Equal Rights
-
ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి
డెహ్రాడూన్: మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం(యూసీసీ) ఉత్తరాఖండ్‌లో సోమవారం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రికార్టులకెక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలుచేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం. చట్టం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లామ్‌ను ఆచరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ లాంటివి చెల్లుబాటుకావు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ అంటూ ఏకపక్షంగా ఇచ్చే విడాకులు చెల్లవు. షెడ్యూల్ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. వాళ్ల గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వం గుర్తించి విలువ ఇస్తుంది. సోమవారం యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని డెహ్రాడూన్‌లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. కేబినెట్ మంత్రులు, నాటి యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన యూసీసీ పోర్టల్‌ను ప్రారంభించారు. వివాహాలు చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, సహజీవనం చేసినా ప్రతీదీ ఈ పోర్టల్ ద్వారా ఖచ్చితంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం నమోదుచేసుకోవాల్సిందే. పెళ్లికాకుండా సహజీవనం కారణంగా పుట్టిన పిల్లలకూ వారసత్వ హక్కులు దక్కేలా యూసీసీ చట్టంలో మార్పులుచేసి అమల్లోకి తెచ్చారు. పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి ధామీ తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. పోర్టల్ ద్వారా జారీ అయిన తొలి డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా సీఎం ధామీకి అందజేశారు. ‘‘ మతాలకతీతంగా పౌరులందరికీ యూసీసీ ద్వారా సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మూడేళ్ల క్రితం యూసీసీపై మాటిచ్చా. ఇన్నాళ్లకు ఇది సాకారమైంది. ఈ ఘనత రాష్ట్ర ప్రజలదే. విభిన్న ఆచార వ్యవహారాలు, జీవనం సాగించే ఎస్టీలను యూసీసీ పరిధిలోకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాం. అందుకే వారిని యూసీసీ నుంచి మినహాయించాం’’ అని సీఎం స్పష్టంచేశారు. చట్టం ప్రకారం ఇకపై ఉత్తరాఖండ్‌లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వం విధానాన్ని నిషేధించారు. హలాల్ విధానాన్ని సైతం రద్దుచేశారు. ‘‘ యూసీసీ అమలుతో భారత రాజ్యాంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం’’ అని సీఎం అన్నారు. -
International Day of Education 2025 దీని ప్రాముఖ్యత, ఏడాది థీమ్ ఇదే!
International Day of Education 2025 : ప్రతీ ఏడాది జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. జనవరి 24ని అంతర్జాతీయ విద్యా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) 2018 డిసెంబర్ 3, 2018న ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, సమానత్వాన్ని తీసుకురావడంలో విద్య ప్రాముఖ్యతను గుర్తించడం, అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం.నైజీరియాతో సహా 58 సభ్య దేశాల మద్దతుతో వచ్చిన ఈ చారిత్రాత్మక తీర్మానం, విద్య ప్రాప్యత , ప్రతి వ్యక్తికి దాని లోతైన ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన అవసరం అని నొక్కి చెబుతుంది.International Day of Education.To grow is to become wise, and the foundation of wisdom is learning.#UGC #Education #InternationalDayofEducation@PMOIndia @EduMinOfIndia @PIB_India pic.twitter.com/Eam5G2Jiq6— UGC INDIA (@ugc_india) January 24, 2025మానవ అభివృద్ధిలో విద్య పాత్రను గుర్తించడంతోపాటు, సమానమైన నాణ్యమైన విద్యను ప్రాథమిక మానవ హక్కుగా ప్రోత్సహించేలా జనవరి 24, 2019న తొలి సారి అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకున్నారు.అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025, థీమ్ఈ సంవత్సరం, అంతర్జాతీయ విద్యా దినోత్సవం థీమ్ "ఏఐ అండ్ ఎడ్యుకేషన్‌గా నిర్ణయించారు. ఆటోమేషన్ ప్రపంచంలో మానవ విలువను పరిరక్షించడం". అంటే ఆటోమేషన్ యుగంలో రోజు రోజుకి అభివృద్ది చెందుతున్న సాంకేతిక తీరుతెన్నులు, పురోగతులు అర్థం చేసుకోవడం, అటువంటి వ్యవస్థలు మానవ నిర్ణయాలు, విద్యా కార్యకలాపాలను ఎలా ప్రభావితం చేస్తాయో ప్రశ్నించడం, విద్యలో కృత్రిమ మేధస్సును పెంచడం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం.విద్య ప్రాముఖ్యతపేదరికం,లింగ సమానత్వంతో సహా అనేక సమస్యలను పరిష్కరించడంలో విద్య చాలా అవసరం. వ్యక్తిగత అభివృద్ధి, సామూహిక పురోగతిని పెంపొందిస్తుంది. శాంతిని నిర్మించడానికి విద్య ప్రాథమికమైనదని యూఎన్జీఏ పేర్కొంది. సమానమైన నాణ్యమైన విద్యను అందించడం, అందరికీ జీవితాంతం అవకాశాలను ప్రోత్సహించడంతోపాటు, ఆయా వ్యక్తులు సమాజాలు విద్యకు ప్రాధాన్యతనిచ్చి పెట్టుబడి పెట్టడానికి ఇది పిలుపు.విద్యమనిషిని మనస్సును శక్తివంతం చేస్తుంది. భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నేర్చుకోవడంలోని శక్తిని గుర్తిద్దాం. సెలబ్రేట్ చేసుకుందాం. అది అందరికీ చేరేలా చూసుకుందాం. ఇదీ చదవండి : National Girl Child Day 2025: నీ ధైర్యమే.. నీ సైన్యమై..! -
భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!
భారతీయ సమాజంలోని వివిధ రంగాలలో సమాన హక్కులు అంతుచిక్కని లక్ష్యం. న్యాయవ్యవస్థలో కూడా ఇదే ధోరణి. భారతీయ న్యాయ వ్యవస్థలోని మహిళల ప్రాతినిధ్యాన్ని నిశితంగా పరిశీలిస్తే, మగవారి ఆడవారి మధ్యలో ఉన్న అసమానత్వం స్పష్టమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. పైగా ఇందులో మార్పు అత్యంత అవసరం అనే విషయాన్ని నొక్కి చెబుతుంది. అత్యున్నత న్యాయస్థానంలో 36 మంది న్యాయమూర్తులలో కేవలం ముగ్గురు మాత్రమే మహిళలు. ఈ అసమానత అత్యున్నత న్యాయస్థానానికి మాత్రమే పరిమితం కాదు. ఇది హైకోర్టుల వరకు వ్యాపించింది, ఇక్కడ వెయ్యి మంది న్యాయమూర్తులలో కేవలం 96 మంది మహిళలు మాత్రమే ఉన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలో కూడా పరిస్థితి మెరుగుపడలేదు. 3.3 లక్షల మంది న్యాయమూర్తులకు న్యాయ అధికారులలో కేవలం 6% మంది మహిళలు ఉన్నారు. భారతదేశంలోని విస్తృత చట్టపరమైన ల్యాండ్‌స్కేప్‌లో 15% కంటే తక్కువ మంది మహిళలు న్యాయవాదులు ఉన్నారు. ఈ నిరుత్సాహపరిచే అసమానతకు దోహదపడే కారకాలు చాల ఉన్నాయి. అవి చాలా లోతుగా పాతుకుపోయాయి. ఇప్పటికి సామాజిక పక్షపాతాలు, నిబంధనలు న్యాయవాద వృత్తిని కొనసాగించకుండా మహిళలను నిరుత్సాహపరుస్తున్నాయి. దానితో పాటు చట్టపరమైన విద్య కూడా చాల తక్కువ అవకాశాలు ఉంటున్నాయి. న్యాయవాద వృత్తిలో ఆదాయం చాలా మారవచ్చు. ఇది న్యాయమూర్తులు కావాలనుకునే మహిళా న్యాయవాదులకు కష్టతరం చేస్తుంది. న్యాయనిర్ణేతగా మారడం వారికి కష్టంగా ఉంటుంది. ఇలా చాల సవాళ్లు ఉన్నాయి. కానీ దాంతో పాటు ఆశ కూడా మిగిలి ఉంది. మాజీ, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తులు కోర్టులలో చాల సార్లు మహిళలకు పదోన్నతులు కల్పించారు. ఇలాంటి పరిస్థితిలో చట్టపరమైన రంగంలో లింగ సమానత్వం కోసం ప్రయత్నాలు మరింత ముఖ్యమైనవిగా ఉండాలి. మెరుగైన మహిళా ప్రాతినిధ్యానికి స్థిరమైన లక్ష్యం, విధానం అవసరం. ఈ మొదటి అడుగు ప్రశంసనీయమే కానీ నిజమైన సమానత్వం కోసం ప్రతి ఒక్కరి కృషి అవసరం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం, పౌర సమాజం అందరు కలిసి పనిచేయాలి. ఇటీవలే, అస్సాం, జమ్మూ కాశ్మీర్లో మహిళా కమిటీని ఏర్పాటు చేయడం వంటి చర్యలు చూసి, కోర్టులు మహిళా న్యాయానికి కట్టుబడి ఉన్నాయని చూపిస్తున్నాయి. ఇలాంటి చర్యలు సమాన హక్కులు గూర్చి లోతైన కారణాలపై పోరాడటానికి న్యాయస్థానాలు తమ బాధ్యతను అంగీకరిస్తాయని చూపిస్తుంది. కొంతకాలం క్రితం, భారతదేశ సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆగస్ట్ 7న మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితి గురించి ప్రకటన చేసారు. ఈ సమస్యను పరిశీలించడానికి ముగ్గురు న్యాయమూర్తుల బృందానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నాయకత్వం వహించారు. ఇది ఒక కొలిక్కి రావాలంటే ఈ తరహా సహాయం ఆయన చేయాలనీ సుప్రీంకోర్టు గ్రహించింది. కాబట్టి, వారు సహాయం చేయడానికి మొత్తం మహిళల కమిటీని రూపొందించడానికి తమ ప్రణాళికను పంచుకున్నారు. ఈ ఏర్పడిన కమిటీలో ఉన్నత న్యాయస్థానాల నుంచి ముగ్గురు ప్రముఖ మాజీ న్యాయమూర్తులు ఉంటారు. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ కమిటీకి నాయకత్వం వహిస్తారు. ఇతర కమిటీ సభ్యులు జస్టిస్ షాలినీ ఫన్సల్కర్ జోషి (బాంబే హైకోర్టు నుంచి పదవీ విరమణ చేసారు), జస్టిస్ ఆశా మీనన్ (గతంలో ఢిల్లీ హైకోర్టు నుండి పనిచేశారు). సహాయక చర్యలను పర్యవేక్షించడం, ప్రార్థనా స్థలాలు, గృహాలను పునరుద్ధరించడం, సహాయక చర్యలను మెరుగుపరచడం తోపాటు మరిన్ని బాధ్యతలు కమిటీకి ఉంటాయి. మే నుంచి జులై వరకు జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పరిశోధన చేయడానికి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దత్తాత్రయ్ పద్సాల్గికర్ను నాయకత్వం వహించడానికి ఎంపిక చేసారు. పద్సల్గికర్ ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో, నాగాలాండ్‌లో పనిచేశాడు. ఈ కేసుల కోసం మణిపూర్‌లో 6500 పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కానీ, న్యాయవ్యవస్థలో లింగ సమానత్వాన్ని సాధించడానికి సమయం పడుతుంది. మహిళలకు మాత్రమే