arbitrator
-
ఫ్యూచర్ వివాదంలో అమెజాన్‌కు ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) విలీన వివాదానికి సంబంధించి ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు ఊరట లభించింది. అమెజాన్‌కు అనుకూలంగా అత్యవసర ఆర్బిట్రేటర్ (ఈఏ) ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయని, భారత చట్టాల ప్రకారం వాటిని అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో రూ. 24,731 కోట్ల ఫ్యూచర్, రిలయన్స్ డీల్‌కు బ్రేక్ పడినట్లయింది. వివరాల్లోకి వెడితే.. ఫ్యూచర్ కూపన్స్‌లో వాటాదారైన అమెజాన్‌కు.. ఎఫ్‌ఆర్‌ఎల్‌లో కూడా కొన్ని వాటాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొనుగోలు చేసే హక్కులు కూడా దఖలు పడ్డాయి. మరోవైపు, 2020 ఆగస్టులో తమ రిటైల్ తదితర వ్యాపారాలను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేలా ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం ప్రకటించింది. దీన్ని వ్యతిరేకిస్తూ అమెజాన్ ఫ్యూచర్ గ్రూప్‌నకు లీగల్ నోటీసులు పంపింది. అటుపైన సింగపూర్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్‌ను ఆశ్రయించింది. అక్కడ ఆ సంస్థకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. అవి భారత్‌లో చెల్లుబాటు కావంటూ ఫ్యూచర్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సింగిల్ జడ్జి అమెజాన్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వగా.. వాటిపై డివిజనల్ బెంచ్ స్టే విధించింది. ఈ పరిణామాలను సవాలు చేస్తూ అమెజాన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు వచ్చాయి. -
‘ఆ అధికారాలన్నీ మధ్యవర్తికి ఉండవు’
సాక్షి, హైదరాబాద్ : సివిల్ కోర్టుకున్న అధికారాలన్నీ మధ్యవర్తి(ఆర్బిట్రేటర్)కి ఉండవని హైకోర్టు తెలిపింది. మధ్యవర్తి కోర్టుతో సమానం కాదని పేర్కొంది. మధ్యవర్తి కేవలం కోర్టుకు ఓ ప్రత్యామ్నాయ వేదిక మాత్రమేనని స్పష్టం చేసింది. సివిల్ కేసుల్లో అభ్యర్థనలు వేర్వేరుగా ఉండి, వైరుద్య నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నప్పుడు ఆ కేసులను సివిల్ కోర్టే విచారించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటువంటి కేసులను మధ్యవర్తి ద్వారా పరిష్కరించుకోవాలని సివిల్ కోర్టు తీర్పునివ్వడం సరికాదని తెలిపింది. ఇలా ఓ సివిల్ వివాదంలో మియాపూర్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లో తనకున్న 1,136 గజాల స్థలాన్ని అభివృద్ధి చేసేందుకు 2007లో పాపారావు అనే వ్యక్తితో మురళీధరరావు ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత 2009లో పాపారావు మేనేజింగ్ పార్టనర్‌గా ఉన్న శ్రీనివాస కన్స్ట్రక్షన్స్తో మురళీధరరావు మరో ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయంలో వివాదం తలెత్తడంతో మియాపూర్ కోర్టులో మురళీధరరావు 2016లో పిటిషన్ దాఖలు చేశారు. తన స్థలంలోని భవనంలో అద్దెకున్న సుయోషా హెల్త్‌కేర్ సంస్థను తనకు అద్దె, ఇతర బకాయిలు చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. తన స్థలం విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకుండా పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ను నిరోధించాలని అభ్యర్థించారు. ఇదే కేసులో పాపారావు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కూడా ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసి, వివాదాన్ని మధ్యవర్తికి నివేదించాలని కోరాయి. ఇందుకు సానుకూలంగా స్పందించిన మియాపూర్ కోర్టు ఆ మేర తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ మురళీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. -
ఆర్బిట్రేటర్ ముందుకు ఆర్ఐఎల్-ఓఎన్జీసీ వివాదం
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదం మధ్యవర్తిత్వ పరిష్కారానికి (ఆర్బిట్రేషన్) వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీ గ్యాస్‌ను ఆర్ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఖరారు చేసే పనిలో ఉంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిటీ వివాదాన్ని ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టు (పీఎస్సీ) కింద పరిష్కరించాలని సూచించిన విషయం తెలిసిందే. పీఎస్సీ కింద ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టర్ మధ్య వివాదం తలెత్తితే పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చమురు మంత్రిత్వ శాఖకు న్యాయనిపుణులు సూచించినట్టు తెలిసింది. కాగా, ఆర్ఐఎల్ చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేసే పనిలో డీజీహెచ్ ఉందని, కొన్ని రోజుల్లో దీన్ని వెల్లడించనున్నట్టు ఆ శాఖ అధికారి తెలిపారు. -
వైదొలగుతూ విమర్శనాస్త్రాలు..
