ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎంపికైంది.
న్యూయార్క్: ప్రపంచంలోనే నివసించడానికి అత్యంత యోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ ఎంపికైంది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) తాజాగా నిర్వహించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల సర్వేలో ఈ విషయం వెల్లడైంది. వియన్నా, వాంకోవర్ నగరాలను వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకే చెందిన సిడ్నీ నగరం టాప్ 10 నుంచి కిందకు పడిపోయింది. చిన్న నగరాలైన అడిలైడ్, పెర్త్ టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 140 నగరాలపై స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాలను ఆధారంగా చేసుకుని ఈఐయూ ఈ సర్వే చేసింది. మొదటి లేదా చివరి పది సిటీల్లో ఏ భారత నగరానికీ చోటు దక్కలేదు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.