పాక్పై తీవ్ర ఆరోపణలు.. పెను దుమారం | MQM chief calls Pakistan is cancer for world | Sakshi
Sakshi News home page

పాక్పై తీవ్ర ఆరోపణలు.. పెను దుమారం

Published Wed, Aug 24 2016 9:20 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

పాక్పై తీవ్ర ఆరోపణలు.. పెను దుమారం

పాక్పై తీవ్ర ఆరోపణలు.. పెను దుమారం

ఇస్లామాబాద్: పొరుగు దేశాలవారే కాదు.. సాక్షాత్తు మాతృదేశానికి చెందినవారు సైతం పాకిస్థాన్పై తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ ప్రపంచానికే క్యాన్సర్ అని, పెద్ద తలనొప్పి అని ఆ దేశానికి చెందిన ముత్తాహిదా కువామి మూమెంట్(ఎంక్యూఎం) పార్టీ చీఫ్ వ్యవస్థాపకుడు అల్తాఫ్ హుస్సేన్ అన్నాడు. అలాగే, ఉగ్రవాదానికి కేంద్ర బిందువు కూడా పాకిస్థానే అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో పాక్ లో పెద్ద దుమారం చెలరేగింది. మాతృదేశంపై తీవ్ర ఆరోపణలు చేసిన ఆయనను ఇక పార్టీ నుంచి పంపించేస్తున్నామని, ఇప్పటి నుంచి అల్తాఫ్ ఆదేశాలను తాము పాటించబోమంటూ ఎంక్యూఎం పార్టీ డిప్యూటీ కన్వీనర్ ఫరూక్ సత్తార్ ప్రకటించాడు.

అసలేం జరిగిందంటే..
25 ఏళ్ల కిందట ఎంక్యూఎం పార్టీని అల్తాఫ్ హుస్సేన్ స్థాపించాడు. అప్పటి నుంచి పార్టీని తన గుప్పిట్లో ఉంచుకొని మనుగడ సాగిస్తున్న అల్తాఫ్ ఇటీవల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తన పార్టీకి చెందినవారికి ఇబ్బందులు కలిగించడం, అక్రమ అరెస్టులు చేయడం, వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడటం వంటి సంఘటనలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం అల్తాఫ్ అమెరికాలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సోమవారం కరాచీలో జరిగిన ఓ సదస్సులో ఫోన్ ద్వారా మాట్లాడుతూ పాక్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

'పాకిస్థాన్ మొత్తం ప్రపంచానికి ఒక క్యాన్సర్ మహమ్మారి, పెద్ద తల నొప్పి. ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్ర బిందువు పాకిస్థానే' అని ఫోన్ ద్వారా స్పీచ్ ఇచ్చారు. దీనిపై సర్వత్రా వెల్లువెత్తాయి. ఈ మాటలు విని ఉలిక్కిపడిన పార్టీ ఇతర నేతలు ఇక ఆయనతో పని లేదని, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని, అల్తాఫ్ ఆదేశాలు ఇక వినబోమని తెగేసి చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ కు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రేంజర్స్ క్షమాపణలు చెప్పారు.

తన పార్టీపై, తన పార్టీ కార్యకర్తలపై వేధింపులు ఎక్కువైన నేపథ్యంలోనే మానసిక ఒత్తిడికి లోనై తాను అలా నోరు జారానని, తనను క్షమించాలని కోరాడు. ఈ వివరణపై స్పందించిన పార్టీ డిప్యూటీ కన్వీనర్ ఫరూక్ సత్తార్.. ముందు తాను ఒత్తిడిలో ఉన్నానని చెప్పిన తర్వాతే ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిందని అన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement