'మా రోబో తయారీకి సూచనలివ్వండి'
న్యూయార్క్: అంతరిక్ష కేంద్రం(స్పేస్ స్టేషన్)లోకి పంపనున్న ఓ అత్యున్నత రోబో డిజైన్ తయారీకి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సామాన్య ప్రజానికం నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇదేంటీ ఈ తరహా ప్రయోగాలను పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు నిర్వహిస్తారు కదా.. మామూలు ప్రజలు ఎలా చేస్తారు అని సందేహం కలగొచ్చు. కానీ నాసా మాత్రం శాస్త్రవిఙ్ఞానం పట్ల ఔత్సాహికులైన, సృజనాత్మకత కలిగిన వారికి ఈ డిజైన్ బాధ్యతలను అప్పగించాలని భావిస్తుంది.
2017లో అంతరిక్ష కేంద్రంలోకి పంపనున్నఈ రోబో తయారీకి నాసా ఇప్పటికే ప్రయోగాలు ప్రారంభించినప్పటికీ.. ప్రజల నుండి వచ్చిన ఇతర సృజనాత్మక ఐడియాలను కూడా పరిశీలించాలని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తిగల వారిని ఫ్రీలాన్సర్. కామ్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు పంపాల్సిందిగా కోరింది. దరఖాస్తు చేసుకునే వారు.. డిజైన్ తయారీకి వారికి గల ఖాళీ సమయ వివరాలతో పాటు అకాడమిక్ మెరిట్స్ గురించి తెలపాల్సి ఉంటుంది. అత్యుత్తమ రోబో డిజైన్లను పంపిన వారికి నగదు ప్రోత్సాహకాలు కూడా అందించనుంది.