న్యాయస్థానాలను సృష్టించడం, మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడడం తదితరాలు సానుకూల అభివృద్ధి. కానీ, నిజమైన పురోగతికి మరిన్ని మార్పులు అవసరం. న్యాయవాద వృత్తిలో మహిళలకు మరింత అధికారం ఇవ్వడం ముఖ్యం. చట్టంలో మహిళలపై అన్యాయమైన నమ్మకాలను తొలగించడం చాలా కీలకం. మహిళలు ఎదగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని నిర్ధారించుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ మార్పుల కోసం నిరంతర శ్రద్ధ, కృషి అవసరం. ఇలాంటి కార్యక్రమాలతో మనం స్థిరంగా కొనసాగితే, న్యాయవ్యవస్థలో మహిళలు తమ స్థానాలను సక్రమంగా చేపట్టేందుకు చాల గొప్ప అవకాశం ఉంటుంది. దీని వల్ల న్యాయ వ్యవస్థలో మహిళలకు పెద్ద పాత్ర ఉంటుంది. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థ బలంగా, న్యాయంగా ఉండవచ్చు. భారతదేశ న్యాయ వ్యవస్థలో స్త్రీలను, పురుషులను సమానంగా చూడటం ముఖ్యం. మనమందరం మహిళల అభిప్రాయాన్ని ఎక్కువగా వినడానికి, చూడటానికి సహాయం చేస్తే, పరిస్థితులు మారవచ్చు. పురుషులు, మహిళలు ఒకే విధంగా పరిగణించే భవిష్యత్తును సృష్టించడానికి ప్రయాస పడాలి. -డాక్టర్ శ్రీదేవి రెడ్డి గాధే, సీనియర్ హైకోర్టు అడ్వకేట్(అభిజ్ఞా భారత్ ఆర్గనైజేషన్ ఫౌండర్) -
తండ్రి ఆస్తిలో కుమార్తెలకూ సమాన హక్కు.. తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, అమరావతి : హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం కూతురు పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో సమాన వారసత్వ హక్కుదారు అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. సవరణ చట్టం అమల్లోకి వచ్చిన 2005 సెప్టెంబర్ 9వ తేదీ నాటికి తండ్రి మరణించారా? లేదా? అన్న దాంతో సంబంధం లేకుండా హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) ఆస్తుల విషయంలో కుమార్తెలకు సైతం సమాన హక్కు ఉంటుందని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టు వినీత శర్మ కేసులో స్పష్టంగా చెప్పిందని, సవరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి తండ్రి బతికి ఉండాల్సిన అవసరం లేదని తెలిపిందని వివరించింది. తండ్రి ఉమ్మడి ఆస్తిలో కుమార్తెలకు సమాన వాటా హక్కును సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత నుంచి మాత్రమే పరిమితం చేయలేమని తేల్చి చెప్పింది. ఆ చట్టం నిబంధనలు పూర్వం (రెట్రోస్పెక్టివ్) నుంచే వర్తిస్తాయని చెప్పడంలో ఎలాంటి సంశయం లేదంది. హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తుది తీర్పునివ్వాలని అభ్యర్థి స్తూ తెనాలి కోర్టును ఆశ్రయించాలని ఓ కేసులో పిటిషనర్లుగా ఉన్న ముగ్గురు మహిళలకు హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి ఈ నెల 13న తీర్పు వెలువరించారు. తండ్రి ఆస్తిలో వాటా కోసం కుమార్తెల పోరాటం తమ తండ్రి తురగా రామమూర్తికి చెందిన ఉమ్మడి ఆస్తిలో వాటా ఇచ్చేందుకు సోదరులు, సోదరీమణులు తిరస్కరిస్తున్నారంటూ ఆనందరావు అనే వ్యక్తి 1986లో తెనాలి అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా వేశారు. ఇదే సమయంలో హిందూ వారసత్వ సవరణ చట్టం ప్రకారం తమ తండ్రి ఆస్తిలో తమకు సమాన వాటా ఉందని, ఆ మేర తీర్పునివ్వాలని కోరుతూ రామమూర్తి కుమార్తెలు సీతారావమ్మ మరో ఇద్దరు ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన కోర్టు 2009లో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సమీక్షించాలంటూ రామమూర్తి కుమారుల్లో కొందరు, వారి వారసులు తెనాలి కోర్టులో అనుబంధ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కోర్టు 2010లో కుమారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. వారసత్వ సవరణ చట్టం ఆస్తి వాటాల విషయంలో కుమార్తెలకు వర్తించదని కోర్టు చెప్పింది. సవరణ చట్టాన్ని పూర్వం నుంచి వర్తింపజేయడానికి వీల్లేదని చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ముగ్గురు కుమార్తెలు అదే ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరపున చింతలపాటి పాణినీ సోమయాజి వాదనలు వినిపించారు. -
ఓటీటీలకూ భారీ షాక్.. ఇకపై అలా కుదరదండి!
