
అలలపై ఊయల విల్లాలు!
జనాభా పెరిగిపోతోందని... ఉన్న స్థలం సరిపోవడం లేదనీ ఎవరో ఒకరు అనడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం.
జనాభా పెరిగిపోతోందని... ఉన్న స్థలం సరిపోవడం లేదనీ ఎవరో ఒకరు అనడం అప్పుడప్పుడూ వింటూనే ఉంటాం. మనమూ అనుకుంటూనే ఉంటాం. నేడో.. రేపో జనాలు సముద్రాలపై నివసించక తప్పని పరిస్థితులు వస్తాయని నిపుణులూ హెచ్చరిస్తూంటారు. ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో తెలియదుగానీ... ఇక్కడ ఫొటోల్లో చూపిన ‘స్టింగ్ రే’ లాంటి సూపర్ విల్లాలు కొందరికి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇది సముద్రానికి ఆనుకుని నీటిపై తేలియాడుతూ ఉంటుంది. అలాగని ఒకేచోట స్థిరంగా ఉండదు. అవసరమైనప్పుడల్లా ఒకచోటి నుంచి మరో చోటికి వెళ్లిపోవచ్చు. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న ష్కాప్‌ఫర్ అసోసియేట్స్ సంస్థ వీటిని డిజైన్ చేసింది.
గ్రీస్, టర్కీల మధ్య ఉండే అయేజియన్ సముద్ర దీవుల్లో వీటిని నిర్మించాలన్నది ప్లాన్. పేరుకు తగ్గట్టే దీని ఆకారం కూడా సముద్రజీవి స్టింగ్ రే మాదిరిగానే ఉంటుంది. కాకపోతే.. ఆ తోకభాగాన్ని చూశారా? అది ఇంట్లోకి వచ్చేందుకు ఏర్పాటు చేసే రహదారి. చిన్నపాటి బోట్‌తో దాదాపు 9000 చదరపు అడుగుల వైశాల్యమున్న రెండంతస్తుల ఇంటిని తీరం వెంబడి ఉన్న తోకలకు తగిలించుకోవచ్చు. ఇందుకు తగ్గట్టుగానే దీన్ని అతితేలికగా ఉండే కాంక్రీట్ ఫోమ్, ప్లాస్టిక్, లోహం వంటి పదార్థాలతోనే తయారు చేస్తారు.
రెండు కార్ పార్కింగ్ స్థలాలు, ఓ స్విమ్మింగ్ పూల్, హాట్‌టబ్, నెగడు వేసుకునే చోటుతోపాటు స్పీడ్‌బోట్‌లను తగిలించుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి దీంట్లో ఇక గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక లాంజ్, వంటగదులు ఉంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మూడు బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ప్రస్తుతం డిజైనింగ్ స్థాయిలో ఉన్న ఈ వినూత్న విల్లాలు 2017 చివరికల్లా అందుబాటులోకి వస్తాయని అంచనా.