రోబో చేతులు... ఎన్నో చేతలు!
లండన్: క్రికెట్లో వికెట్ కీపర్‌లా.. ఫుట్‌బాల్‌లో గోల్ కీపర్‌లా... పనిచేసే కొత్త రకం రోబోలు వచ్చేస్తున్నాయి.. గాలిలో ఎగిరే వస్తువులను అత్యంత కచ్చితత్వంతో పట్టుకునే ఇలాంటి రోబోలను శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. వివిధ దిశల్లో అనేక రకాల ఆకృతుల్లో ఉండే వస్తువులను కూడా సెకనులో ఐదువందల వంతులోపే ఈ రోబో చేతులు పట్టుకోగలవు. టెన్నిస్ రాకెట్, వాటర్‌బాటిల్, బాల్ ఇలా ఏ ఆకృతిలో.. ఎలాంటి పరిమాణంలో.. ఏ దిశలో ఉన్నా సరే గాలిలోనే పట్టుకోవడం దీని ప్రత్యేకత.
1.5 మీటర్ల పొడుగుతో ఉండే ఈ రోబో హ్యాండ్‌కు నాలుగు వేళ్లు అమర్చారు స్విట్జర్లాండ్‌కు చెందిన పరిశోధకులు.. లాసా (లర్నింగ్ ఆల్గోరిథమ్స్ అండ్ సిస్టమ్స్ లాబోరేటరీ)లో వీటిని రూపొందించారు. క్షిష్టమైన పనుల్లో మనుషులకు బదులుగా ఈ రోబో హ్యాండ్‌లను ఉపయోగించుకోవచ్చని లాసా అధిపతి ఆడ్ బిలార్డ్ తెలిపారు. విశ్వంలో శాటిలైట్‌లకు మరమ్మతులు చేయడానికి భవిష్యత్తులో రోబో హ్యాండ్‌లను ఉపయోగించే అవకాశం ఉందని పేర్కొన్నాడు.