ఆర్బిట్రేటర్ ముందుకు ఆర్ఐఎల్-ఓఎన్జీసీ వివాదం
న్యూఢిల్లీ: కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) తన బావుల పక్కనే ఉన్న ఓఎన్‌జీసీ బావుల నుంచి గ్యాస్‌ను తోడివేయడంపై వివాదం మధ్యవర్తిత్వ పరిష్కారానికి (ఆర్బిట్రేషన్) వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఓఎన్‌జీసీ గ్యాస్‌ను ఆర్‌ఐఎల్ ఉత్పత్తి చేసినందున అందుకు పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్ని చమురు మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఖరారు చేసే పనిలో ఉంది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన జస్టిస్ షా కమిటీ వివాదాన్ని ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టు (పీఎస్‌సీ) కింద పరిష్కరించాలని సూచించిన విషయం తెలిసిందే. పీఎస్‌సీ కింద ప్రభుత్వం, ప్రైవేటు కాంట్రాక్టర్ మధ్య వివాదం తలెత్తితే పరిష్కారం కోసం మధ్యవర్తిత్వానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందని చమురు మంత్రిత్వ శాఖకు న్యాయనిపుణులు సూచించినట్టు తెలిసింది. కాగా, ఆర్‌ఐఎల్ చెల్లించాల్సిన పరిహారాన్ని ఖరారు చేసే పనిలో డీజీహెచ్ ఉందని, కొన్ని రోజుల్లో దీన్ని వెల్లడించనున్నట్టు ఆ శాఖ అధికారి తెలిపారు.