న్యూఢిల్లీ: కమ్యూనికేషన్ సేవలు అందించే సంస్థలన్నింటికీ ఒకే రకం నిబంధనలు అమలు చేయాలని టెల్కోల సమాఖ్య సీవోఏఐ డిమాండ్ చేసింది. తమకు వర్తింపచేస్తున్న నిబంధనలను ఓటీటీ (ఓవర్–ది–టాప్) కమ్యూనికేషన్ యాప్స్‌కు కూడా వర్తింపచేయాలని కోరింది. అలా చేయని పక్షంలో తమ లైసెన్సులు, నియంత్రణపరమైన నిబంధనలనైనా సడలించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అన్ని ‘ఓటీటీ కమ్యూనికేషన్ సేవల విషయంలో అన్ని టెక్నాలజీలకు సమానంగా రూల్స్‌ను అమలు చేయాలి. తద్వారా పరిశ్రమలో సముచితమైన, ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది‘ అని ఒక ప్రకటనలో సీవోఏఐ పేర్కొంది. ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసులను కూడా ఇటీవలి టెలికమ్యూనికేషన్స్ బిల్లు ముసాయిదాలో పొందుపర్చడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే ఈ తరహా సేవల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా స్పష్టమైన నిర్వచనం ఇవ్వాలని కోరుకుంటున్నామని వివరించింది. టెలికం సంస్థలు స్పెక్ట్రం కొనుగోలు చేయం మొదలుకుని నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేసుకోవడం వరకూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని, అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటోందని సీవోఏఐ తెలిపింది. మరోవైపు ఓటీటీలు మాత్రం టెలికం సర్వీసులను ఇలాంటి బాదరబందీలేమీ లేకుండా, ఎలాంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా అందించడం ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయని పేర్కొంది. సీవోఏఐలో టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొదలైనవి సభ్యులుగా ఉన్నాయి. వాట్సాప్ వంటి ఓటీటీ కమ్యూనికేషన్ యాప్‌లు .. ఇంటర్నెట్ టెక్నాలజీ ఆధారంగా టెలికం సంస్థల తరహాలోనే వాయిస్, వీడియో కాలింగ్ సేవలను అందిస్తున్నాయి. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
ఆస్తిలో కూతుళ్లకు సమాన వాటా
న్యూఢిల్లీ: ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. సమానత్వ హక్కుని కూతుళ్ళకి నిరాకరించతగదని కూడా స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తీర్పునిచ్చింది. హిందూ వారసత్వ చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఒక కొడుకు భార్య వచ్చినంత వరకే కొడుకుగా ఉంటాడు. అదే కూతురు జీవితాంతం కూతురుగానే ఉంటుంది’’అని తన తీర్పులో పేర్కొంది. ఇప్పటికే వివిధ కోర్టులలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో అప్పీళ్ళు ఉన్నాయని, విభిన్నమైన తీర్పులివ్వడంతో తీర్పు ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించింది. ఈ అప్పీళ్ళను 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. -
హేయమైన ఘటనల మధ్య హక్కులెలా !
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మహిళలపై పెరిగిపోతున్న నేర ఘటనలపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సమానహక్కులు అన్న సార్వత్రిక లక్ష్యం సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. మానవ హక్కుల దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (యూడీహెచ్‌ఆర్)ను ఆమోదించగా.. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ 10వ తేదీని మానవ హక్కుల దినంగా పాటిస్తున్నారు.యూడీహెచ్‌ఆర్ రూపకల్పనలో భారత్‌కు చెందిన సంఘసంస్కర్త, విద్యావేత్త హన్సా జీవ్‌రాజ్‌మెహతా కీలకపాత్ర పోషించారని, ఆ ప్రకటనలోని ఆర్టికల్ 1 ముసాయిదాలో ‘ఆల్ మెన్ ఆర్ బోర్న్ ఫ్రీ అండ్ ఈక్వల్’ అన్న వాక్యాన్ని హన్సా ‘ఆల్ హ్యూమన్స్...’గా మార్చడానికి కృషి చేసి విజయం సాధించారని రాష్ట్రపతి గుర్తు చేశారు. అయితే స్త్రీ, పురుష సమానత్వం, మానవ హక్కుల విషయంలో హన్సా లాంటి దార్శనికుల స్వప్నాలను సాకారం చేసేందుకు చేయాల్సింది ఇంకా ఎంతో ఉందని రాష్ట్రపతి అన్నారు. సమాన హక్కులు, గౌరవమన్న విషయాల్లో మనల్ని మనం ప్రశ్నించుకోవడం ద్వారా ఈ దిశగా తొలి అడుగు వేయాలని సూచించారు. జాతిపిత చెప్పిందీ అదే.. దురదృష్టవశాత్తూ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనలు మనల్ని పునరాలోచనలో పడేస్తున్నాయని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయని, ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రపంచమంతా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. దీనిపై ప్రతి ఒక్కరూ ఆత్మశోధన చేసుకోవాలి’అని ఆయన అన్నారు. దీంతోపాటు యూడీహెచ్‌ఆర్‌ను సమీక్షించి మానవ హక్కులను పునః నిర్వచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పిల్లలు, వెట్టిచాకిరీలో మగ్గుతున్న వారు, స్వల్ప నేరాలకు గాను దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న వారిపట్ల సానుభూతి చూపాల్సిన అవసరముందని, వీరి హక్కుల విషయంలో మరింతగా ఆలోచన చేయాల్సి ఉందని వివరించారు. మానవ హక్కుల విషయంలో ఆత్మశోధన ఎంత అవసరమో, సమాజం, తన హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడమూ అంతే అవసరమని రాష్ట్రపతి తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ సైతం మానవ హక్కులు, పౌర విధులు ఒకే నాణేనికి రెండు పార్శా్వల వంటివని చెప్పారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, భారత్‌లో ఐక్యరాజ్య సమితి రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనెటా లోక్ డెస్సాలియన్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆ అధికారాలన్నీ మధ్యవర్తికి ఉండవు’
సాక్షి, హైదరాబాద్ : సివిల్ కోర్టుకున్న అధికారాలన్నీ మధ్యవర్తి(ఆర్బిట్రేటర్)కి ఉండవని హైకోర్టు తెలిపింది. మధ్యవర్తి కోర్టుతో సమానం కాదని పేర్కొంది. మధ్యవర్తి కేవలం కోర్టుకు ఓ ప్రత్యామ్నాయ వేదిక మాత్రమేనని స్పష్టం చేసింది. సివిల్ కేసుల్లో అభ్యర్థనలు వేర్వేరుగా ఉండి, వైరుద్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నప్పుడు ఆ కేసులను సివిల్ కోర్టే విచారించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి కేసులను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్ కోర్టు తీర్పునివ్వడం సరికాదని తెలిపింది. ఇలా ఓ సివిల్ వివాదంలో మియాపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో తనకున్న 1,136 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు 2007లో పాపారావు అనే వ్యక్తితో మురళీధరరావు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత 2009లో పాపారావు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్తో మురళీధరరావు మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో వివాదం తలెత్తడంతో మియాపూర్ కోర్టులో మురళీధరరావు 2016లో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంలోని భవనంలో అద్దెకున్న సుయోషా హెల్త్‌కేర్ సంస్థను తనకు అద్దె, ఇతర బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. తన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ను నిరోధించాలని అభ్యర్థించారు. ఇదే కేసులో పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసి, వివాదాన్ని మధ్యవర్తికి నివేదించాలని కోరాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన మియాపూర్ కోర్టు ఆ మేర తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మురళీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
మాకూ సమాన హక్కు కల్పించండి
అనంతపురం అర్బన్: ‘సమాజంలో మేమూ ఒకరమే.. మమ్మల్ని దూరం పెట్టడం సమంజసం కాదు.. మాకూ సమాన హక్కు కల్పించాలని’ అని ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కలెక్టర్‌కు విన్నవించి, వినతిపత్రం అందజేసేందుకు ‘మనవిజయం’ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు రమణమ్మ, మయూరి, హాసిని మాట్లాడారు. ప్రస్తుతం ఏదైనా సర్టిఫికెట్, రేషన్ కార్డు, తదితర వాటికి దరఖాస్తు చేసుకుంటే దానిలో పురుష, మహిళ కాలమ్ మాత్రమే ఉంచుతున్నారన్నారు. ఇక నుంచి ‘ఇతరులు’ అనే ఆప్షన్ కూడా ఉంచాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలనూ తమకు వర్తింపజేయాలన్నారు. ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. విద్యావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. చదువులేని వారికి ఉపాధి చూపించాలన్నారు. చదువు, ఉద్యోగంలోనూ ఆప్షన్ ఉంచుతూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. -
మహా మహిళ
మహిళా భారతం స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతోంది.. ఇన్నేళ్ల మహిళా ప్రగతి గురించి మాట్లాడుకుందాం. ముందు సానుకూలతల నుంచి మొదలుపెడదాం! రాజ్యాంగం మహిళలకు కల్పించిన సమాన హక్కులు చారిత్రాత్మకం. దీనికోసం ఇతర దేశాల్లో చాలా పోరాటాలే జరిగాయి. జరుగుతున్నాయి కూడా! అయితే మన దగ్గరా ఇవి అంత ఆషామాషీగా ఏమీ రాలేదు. జాతీయోద్యమంలో స్వతహాగా మహిళలు చూపిన చొరవ, వహించిన నేతృత్వమే తర్వాత రాజ్యాంగంలోని సమానహక్కులకు ప్రాతిపదిక, ప్రేరణ అయింది. కుల, మత, జాతి, వర్గ విభేదాలకు అతీతంగా జాతీయోద్యమం చూపిన స్ఫూర్తి, చాటిన విలువ సమానత్వమే. అదే రాజ్యాంగంలో ప్రతిఫలించింది. రాజకీయాల్లో మహిళలు సాధించిన సమానత్వం అనగానే ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా పనిచేసిన మహిళానేతలు గుర్తుకొస్తారు. ఇంకెందరో రాష్ట్ర , కేంద్ర కాబినెట్లలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 33 శాతం నుంచి యాబై శాతం రిజర్వేషన్‌తో స్థానిక ప్రభుత్వాలలో కూడా మహిళలు అధికారంలో పాలుపంచుకుంటున్నారు. మొదట్లో పురుషులే వారి తరఫున నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సమర్థులుగా మహిళలు తమ ఉనికిని చాటుతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. 