
మధుమేహానికి కొత్త చికిత్స!
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా టైప్ 2 మధుమేహంతో బాధపడుతున్న లక్షలాది మందికి ఉపశమనం కలిగించేలా కొత్త చికిత్సకు దోహదం చేసే ఓ కీలక పరిశోధనను ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త డాక్టర్ శిరీషా సంకెళ్ల నేతృత్వంలోని బృందం నిర్వహించింది. పాస్ఫోటైడిక్ ఆమ్లాలు అనే లిపిడ్ అణువులు కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతాయని శిరీష బృందం గుర్తించింది. దీంతో ఈ లిపిడ్ అణువులను అణచివేయడం లేదా వాటి ఉత్పత్తిని తగ్గించడం ద్వారా గ్లూకోజ్ ఉత్పత్తిని కూడా తగ్గించవచ్చని భావిస్తున్నారు.
పాస్ఫోటైడిక్ ఆమ్లాల సంశ్లేషణలో పాల్గొనే ఎంజైమ్‌లను కూడా తాము గుర్తించామని పరిశోధనలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌కు చెందిన డాక్టర్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ఎలుకల్లో లైపోడిస్ట్రోఫీ (కొవ్వు కణజాలం అసాధారణంగా పెరగడం లేదా క్షీణించడం) సమస్యపై అధ్యయనం చేసిన తాము ఈ విషయం కనుగొన్నామన్నారు. కాగా లైపోడిస్ట్రోఫీ రోగుల కాలేయంలో కొవ్వు పేరుకుపోవడంతోపాటు కొవ్వులు, గ్లూకోజ్ వినిమయం గాడితప్పడంతో వారు మధుమేహం బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఇన్సులిన్ హార్మోన్ నిరోధకత ఏర్పడి రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పెరగడం వల్ల కలిగే టైప్ 2 మధుమేహం సమస్యకు కొత్త చికిత్స కనుగొనేందుకు మార్గం సుగమం అయిందని, కేన్సర్ పెరుగుదలను అర్థం చేసుకునేందుకు కూడా తమ పరిశోధన ఫలితాలు ఉపయోగపడతాయని శిరీష పేర్కొన్నారు. వీరి పరిశోధన వివరాలు ‘జర్నల్ ఆఫ్ బయోలాజికల్ కెమిస్ట్రీ’లో ప్రచురితమయ్యాయి.