నదికీ మనిషితో సమాన హక్కులు
ఇదేంటి... నదికి హక్కులేమిటని ఆశ్చర్యపోతున్నారా! స్థానిక ఆదివాసీల మనోభావాలను గౌరవించి నదికి మనిషితో సమానంగా హక్కులిచ్చారు. న్యూజిలాండ్‌లో బుధవారం ఈమేరకు పార్లమెంటు ఒక బిల్లును పాస్ చేసింది. ఇలా ఒక నదికి మనిషితో సమానంగా హక్కులు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. వాంగనుయ్ అనేది న్యూజిలాండ్‌లో మూడో అతిపెద్ద నది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే మావోరి తెగ ప్రజలు ఈ నదిని తమ పూర్వీకుడిగా పరిగణిస్తారు. మనిషితో సమానంగా వాంగనుయ్ నదికి కూడా చట్టబద్ధమైన హక్కులు ఉండాలని వీరు 140 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
బుధవారం ఈ బిల్లు పాస్ కాగానే ఆదివాసీల ప్రతినిధులు పలువురు ఆనందబాష్పాలు రాల్చారు. నదీ పరివాహక ప్రాంతాలు తమవేననే వాదనతో 80 ఏళ్లుగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. న్యూజిలాండ్ చరిత్రలో సుదీర్ఘ కోర్టు కేసుల్లో ఒకటి వాంగనుయ్ నదికి మనిషితో సమానంగా హక్కులు కల్పించడంతో ముగిసింది. ఉత్తర న్యూజిలాండ్‌లో కొండలు, లోయల గుండా 290 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలిసే వాంగనుయ్ నదితో మావోరిల జీవితం పెనవేసుకుపోయింది. పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని నివసించే మావోరిలు నేనే నది. నదియే నేను అనే భావనతో ఉంటారు.
వాగులు, వంకలు, గుట్టలు, సముద్రాలు... ఇలా ప్రకృతిలోని అన్నీ మనుషులతో సమానమేనన్నది వీరి నమ్మకం. ఆచారవ్యవహారాలు కూడా అలాగే ఉంటాయి. నదితో తమకున్న అనుబంధాన్ని, హక్కులకు గుర్తించాలని పోరాటం చేసి మావోరిలు విజయం సాధించారు. తె అవా తుపువా బిల్లు ప్రకారం నది వ్యవహారాలు చూసేందుకు ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఒకరిని వాంగనుయ్ ఐవీ (నదిపై ఆధారపడ్డ తెగల బృందం) నియమిస్తుంది. మరొకరిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరూ నదికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఎవరైనా నదిని కలుషితం చేసినా... మరే ఇతర హాని తలపెట్టినా వాంగనుయ్‌కు మనిషిలాగే హక్కులుంటాయి. కాబట్టి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుంది.
ఆదివాసీలతో సమానంగా వాంగనుయ్ నదిని చట్టం గుర్తిస్తుంది. 8.1 కోట్ల న్యూజిలాండ్ డాలర్లను (న్యూజిలాండ్ డాలర్ మన కరెన్సీలో 45 రూపాయలకు సమానం) ప్రభుత్వం తె ఆవా తుపువాకు కేటాయిస్తుంది. వీటిలో 3 కోట్ల డాలర్లను నదిని ఆరోగ్యంగా (కాలుష్య రహితంగా) ఉంచడానికి ఏర్పాటు చేసిన ఫండ్‌కు కేటాయిస్తారు. నది ప్రతినిధులుగా వ్యవహరించే ఇద్దరికి 20 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల డాలర్లు ఇస్తారు. న్యూజిలాండ్‌లో కంపెనీలకు కూడా లీగల్ పర్సన్ హోదా ఉంటుంది. అంటే భౌతికంగా మనిషి రూపంలో లేకున్నా... లీగల్ పర్సన్‌కు పౌరులకు ఉండే హక్కులు కొన్ని ఉంటాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్