1970ల్లో మొదలైన స్త్రీవాద ఉద్యమం మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలకు ప్రశ్నించడం నేర్పింది. వారి భాగస్వామాన్ని పెంచింది. బడ్జెట్లో ఏయే శాఖలు స్త్రీ సంక్షేమానికి ఎంతెంత కేటాయించాయని అడిగేలా చేసింది . చివరకు మహిళల కోసం సపరేట్ బడ్జెట్ ఏర్పాటుకు ప్రధాన కారణమైంది . చాలా దేశాలు సాధించలేని మనకు మాత్రమే సొంతమైన ఘనత ఇది. తదుపరి 1990 దశకంలో దేశంలోని చాలాప్రాంతాల్లో పరిచయమైన స్వయం సహాయక గ్రూపులు కూడా మహిళా సాధికారతకు ఎంతో తోడ్పడ్డాయి. అనేక చోట్ల పనికోసం కాక ఒక మీటింగ్‌కోసం స్త్రీలు ఇంటి నుంచి బయటకు వచ్చే వీలు కల్పించాయి. తమ గురించి చర్చించుకునే వేదికనిచ్చాయి. మహిళలంతా ఏకమవడానికి ఉపయోగపడ్డాయి. ఇవికాక సారాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు కూడా మహిళా ఐక్య శక్తికి, సాధించిన విజయానికి నిదర్శనాలే. ఇవన్నీ ఒకెత్తయితే స్త్రీలకు సంబంధించి చట్టాల్లో మార్పు తెచ్చుకోగలగడం గర్వించదగ్గ పరిణామం! డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్, యాంటిడౌరీ యాక్ట్, క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్, నిర్భయ యాక్ట్, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డన్ర్ ఎగైన్స్ట్ సెక్సువల్ వయోలెన్స్ ఆఫెన్సెస్) మొదలైన ఎన్నో కీలకమైన చట్టాలు మహిళల సమానత్వం, సాధికారత గురించి పాటుపడేవే! అయితే ఇవన్నీ అవలీలగా వచ్చినవి కావు. ఎన్నో పోరాటాల వల్ల చేకూరిన విజయాలు. వీటితోనే అన్నీ సాధించేసినట్టా? కాదు. ఇంకా పోరాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ సమస్యలు, సవాళ్లున్నాయో ఆ రంగాలన్నిటినీ పరిశీలిద్దాం. ఉదాహరణకు కార్మికశక్తి (లేబర్‌ఫోర్స్)లో మహిళాభాగస్వామ్యం చూస్తే 25 శాతమే ఉంది. పురుషుల భాగస్వామ్యం 75 శాతం. వర్క్‌ఫోర్స్‌లో స్త్రీల భాగస్వామ్యం ఇంత తక్కువగా ఎందుకు ఉంది? నేను చెప్పేది పెయిడ్ లేబర్ ఫోర్స్ గురించే. ఎందుకంటే ఇంట్లో చేసే పనికి లెక్కేలేదు. లెక్కకట్టలేరు కూడా. మహిళల పై హింస, మద్యానికి బానిసలైన పురుషుల పేద కుటుంబాల పరిస్థితీ చాలా దారుణంగా ఉంది. పిల్లల చదువు మొదలు ఇంటిని నడిపే బాధ్యత దాకా ఆర్థికభారం స్త్రీలదే. అదీగాక మొగుళ్ల ఆరోగ్యం, వీళ్ల ఆరోగ్యం గురించి కూడా ఆ ఆడవాళ్లే ఆలోచించాలి, చూసుకోవాలి. వీటిన్నటికీ తోడు గృహ హింస ఒకటి. అదనంగా అప్పుల కష్టాలు. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకునే ప్రభుత్వాల ఆరాటం ఈ స్త్రీల ప్రాణానికి సంకటంలా మారుతున్నాయి. ఇలాంటప్పుడే ఏ సమానత్వం గురించి మనం పోరాడుతున్నామో ఆ సమానత్వానికి అర్థమే లేకుండా పోతుందనిపిస్తోంది. ఇదేమీ అట్టడుగు వర్గాలకే పరిమితమైందికాదు. మధ్యతరగతిలోనూ సర్వసాధారణం! విద్యారంగానికి వస్తే... 65 శాతం మంది అబ్బాయిలు పదవ తరగతి పూర్తిచేసుకుంటుంటే అమ్మాయిల్లో కేవలం 35 శాతం మందే పది దాటగలుగుతున్నారు. ఈ డ్రాప్ అవుట్స్‌కి, సమాజంలో ఉన్న లింగ వివక్షకు సంబంధం లేకపోలేదు. బాల్య వివాహాలు కూడా మరో కారణం. బేటీ బచావో, బేటీ పడావో, కళ్యాణ లక్ష్మి అంటూ కార్యక్రమాలు పెడుతున్నాం. తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లిభారం తగ్గించాలనే ఉద్దేశంతో మొదలైన ఈ పథకం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ. కోట్ల రూపాయలను కళ్యాణ లక్ష్మికి కేటాయించే బదులు ఆ డబ్బును ఆడపిల్ల చదువుకు పెడితే అమ్మాయిలకు ఆర్థికస్వావలంబనైనా చేకూరుతుందని ఒక సదస్సులో బాలికలు డిమాండ్ చేశారు. చదువుకునేందుకు సౌకర్యాలు విస్తృతం చేయాలని, ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని, హాస్టల్స్పెంచాలని, అమ్మాయిలకు భద్రత కల్పించాలని నినదించారు. మధ్యతరగతికి వస్తే... స్త్రీ, పురుషులిద్దరూ పనిచేస్తేకాని గడవని పరిస్థితులు ఇప్పుడు. ఇద్దరూ బయటకు వెళ్లి పనిచేస్తున్నప్పుడు ఆ ఇద్దరూ ఇంట్లో పనిని కూడా సమానంగా పంచుకోవాలి. ఆ సంప్రదాయం మనకు ఇంకా రాలేదు. మగవాళ్లు డొమెస్టిక్వర్క్ను కూడా సమానంగా షేర్చేసుకోవాలి. వంట దగ్గర్నుంచి పిల్లలను చూసుకోవడం వరకు ప్రతిపనిని సమానంగా పంచుకోవాలి. ఇక పోతే పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మహిళ ఆరోగ్య సమస్యలు, ఉపాధి, రక్షణ, విద్య సౌకర్యాల మీద దృష్టి సారించాలి. మొత్తమ్మీద రాజ్యాంగ నిర్మాతలు ఏ సదుద్దేశంతో పౌరులందరికి సమానహక్కులు పొందుపరిచారో వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. పురుషాధిక్య భావజాల వ్యతిరేక పోరాటం అంటే పురుషులను వ్యతిరేకించడం కానేకాదు. స్త్రీలతో కలిసి పురుషులు ఈ పోరాటానికి సిద్ధంకావడమని. అలా ఐక్యపోరాటంతో స్త్రీ, పురుష సమానతవ సాధిద్దామని ఈ సందర్భంగా ప్రతిన బూనుదాం. – శాంతాసిన్హా, విద్యావేత్త, రామన్ మెగసేసె అవార్డు గ్రహీత -
నదికీ మనిషితో సమాన హక్కులు
-
నదికీ మనిషితో సమాన హక్కులు
ఇదేంటి... నదికి హక్కులేమిటని ఆశ్చర్యపోతున్నారా! స్థానిక ఆదివాసీల మనోభావాలను గౌరవించి నదికి మనిషితో సమానంగా హక్కులిచ్చారు. న్యూజిలాండ్ లో తాజాగా ఈ మేరకు పార్లమెంటు ఒక బిల్లును పాస్ చేసింది. ఇలా ఒక నదికి మనిషితో సమానంగా హక్కులు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. వాంగనుయ్ అనేది న్యూజిలాండ్‌లో మూడో అతిపెద్ద నది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ‘మావోరి’ తెగ ప్రజలు ఈ నదిని తమ పూర్వీకుడిగా పరిగణిస్తారు. మనిషితో సమానంగా వాంగనుయ్ నదికి కూడా చట్టబద్ధమైన హక్కులు ఉండాలని వీరు 140 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఈ బిల్లు పాస్ కాగానే ఆదివాసీల ప్రతినిధులు పలువురు ఆనందబాష్పాలు రాల్చారు. నదీ పరివాహక ప్రాంతాలు తమవేననే వాదనతో 80 ఏళ్లుగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. న్యూజిలాండ్ చరిత్రలో సుదీర్ఘ కోర్టు కేసుల్లో ఒకటి హంగనుయ్ నదికి మనిషితో సమానంగా హక్కులు కల్పించడంతో ముగిసింది. ఉత్తర న్యూజిలాండ్‌లో కొండలు, లోయల గుండా 290 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలిసే హంగనుయ్ నదితో మావోరిల జీవితం పెనవేసుకుపో యింది. పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని నివసించే మావోరిలు ‘నేనే నది. నదియే నేను’ అనే భావనతో ఉంటా రు. వాగులు, వంకలు, గుట్టలు, సముద్రా లు... ఇలా ప్రకృతిలోని అన్నీ మనుషులతో సమానమేనన్నది వీరి నమ్మకం. ఆచారవ్యవహారాలు కూడా అలాగే ఉంటాయి. నదితో తమకున్న అనుబం ధాన్ని, హక్కులకు గుర్తించాలని పోరాటం చేసి మావోరిలు విజయం సాధించారు. ‘తె అవా తుపువా’ బిల్లు ప్రకారం నది వ్యవహా రాలు చూసేందుకు ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఒకరిని వాంగనుయ్ ఐవీ (నదిపై ఆధారపడ్డ తెగల బృందం) నియమిస్తుంది. మరొకరిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరూ నదికి ప్రతినిధులుగా వ్యవహరి స్తారు. ఎవరైనా నదిని కలుషితం చేసినా... మరే ఇతర హాని తలపెట్టినా వాంగనుయ్కు మనిషిలాగే హక్కులుంటాయి. కాబట్టి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుం ది. ఆదివాసీలతో సమానంగా వాంగనుయ్ నదిని చట్టం గుర్తిస్తుంది. 8.1 కోట్ల న్యూజి లాండ్ డాలర్లను (న్యూజిలాండ్ డాలర్ మన కరెన్సీలో 45 రూపాయలకు సమానం) ప్రభుత్వం తె ఆవా తుపువాకు కేటాయి స్తుంది. వీటిలో 3 కోట్ల డాలర్లను నదిని ఆరోగ్యంగా (కాలుష్య రహితంగా) ఉంచడా నికి ఏర్పాటు చేసిన ఫండ్‌కు కేటాయిస్తారు. నది ప్రతినిధులుగా వ్యవహరించే ఇద్దరికి 20 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల డాలర్లు ఇస్తారు. న్యూజిలాండ్‌లో కంపెనీలకు కూడా ‘లీగల్ పర్సన్’ హోదా ఉంటుంది. అంటే భౌతికంగా మనిషి రూపంలో లేకున్నా... లీగల్ పర్సన్‌కు పౌరులకు ఉండే హక్కులు కొన్ని ఉంటాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నదికీ మనిషితో సమాన హక్కులు
ఇదేంటి... నదికి హక్కులేమిటని ఆశ్చర్యపోతున్నారా! స్థానిక ఆదివాసీల మనోభావాలను గౌరవించి నదికి మనిషితో సమానంగా హక్కులిచ్చారు. న్యూజిలాండ్‌లో బుధవారం ఈమేరకు పార్లమెంటు ఒక బిల్లును పాస్ చేసింది. ఇలా ఒక నదికి మనిషితో సమానంగా హక్కులు ఇవ్వడం ప్రపంచంలో ఇదేతొలిసారి. వాంగనుయ్ అనేది న్యూజిలాండ్‌లో మూడో అతిపెద్ద నది. నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే మావోరి తెగ ప్రజలు ఈ నదిని తమ పూర్వీకుడిగా పరిగణిస్తారు. మనిషితో సమానంగా వాంగనుయ్ నదికి కూడా చట్టబద్ధమైన హక్కులు ఉండాలని వీరు 140 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఈ బిల్లు పాస్ కాగానే ఆదివాసీల ప్రతినిధులు పలువురు ఆనందబాష్పాలు రాల్చారు. నదీ పరివాహక ప్రాంతాలు తమవేననే వాదనతో 80 ఏళ్లుగా కోర్టులో కేసు కూడా నడుస్తోంది. న్యూజిలాండ్ చరిత్రలో సుదీర్ఘ కోర్టు కేసుల్లో ఒకటి వాంగనుయ్ నదికి మనిషితో సమానంగా హక్కులు కల్పించడంతో ముగిసింది. ఉత్తర న్యూజిలాండ్‌లో కొండలు, లోయల గుండా 290 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలిసే వాంగనుయ్ నదితో మావోరిల జీవితం పెనవేసుకుపోయింది. పరివాహక ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని నివసించే మావోరిలు నేనే నది. నదియే నేను అనే భావనతో ఉంటారు. వాగులు, వంకలు, గుట్టలు, సముద్రాలు... ఇలా ప్రకృతిలోని అన్నీ మనుషులతో సమానమేనన్నది వీరి నమ్మకం. ఆచారవ్యవహారాలు కూడా అలాగే ఉంటాయి. నదితో తమకున్న అనుబంధాన్ని, హక్కులకు గుర్తించాలని పోరాటం చేసి మావోరిలు విజయం సాధించారు. తె అవా తుపువా బిల్లు ప్రకారం నది వ్యవహారాలు చూసేందుకు ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ఒకరిని వాంగనుయ్ ఐవీ (నదిపై ఆధారపడ్డ తెగల బృందం) నియమిస్తుంది. మరొకరిని ప్రభుత్వం నియమిస్తుంది. వీరిద్దరూ నదికి ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. ఎవరైనా నదిని కలుషితం చేసినా... మరే ఇతర హాని తలపెట్టినా వాంగనుయ్కు మనిషిలాగే హక్కులుంటాయి. కాబట్టి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపడుతుంది. ఆదివాసీలతో సమానంగా వాంగనుయ్ నదిని చట్టం గుర్తిస్తుంది. 