ప్రాణం కోసం చెయ్యి.. | most dangerous situations who escapes death edgely | Sakshi
Sakshi News home page

ప్రాణం కోసం చెయ్యి..

Published Wed, May 25 2016 12:22 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ప్రాణం కోసం చెయ్యి..

ప్రాణం కోసం చెయ్యి..

కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు మనిషిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్తాయి. ఈ స్థితిలో బతికేందుకు ప్రయత్నించిన వారిలో కొందరే చావును జయిస్తారు. అలాంటివారి గాథలు ఎప్పుడూ ఆసక్తికరంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అలా పట్టువదలకుండా ప్రయత్నించి, మృత్యువును జయించిన కొందరి కథల గురించి తెలుసుకుందాం..
 
ఆహారం లేకుండా 42 రోజులు..
ఏ మనిషైనా ఆహారం లేకుండా మూడు, నాలుగు వారాలకు మించి జీవించలేడు. అదికూడా వారి శారీరక స్థితిపై ఆధారపడి ఉంటుంది. కానీ కెనడాకు చెందిన హెలెన్ కెల్బెన్ మాత్రం ఆహారం లేకుండా 42 రోజులు జీవించింది. అమెరికాకు చెందిన కెలెన్ ఫెయిర్ బ్యాంక్స్ నగరం నుంచి సీటిల్‌కు వెళ్లాలనుకుంది. అప్పుడు ఆమె వయసు 21 సంవత్సరాలు. 1963 ఫిబ్రవరి 4న రాల్ఫ్ ఫ్లోర్స్‌తో కలిపి, ప్రత్యేక విమానంలో సీటిల్‌కు బయలుదేరింది. అయితే మంచు తుపాను కారణంగా మధ్యలోనే కెనడా సమీపంలోని ఓ మంచు పర్వతం వద్ద వారి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో వారికి కొన్ని చోట్ల ఎముకలు విరగడంతోపాటు, చిన్నచిన్న గాయాలు కూడా అయ్యాయి. వారి వద్ద అత్యవసర స్థితిలో రక్షణకు ఉపయోగపడే పూర్తిస్థాయి సామగ్రి కూడా లేదు.

కానీ అగ్గిపెట్టెతోపాటు, వారం రోజులకు సరిపడా ఆహారం మాత్రం ఉంది. విమానం కూలిపోయిన ప్రాంతంలో మంచు ఉండడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం చాలా తక్కువగా (-41 డిగ్రీలు) ఉన్నాయి. ఈ స్థితిలో వారు ప్రాణాలు నిలుపుకొనేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. విమానం క్యాబిన్‌లోంచి ఓ బ్లాంకెట్‌ను తయారు చేసుకుని, ఇంధనంతో మంట వెలిగించుకున్నారు. వారం తర్వాత ఆహారం అయిపోయింది. మంచుకరగసాగింది. ఈ సమయంలో వారికి నీళ్లు మాత్రమే ఉన్నాయి. అది కూడా మంచును కరిగించడం వల్ల లభించినవే. అలా నీటితోనే ఒకటి, రెండూ కాదు.. ఏకంగా 42 రోజులపాటు జీవించారు. చివరకు ఓ విమానం వారి జాడను కనిపెట్టడంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. సాధారణంగా ఆహారం లేకుండా అన్ని రోజులు జీవించడం కష్టమే. కానీ వారిరువురూ చాలా లావుగా ఉండడం వల్ల ఒంట్లో ఉన్న కొవ్వే వారిని రక్షించిందని వైద్యుల విశ్వాసం.

ప్రాణం కోసం చెయ్యి..
అమెరికాకు చెందిన ఆరన్ రాల్‌స్టన్‌కు పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. ఎప్పటిలాగే ఏప్రిల్ 2003లో ఉతాహ్ ప్రాంతంలోని బ్లూజాన్ పర్వతారోహణకు వెళ్లాడు. పర్వతం పైకి ఎక్కుతున్న సమయంలో 360 కిలోల బరువున్న ఓ రాయి అతడి కుడి చేయిపై పడింది.

దీంతో అతడి చేయి రాయి కింద ఇరుక్కుపోయి, నలిగిపోయింది. ఆ రాయిని పక్కకు జరిపేందుకు అతడు ఎంతగానో ప్రయత్నించాడు. అయినప్పటికీ అది సాధ్యపడలేదు. ఒంటరిగా చిక్కుకుపోయిన అతడిని రక్షిచేవారెవరూ అక్కడలేరు. అలా ఆరు రోజులపాటు చేయి రాయికింద ఇరుక్కుపోయి అలాగే ఉంది. ఆ చేయి అలాగే రాయికింద ఉంటే, ఇంక కొద్ది రోజులకు అతడి ప్రాణాలు పోవడం ఖాయం. పైగా ఆ చేయినరాలు పూర్తిగా నలిగిపోయి, చేతికి స్పర్శ కూడా లేకుండా పోయింది. చివరకు ఈ సమస్య నుంచి బయపడేందుకు అతడు ఓ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. రాతికింద ఇరుక్కున్న భాగాన్ని కోసేసుకోవాలనుకున్నాడు. వెంటనే తన దగ్గరున్న ఓ చిన్న కత్తి సాయంతో అక్కడివరకు చేయిని కోసేసి, ప్రాణాలతో బయటపడ్డాడు. అతడి కథతో ‘127 అవర్స్’ అనే మూవీ కూడా రూపొందింది.


సముద్రంలోనే 133 రోజులు..
1942 నవంబర్‌లో బెన్‌లోమాండ్ అనే ఓ బ్రిటన్ నౌక దక్షిణాఫ్రికా నుంచి డచ్ ప్రాంతమైన గియానాకు బయలు దేరింది. అట్లాంటిక్ సముద్రం మీదుగా దక్షిణ అమెరికా తీరానికి దాదాపు 1,207 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఓ జర్మన్ బోటు ఢీకొనడంతో రెండు పడవలూ మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ ఒకేఒక వ్యక్తి పూన్ లిమ్.

చైనాకు చెందిన ఈ నావికుడు ప్రమాద సమయంలో నౌకలోని ఒక చిన్న తెప్పపైకి చేరుకున్నాడు. ఇదే ప్రమాద సమయయంలో అతడు ఓ చిన్న ట్యాంకు నిండా మంచినీరు, ఆహారాన్ని కూడా సంపాదించుకోగలిగాడు. ఉన్న ఆహారం సరిపోదు కాబట్టి, చేపలు పడుతూ మరికొంత ఆహారాన్ని సంపాదించేవాడు. అలా అతడి ప్రయాణం సముద్రంలో ఒంటరిగానే సాగింది. అలా దాదాపు  133 రోజులు అంటే నాలుగు నెలలకు పైగా ఆ చిన్న తెప్పపైనే ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో పూన్ చాలా అనారోగ్యానికి గురై, దాదాపు 14 కిలోల బరువు కోల్పోయాడు. చివరకు బ్రెజిల్‌కు చెందిన నావికులు అతడిని గుర్తించి, రక్షించారు. ఒక వ్యక్తి సముద్రంలో అత్యధిక రోజులు ఒంటరిగా ప్రయాణించి, ప్రాణాలతో బయటపడిన వ్యక్తి ఇతడే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement