కింగ్.. కాంగ్..
చూడగానే.. జబ్బుపడి లేచినట్లు కనిపిస్తున్నాడు కదూ ఈ పిల్లాడు. మనకిలా కనిపిస్తున్నాడు కానీ.. వీడు దైవాంశ సంభూతుడట.. వీడు జబ్బు పడటం ఏంటి.. వేరే వాళ్ల జబ్బుల్ని సైతం ఇట్టే మాయం చేయగలడని లోకలోళ్లు చెబుతున్నారు. కంబోడియాలోని నార్ అనే గ్రామంలో ఉండే కాంగ్ కెంగ్(2) అద్భుత బాలుడిగా పేరొందాడు. వీడి దర్శనం కోసం లావోస్, వియత్నాం నుంచి కూడా జనం వేల సంఖ్యలో వస్తారు. కొన్ని నెలల క్రితం ప్రమాదం వల్ల పక్షవాతం వచ్చిన తమ సమీప బంధువు ఒకరికి వీడు నయం చేశాడట. అది ఆ నోటా ఈ నోటా పాకి.. ఇలా సెలబ్రిటీ అయిపోయాడు.
కాంగ్ పడుకున్నప్పుడు మైక్‌లో.. ‘అద్భుత బాలుడు పడుకున్నాడు. ఎవరూ సౌండ్ చేయకండి.. లేదంటే ఆయనకు ఆగ్రహమొస్తుంది’ వంటి అనౌన్స్‌మెంట్లు ఇక్కడ కామన్. వీడు ప్రత్యేకమైన మూలికలతో చూర్ణం చేసి.. అమృతాంజనం బాటిళ్ల వంటివాటిలో నింపుతాడు. తర్వాత దానిపై వీడు చేయి పెడితే.. ఆ చూర్ణానికి అద్భుత శక్తులు వచ్చేసి.. దాన్ని తీసుకున్నవారి జబ్బులను నయం చేసేస్తాయట. గత నెల్లో ఓ 20 వేల మంది కాంగ్ దర్శనానికి వస్తే.. వారిలో దాదాపు వేయి మందికి స్వస్థత చేకూరిందట.
తాము అందరికీ ఉచితంగా మందులిస్తున్నామని.. తమకేమీ అక్కర్లేదని, వచ్చినోళ్లు స్థానిక బౌద్ధాలయాలకు రూ.50 చొప్పున విరాళమివ్వాలని కాంగ్ తండ్రి చెబుతున్నారు. మందులైతే ఉచితమేగానీ.. కాంగ్‌ను వ్యక్తిగతంగా కలవాలంటే మాత్రం రూ.100-150 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.