8.1 కోట్ల న్యూజిలాండ్ డాలర్లను (న్యూజిలాండ్ డాలర్ మన కరెన్సీలో 45 రూపాయలకు సమానం) ప్రభుత్వం తె ఆవా తుపువాకు కేటాయిస్తుంది. వీటిలో 3 కోట్ల డాలర్లను నదిని ఆరోగ్యంగా (కాలుష్య రహితంగా) ఉంచడానికి ఏర్పాటు చేసిన ఫండ్‌కు కేటాయిస్తారు. నది ప్రతినిధులుగా వ్యవహరించే ఇద్దరికి 20 ఏళ్ల పాటు ఏడాదికి రెండు లక్షల డాలర్లు ఇస్తారు. న్యూజిలాండ్‌లో కంపెనీలకు కూడా లీగల్ పర్సన్ హోదా ఉంటుంది. అంటే భౌతికంగా మనిషి రూపంలో లేకున్నా... లీగల్ పర్సన్‌కు పౌరులకు ఉండే హక్కులు కొన్ని ఉంటాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాలికలకు సమాన హక్కులు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆడ పిల్లలకు మగ పిల్లలతో సమానంగా హక్కులుంటాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఆడ భ్రూణహత్యల నివారణకు దేశ వ్యాప్తంగా కొత్తగా పుట్టిన వారి డేటాబేస్‌ను నిర్వహించాలని ఆదేశించింది. భ్రూణ హత్యలు మన విలువల పతనానికి దారితీస్తున్నాయని, లింగ నిష్పత్తిని తగ్గిస్తున్నాయని పేర్కొంది. ఇది ఇలాగే కొనసాగితే ఊహించలేని విపత్తు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బాలికలకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి రాజీ ఉండరాదని ఉద్ఘాటిస్తూ...పెత్తనం, అహంకారం లాంటి ప్రశ్నలకు తావుండరాదని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు ప్రకటించింది. -
ఇక ట్రాన్స్‌జెండర్లకూ సమానహక్కులు!
రాజ్యసభ చరిత్రలోనే ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్లుగా.. ఓ సభ్యుడి ప్రైవేటు బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ట్రాన్స్జెండర్లకు (లింగమార్పిడి చేయించుకున్నవారు) ఇతర పౌరులతో సమానహక్కుల కల్పించాలనే ఈ బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇలా ఏకగ్రీవంగా ఆమోదం పొందడం అత్యంత అరుదైన విషయమని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ వ్యాఖ్యానించారు. ట్రాన్స్‌జెండర్ వర్గీయుల కోసం కేంద్ర, రాష్ట్రాల స్థాయుల్లో ప్రత్యేక కమిషన్లను ఏర్పాటుచేయాలని కూడా ఈ బిల్లులో పేర్కొన్నారు. చిట్టచివరి సారిగా ఓ ప్రైవేటు బిల్లు 1970లో ఆమోదం పొందింది. ప్రభుత్వంలో భాగం కాని అంటే.. మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేటు బిల్లు అంటారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ల హక్కుల బిల్లును డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ ప్రవేశపెట్టారు. అందరికీ మానవహక్కులు ఉన్నాయని, అలాంటప్పుడు కొంతమందిని ఎందుకు నిర్లక్ష్యం చేయాలని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లును రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది. -
''స్వలింగ సంపర్కులకు సర్వహక్కులు''
-
స్వలింగ సంపర్కులకు సర్వహక్కులుః సుప్రీం కోర్టు సంచలన తీర్పు
స్వలింగ సంపర్కులు, నపుంసకులు, తృతీయ ప్రకృతికి చెందిన వారిని మిగతా పౌరుల్లాగానే చూడాలని, మిగతావారికి ఉన్న సామాజిక ఆమోదం, సమానావకాశాల వంటి అన్ని హక్కులు వారికి కూడా ఉండాలని సుప్రీం కోర్టు బుధవారం సంచలనాత్మక తీర్పునిచ్చింది. వీరిని తృతీయ ప్రకృతిగా పరిగణించాలని సర్వోచ్చ న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు కె ఎస్ రాధాకృష్ణన్, ఎకె సిక్రీలతో కూడిన ధర్మాసనం ఈ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. తృతీయప్రకృతి పట్ల వివక్షను అంతమొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. తృతీయ ప్రకృతిని సామాజికంగా వెనుకబడిన వారిగా గుర్తించాలని కూడ న్యాయస్థానం ఆదేశించింది. డ్రైవింగ్ లైసెన్సులు, రేషన్ కార్డులు, ఎన్నికల గుర్తింపు కార్డు, పాస్ పోర్టుల దరఖాస్తు ఫారాల్లో స్త్రీ, పురుష తో పాటు తృతీయ ప్రకృతి అనే క్యాటగరీని జోడించాలని, వారికి విద్యా సంస్థల్లో, ఆసుపత్రుల్లో ప్రవేశాన్ని కల్పించాలని, వారికి టాయిలెట్ల ఏర్పాటు చేయించాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. లక్ష్మీ త్రిపాఠీ అనే తృతీయ ప్రకృతికి చెందిన వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈ సంచలనాత్మక తీర్పును వెలువరించింది. లక్ష్మీ త్రిపాఠీ ఈ తీర్పును చరిత్ర గతిని మార్చేసే తీర్పుగా అభివర్ణించింది.