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ కేజీ డీ6 వివాదానికి సంబంధించిన ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) ట్రిబ్యునల్‌కు ఆర్బిట్రేటర్‌గా సుప్రీం కోర్టు నియమించిన ఆస్ట్రేలియా జడ్జి మైకేల్ మెక్‌హ్యూ ఆ పదవి నుంచి తప్పుకునే ముందు ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. తన ప్రకటనలకు తప్పుడు భాష్యం చెప్పారని పేర్కొన్నారు. కేజీ డీ6లో గ్యాస్ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకుగాను 237 కోట్ల డాలర్ల వ్యయ రికవరీని ప్రభుత్వం నిరాకరించింది. సర్కారు నిర్ణయం సరైనదేనా అని తేల్చేందుకు ఏర్పాటు చేసిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌కు మూడో ఆర్బిట్రేటర్‌గా మెక్హ్యూను ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు నియమించింది. తనను సంప్రదించలేదంటూ ఈ పదవిని చేపట్టడానికి తొలుత నిరాకరించిన ఆయన కేజీ డీ6 భాగస్వాములు సంప్రదించడంతో మే 29న సుముఖత వ్యక్తంచేశారు. ఒకసారి నిరాకరించిన తర్వాత మళ్లీ ఆ పదవిని చేపట్టజాలరంటూ ప్రభుత్వం, దాని తరఫు న్యాయవాదులు వ్యాఖ్యానించడంతో... వైదొలగుతున్నానంటూ జూలై 20న మెక్‌హ్యూ ప్రకటించారు. అంతకుముందుగానే ప్రభుత్వ లాయర్లకు లేఖ రాశారు. ‘సుప్రీం కోర్టు ప్రతిపాదనకు విముఖత వెలిబుచ్చుతూ మే 25న ఈమెయిల్ పంపించాను. దాన్ని కోర్టు ఆమోదించేంత వరకూ నేను ఉపసంహరించుకున్నట్లు భావించరాదు. ఓ సైనికాధికారి రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించే వరకు రాజీనామా లేఖ ప్రభావం ఉండదు. కోర్టు నియమించిన ఆర్బిట్రేటర్ వ్యవహారం కూడా ఇలానే ఉంటుంది..’ అని మెక్‌హ్యూ వ్యాఖ్యానించారు. -
ఆర్ఐఎల్ గ్యాస్ కేసులో విదేశీ ఆర్బిట్రేటర్ ఎంపిక
న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించి మూడో ఆర్బిట్రేటర్‌గా ఆస్ట్రేలియా మాజీ జడ్జి జేమ్స్ జాకబ్ స్పిగెల్మ్యాన్ని సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆయన పేరును సూచించింది. విదేశీ ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని బెంచ్ పేర్కొంది. కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోయిన అంశంలో ఆర్‌ఐఎల్‌పై కేంద్రం 1.79 బిలియన్ డాలర్ల మేర జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఆర్ఐఎల్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ) ప్రక్రియ ప్రారంభిం చింది. ఇందుకు సంబంధించిన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్లో ఇప్పటికే ఇద్దరు నియమితులు కాగా.. మూడో ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్మ్యాన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో చీఫ్ జస్టిస్‌గాను, లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.