న్యూఢిల్లీ: తప్పు చేసిన వారికి తగు శిక్ష పడేలా చేయడానికే నేర విచారణ జరుగుతుందని, అంతే తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని ఆమె మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు సుప్రీంకోర్టులో నమ్మకద్రోహం కేసు వేశారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు, ఆస్తులను స్త్రీ ధనంగా పరిగణిస్తారు. స్త్రీ ధనంపై భార్య లేదా మాజీ భార్యకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. ఇదివరకే న్యాయస్థానాలు దీన్ని స్పష్టం చేశాయన్నారు.
వ్యక్తిగత కక్ష్యలు మనసులో పెట్టుకొని.. ప్రతీకారం తీర్చుకోవడానికి న్యాయ విచారణ ప్రక్రియను ఉపయోగించుకోకూడదని వీరభద్ర రావుకు ధర్మాసనం సూచించింది. 1999లో తన కూతురికి పెళ్లి సమయంలో బంగారు నగలు, ఇతర కానుకలు ఇచ్చానని, తర్వాత దంపతులు అమెరికాకు వెళ్లారని రావు కోర్టుకు తెలిపారు. 2016లో అమెరికాలో విడాకులు తీసుకున్నారని, తన కూతురికి ఇచి్చన నగలు ఆమె మాజీ అత్తమామల దగ్గరే ఉన్నాయని వాదించారు. అయితే స్త్రీ ధనంపై భర్తకు గాని, తండ్రికి గాని ఎలాంటి హక్కులు ఉండవని, స్త్రీ ధనాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కేసు పెడితే ఆమె పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment