మనకిప్పుడు.. లాడెన్‌కు అప్పట్లోనే భయం
న్యూయార్క్: సాధారణంగా ఒసామా బిన్ లాడెన్ పేరు వింటేనే మిగితా దేశాలవారేమోగానీ అమెరికన్లు మాత్రం ఉలిక్కిపడతారు. అలా అమెరికన్లనే వణికించిన లాడెన్‌ను కూడా వణికించినవారు ఉన్నారు. అదే ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు. ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్). అయితే, ఈ సంస్థ అంతకుముందే అల్ ఖాయిదా మాజీ చీఫ్, అమెరికా బలగాల దాడుల్లో చనిపోయిన కరడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను కూడా వణికించిందంట. ఈ వివరాలకు సంబంధించిన పత్రాలు ఇటీవలె అమెరికా సంస్థ సీఐఏ వెలుగులోకి తీసుకొచ్చింది.
వాస్తవానికి ప్రపంచ నలుమూలల్లో ఉన్న సామాజిక వ్యతిరేక శక్తులన్నింటిని కూడగట్టి వాటన్నింటిని కూడా పోగేసి ఒక్క అమెరికాను తొలుత ధ్వంసం చేసి అనంతరం ప్రపంచ దండయాత్ర సాగించాలని లాడెన్ భావించాడని ఆ పత్రాల ఆధారంగా తెలుస్తోంది. అల్ ఖాయిదా నేతృత్వంలో ఉగ్రదాడులు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఉన్న ఇస్లామిక్ స్టేట్ అప్పుడు కూడా చాలా తీవ్రమైన ఆవేశపూరితమైన ఆలోచనలతో ఉండేదంట. ఏ మాత్రం సహనం సంయమనంతో అది వ్యవహరించదని, హింసను సృష్టించేందుకు రచించే వ్యూహాల ముందు అల్ ఖాయిదా మసకబారి పోయే పరిస్థితి వస్తుందని లాడెన్ భయపడుతూ ప్రతిక్షణ మదనపడిపోయేవాడని వాటి ద్వారా వెల్లడైంది.
పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికాకు చెందిన నేవీ సీల్స్ లాడెన్‌ను కూల్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయాలతోపాటు మరో ఆసక్తికరమైన విషయం కూడా సీఐఏ పత్రాల్లో తెలిసింది. తన కుమారులను లాడెన్ ఎప్పుడూ హెచ్చరిస్తుండేవాడని, వారిని ట్రాక్ చేసి పట్టుకునేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ చిప్‌లు ఇంజెక్ట్ చేసే అవకాశం ఉందని, కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు చెప్తుండే వాడని సమాచారం. అంతేకాదు.. ఒక్కోసారి ఇస్లామిక్ స్టేట్‌కు చెందిన ఉగ్రవాదులు ఆవేశపడి ఎత్తుకొచ్చిన విదేశీ ప్రముఖుల విషయంలో కూడా స్వయంగా జోక్యం చేసుకొని సర్దుబాట్లు చేసేందుకు ప్రయత్నించవాడని తెలిసింది.