టెహ్రాన్: ఇరాన్‌లో ఆదివారం ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అసెమన్ ఎయిర్‌లైన్స్ విమానయాన సంస్థకు చెందిన ఈపీ3704 విమానం జాగ్రోస్ పర్వతాల్లో కూలిపోయింది. అందులోని మొత్తం 66 మందీ చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. రాజధాని టెహ్రాన్ నుంచి యాసుజ్ పట్టణానికి ఓ చిన్నారి సహా 60 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో విమానం వెళ్తుండగా దుర్ఘటన జరిగింది.
రెండు ఏటీఆర్–72 ఇంజిన్లు కలిగిన ఈ విమానం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటలకు బయలుదేరిన 45 నిమిషాల తర్వాత రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. జాగ్రోస్ పర్వతాల్లో భారీగా మంచు కురుస్తుండటంతో అత్యవసర సహాయక బృందాలు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయన్నారు. దుర్ఘటనపై విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదేశించారు.
అమెరికా ఆంక్షలతోనే దుర్ఘటనలు..
అసెమన్ సంస్థకు ప్రస్తుతం 36 విమానాలు ఉండగా వాటిలో మూడు ఏటీఆర్–72 రకం ఇంజిన్లతో పనిచేస్తున్నాయి. ఈ ఇంజిన్లు 1990ల్లో తయారైనవి. ఇదే సంస్థకు ఉన్న బోయింగ్ 727–200 రకం విమానాలు 1979 నాటివి. ఇరాన్ సంస్థలు విమానాలను ఆధునీకరించుకోలేకపోవడానికి ప్రధాన కారణం అమెరికా ఆంక్షలు. అయితే 2015లో అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలతో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందంతో కొత్త విమానాలు, ఇంజిన్‌లను కొనుగోలు చేసే అవకాశం లభించింది. దీంతో అసెమన్ సంస్థ ఇప్పటికే విమానాల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించింది.
విమానాశ్రయం సమీపంలో రోదిస్తున్న మృతుల బంధువులు
Comments
Please login to add a commentAdd a comment