
మహా మహిళ
మహిళా భారతం
స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతోంది.. ఇన్నేళ్ల మహిళా ప్రగతి గురించి మాట్లాడుకుందాం. ముందు సానుకూలతల నుంచి మొదలుపెడదాం! రాజ్యాంగం మహిళలకు కల్పించిన సమాన హక్కులు చారిత్రాత్మకం. దీనికోసం ఇతర దేశాల్లో చాలా పోరాటాలే జరిగాయి. జరుగుతున్నాయి కూడా! అయితే మన దగ్గరా ఇవి అంత ఆషామాషీగా ఏమీ రాలేదు. జాతీయోద్యమంలో స్వతహాగా మహిళలు చూపిన చొరవ, వహించిన నేతృత్వమే తర్వాత రాజ్యాంగంలోని సమానహక్కులకు ప్రాతిపదిక, ప్రేరణ అయింది. కుల, మత, జాతి, వర్గ విభేదాలకు అతీతంగా జాతీయోద్యమం చూపిన స్ఫూర్తి, చాటిన విలువ సమానత్వమే.
అదే రాజ్యాంగంలో ప్రతిఫలించింది. రాజకీయాల్లో మహిళలు సాధించిన సమానత్వం అనగానే ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్లు, ముఖ్యమంత్రులు, గవర్నర్లుగా పనిచేసిన మహిళానేతలు గుర్తుకొస్తారు. ఇంకెందరో రాష్ట్ర , కేంద్ర కాబినెట్లలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 33 శాతం నుంచి యాబై శాతం రిజర్వేషన్‌తో స్థానిక ప్రభుత్వాలలో కూడా మహిళలు అధికారంలో పాలుపంచుకుంటున్నారు. మొదట్లో పురుషులే వారి తరఫున నిర్ణయాలు తీసుకున్నా ఇప్పుడు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే సమర్థులుగా మహిళలు తమ ఉనికిని చాటుతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
1970ల్లో మొదలైన స్త్రీవాద ఉద్యమం మధ్యతరగతి కుటుంబాల్లోని స్త్రీలకు ప్రశ్నించడం నేర్పింది. వారి భాగస్వామాన్ని పెంచింది. బడ్జెట్‌లో ఏయే శాఖలు స్త్రీ సంక్షేమానికి ఎంతెంత కేటాయించాయని అడిగేలా చేసింది . చివరకు మహిళల కోసం సపరేట్ బడ్జెట్ ఏర్పాటుకు ప్రధాన కారణమైంది . చాలా దేశాలు సాధించలేని మనకు మాత్రమే సొంతమైన ఘనత ఇది. తదుపరి 1990 దశకంలో దేశంలోని చాలాప్రాంతాల్లో పరిచయమైన స్వయం సహాయక గ్రూపులు కూడా మహిళా సాధికారతకు ఎంతో తోడ్పడ్డాయి. అనేక చోట్ల పనికోసం కాక ఒక మీటింగ్‌కోసం స్త్రీలు ఇంటి నుంచి బయటకు వచ్చే వీలు కల్పించాయి. తమ గురించి చర్చించుకునే వేదికనిచ్చాయి. మహిళలంతా ఏకమవడానికి ఉపయోగపడ్డాయి. ఇవికాక సారాకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలు కూడా మహిళా ఐక్య శక్తికి, సాధించిన విజయానికి నిదర్శనాలే.
ఇవన్నీ ఒకెత్తయితే స్త్రీలకు సంబంధించి చట్టాల్లో మార్పు తెచ్చుకోగలగడం గర్వించదగ్గ పరిణామం! డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్, యాంటిడౌరీ యాక్ట్, క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్, నిర్భయ యాక్ట్, పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డన్ర్ ఎగైన్‌స్ట్ సెక్సువల్ వయోలెన్స్ ఆఫెన్సెస్) మొదలైన ఎన్నో కీలకమైన చట్టాలు మహిళల సమానత్వం, సాధికారత గురించి పాటుపడేవే! అయితే ఇవన్నీ అవలీలగా వచ్చినవి కావు. ఎన్నో పోరాటాల వల్ల చేకూరిన విజయాలు.
వీటితోనే అన్నీ సాధించేసినట్టా? కాదు. ఇంకా పోరాడాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎక్కడెక్కడ సమస్యలు, సవాళ్లున్నాయో ఆ రంగాలన్నిటినీ పరిశీలిద్దాం. ఉదాహరణకు కార్మికశక్తి (లేబర్‌ఫోర్స్)లో మహిళాభాగస్వామ్యం చూస్తే 25 శాతమే ఉంది. పురుషుల భాగస్వామ్యం 75 శాతం. వర్క్‌ఫోర్స్‌లో స్త్రీల భాగస్వామ్యం ఇంత తక్కువగా ఎందుకు ఉంది? నేను చెప్పేది పెయిడ్ లేబర్ ఫోర్స్ గురించే. ఎందుకంటే ఇంట్లో చేసే పనికి లెక్కేలేదు. లెక్కకట్టలేరు కూడా.
మహిళల పై హింస, మద్యానికి బానిసలైన పురుషుల పేద కుటుంబాల పరిస్థితీ చాలా దారుణంగా ఉంది. పిల్లల చదువు మొదలు ఇంటిని నడిపే బాధ్యత దాకా ఆర్థికభారం స్త్రీలదే. అదీగాక మొగుళ్ల ఆరోగ్యం, వీళ్ల ఆరోగ్యం గురించి కూడా ఆ ఆడవాళ్లే ఆలోచించాలి, చూసుకోవాలి. వీటిన్నటికీ తోడు గృహ హింస ఒకటి. అదనంగా అప్పుల కష్టాలు. మద్యం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలనుకునే ప్రభుత్వాల ఆరాటం ఈ స్త్రీల ప్రాణానికి సంకటంలా మారుతున్నాయి. ఇలాంటప్పుడే ఏ సమానత్వం గురించి మనం పోరాడుతున్నామో ఆ సమానత్వానికి అర్థమే లేకుండా పోతుందనిపిస్తోంది. ఇదేమీ అట్టడుగు వర్గాలకే పరిమితమైందికాదు.
మధ్యతరగతిలోనూ సర్వసాధారణం!
విద్యారంగానికి వస్తే... 65 శాతం మంది అబ్బాయిలు పదవ తరగతి పూర్తిచేసుకుంటుంటే అమ్మాయిల్లో కేవలం 35 శాతం మందే పది దాటగలుగుతున్నారు. ఈ డ్రాప్ అవుట్స్‌కి, సమాజంలో ఉన్న లింగ వివక్షకు సంబంధం లేకపోలేదు. బాల్య వివాహాలు కూడా మరో కారణం. బేటీ బచావో, బేటీ పడావో, కళ్యాణ లక్ష్మి అంటూ కార్యక్రమాలు పెడుతున్నాం. తల్లిదండ్రులకు ఆడపిల్ల పెళ్లిభారం తగ్గించాలనే ఉద్దేశంతో మొదలైన ఈ పథకం వల్ల మంచికన్నా చెడే ఎక్కువ. కోట్ల రూపాయలను కళ్యాణ లక్ష్మికి కేటాయించే బదులు ఆ డబ్బును ఆడపిల్ల చదువుకు పెడితే అమ్మాయిలకు ఆర్థికస్వావలంబనైనా చేకూరుతుందని ఒక సదస్సులో బాలికలు డిమాండ్ చేశారు. చదువుకునేందుకు సౌకర్యాలు విస్తృతం చేయాలని, ఉచితంగా బస్‌పాస్‌లు ఇవ్వాలని, హాస్టల్స్‌పెంచాలని, అమ్మాయిలకు భద్రత కల్పించాలని నినదించారు.
మధ్యతరగతికి వస్తే... స్త్రీ, పురుషులిద్దరూ పనిచేస్తేకాని గడవని పరిస్థితులు ఇప్పుడు. ఇద్దరూ బయటకు వెళ్లి పనిచేస్తున్నప్పుడు ఆ ఇద్దరూ ఇంట్లో పనిని కూడా సమానంగా పంచుకోవాలి. ఆ సంప్రదాయం మనకు ఇంకా రాలేదు. మగవాళ్లు డొమెస్టిక్‌వర్క్‌ను కూడా సమానంగా షేర్‌చేసుకోవాలి. వంట దగ్గర్నుంచి పిల్లలను చూసుకోవడం వరకు ప్రతిపనిని సమానంగా పంచుకోవాలి. ఇక పోతే పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా మహిళా ప్రాతినిధ్యం పెరగాలి. లోక్‌సభలో 33 శాతం రిజర్వేషన్ కావాలని ఏళ్ల తరబడి అడుగుతున్నా అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మహిళ ఆరోగ్య సమస్యలు, ఉపాధి, రక్షణ, విద్య సౌకర్యాల మీద దృష్టి సారించాలి.
మొత్తమ్మీద రాజ్యాంగ నిర్మాతలు ఏ సదుద్దేశంతో పౌరులందరికి సమానహక్కులు పొందుపరిచారో వాటిని కాపాడుకునే బాధ్యత మనందరిపైనా ఉంది. పురుషాధిక్య భావజాల వ్యతిరేక పోరాటం అంటే పురుషులను వ్యతిరేకించడం కానేకాదు. స్త్రీలతో కలిసి పురుషులు ఈ పోరాటానికి సిద్ధంకావడమని. అలా ఐక్యపోరాటంతో స్త్రీ, పురుష సమానతవ సాధిద్దామని ఈ సందర్భంగా ప్రతిన బూనుదాం.
– శాంతాసిన్హా, విద్యావేత్త, రామన్ మెగసేసె అవార్డు గ్రహీత