న్యూఢిల్లీ: ఉమ్మడి హిందూ కుటుంబ ఆస్తిలో కొడుకులతో పాటు, కూతుళ్లకు సమాన హక్కులుంటాయని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005కి ముందు తండ్రి మరణించినప్పటికీ కూతురుకి ఆ హక్కులు దక్కుతాయని స్పష్టం చేసింది. సమానత్వ హక్కుని కూతుళ్ళకి నిరాకరించతగదని కూడా స్పష్టం చేసింది. హిందూ వారసత్వ చట్టం–1956లోని సెక్షన్ 6ప్రకారం, చట్టంలో సవరణలకి ముందు లేదా తరువాత పుట్టిన కూతుళ్ళకు కూడా కొడుకులకు మాదిరిగానే హక్కులు, బాధ్యతలు సమానంగా ఉంటాయని జస్టిస్ ఆరుణ్ మిశ్రా, జస్టిస్ ఎస్.నజీర్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం తీర్పునిచ్చింది.
హిందూ వారసత్వ చట్టం 1956కి చేసిన సవరణ ద్వారా కూతుళ్ళకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 9, 2005 నాటికి జీవించి ఉన్నవారి కూతుళ్ళకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తోసిరాజని ‘‘కూతురు ఎప్పటికీ ప్రియమైన కూతురే’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఒక కొడుకు భార్య వచ్చినంత వరకే కొడుకుగా ఉంటాడు. అదే కూతురు జీవితాంతం కూతురుగానే ఉంటుంది’’అని తన తీర్పులో పేర్కొంది. ఇప్పటికే వివిధ కోర్టులలో పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో అప్పీళ్ళు ఉన్నాయని, విభిన్నమైన తీర్పులివ్వడంతో తీర్పు ఆలస్యం అవుతోందని వ్యాఖ్యానించింది. ఈ అప్పీళ్ళను 6 నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment