‘ఆ అధికారాలన్నీ మధ్యవర్తికి ఉండవు’ | Hyderabad high Court Says Arbitrator Not Equal To Civil Court | Sakshi
Sakshi News home page

‘ఆ అధికారాలన్నీ మధ్యవర్తికి ఉండవు’

Published Wed, May 30 2018 3:27 AM | Last Updated on Wed, Sep 19 2018 6:36 PM

Hyderabad high Court Says Arbitrator Not Equal To Civil Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సివిల్‌ కోర్టుకున్న అధికారాలన్నీ మధ్యవర్తి(ఆర్బిట్రేటర్‌)కి ఉండవని హైకోర్టు తెలిపింది. మధ్యవర్తి కోర్టుతో సమానం కాదని పేర్కొంది. మధ్యవర్తి కేవలం కోర్టుకు ఓ ప్రత్యామ్నాయ వేదిక మాత్రమేనని స్పష్టం చేసింది. సివిల్‌ కేసుల్లో అభ్యర్థనలు వేర్వేరుగా ఉండి, వైరుద్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నప్పుడు ఆ కేసులను సివిల్‌ కోర్టే విచారించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి కేసులను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్‌ కోర్టు తీర్పునివ్వడం సరికాదని తెలిపింది. ఇలా ఓ సివిల్‌ వివాదంలో మియాపూర్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.

రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో తనకున్న 1,136 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు 2007లో పాపారావు అనే వ్యక్తితో మురళీధరరావు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత 2009లో పాపారావు మేనేజింగ్‌ పార్టనర్‌గా ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌తో మురళీధరరావు మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో వివాదం తలెత్తడంతో మియాపూర్‌ కోర్టులో మురళీధరరావు 2016లో పిటిషన్‌ దాఖలు చేశారు. తన స్థలంలోని భవనంలో అద్దెకున్న సుయోషా హెల్త్‌కేర్‌ సంస్థను తనకు అద్దె, ఇతర బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. తన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా పాపారావు, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ను నిరోధించాలని అభ్యర్థించారు. ఇదే కేసులో పాపారావు, శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ కూడా ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసి, వివాదాన్ని మధ్యవర్తికి నివేదించాలని కోరాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన మియాపూర్‌ కోర్టు ఆ మేర తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మురళీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement