ఫొటో చూశారుగా... కుతకుత ఉడుకుతున్న సూరీడి ఉపరితలం ఛాయాచిత్రమిది. అమెరికాలోని హవాయి ప్రాంతంలో ఏర్పాటైన సరికొత్త ‘ద ఐనోయీ సోలార్ టెలిస్కోపు’తో తీశారు. సూర్యుడి ఉపరితలం మొత్తం ఇలాగే ఉంటుందని.. కణాల్లాంటి భాగాలు అక్కడి చర్యల తీవ్రతకు ప్రతీకలని అంచనా. సూర్యుడికి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు ఈ టెలిస్కోపు ఎంతో ఉపయోగపడుతుందని అంచనా. సూర్యుడిపై జరిగే కార్యకలాపాలు భూ వాతావరణంపై ప్రభావం చూపుతాయన్నది తెలిసిందే. సూర్యుడి ఉపరితలంపై సంభవించే పేలుళ్ల కారణంగా అయస్కాంత ధర్మం కలిగిన తుపానుల్లాంటివి చెలరేగుతుంటాయి.
ఇవి కాస్తా భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల్లోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలపై దుష్ప్రభావం చూపడంతోపాటు అవి పనిచేయకుండా చేసే చాన్సుంది. జీపీఎస్ వంటి వ్యవస్థలను నాశనం చేసేందుకు, విద్యుత్తు సరఫరా వ్యవస్థలను దెబ్బతీసేందుకూ సౌర తుపానులు కారణమవుతాయని దీన్ని ఏర్పాటు చేసిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ ఫ్రాన్స్ కోర్డోవా తెలిపారు. సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీరుతెన్నులను ఐనోయీ టెలిస్కోపు వివరణాత్మకంగా తెలుసుకోగలదని, భవిష్యత్తులో సౌర తుపానులను ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చునని తెలిపారు. ప్రస్తుతం సౌర తుపానులు ఏర్పడేందుకు 48 నిమిషాల ముందు మాత్రమే మనకు తెలుస్తోంది. కొత్త టెలిస్కోపు సాయంతో 48 గంటల ముందుగానే తెలుసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment