తొందరగా మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు రెండు ప్రత్యేక బృందాలపై బ్రిగామ్ యంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించి తెలిపారు.
ఒంటరితనంలో జీవించే దాదాపు 3.4 లక్షల మందిని, సమాజంతో కలసి జీవించే 3 లక్షల మందిపై పరిశోధన నిర్వహించారు. ఒంటరితనంతో జీవించే వారి కంటే సమాజంతో కలసిపోయి బతికేవారిలో 50 శాతం మంది ఆలస్యంగా మరణిస్తున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు వర్సిటీకి చెందిన జూలియన్ హోల్ట్ లూస్టడ్ వెల్లడించారు. ఒంటరితనంతో జీవించే వారికి అనారోగ్య సమస్యలు రావడంతోపాటు మరణం కూడా ముందుగానే సంభవిస్తోందని చెప్పారు. సామాజిక సంబంధాలు మెరుగుపరచుకోవడం ద్వారా దీనిని అరికట్టగలమని భావిస్తున్నట్లు చెప్పారు.