సాక్షి : నగ్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ మాగ్జైన్ ‘ప్లే బాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెన్ఫర్ ఇక లేరు. 91 ఏళ్ల హెన్ఫర్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని ప్లే బాయ్ సంస్థ ట్విట్టర్‌లో తెలియజేసింది.
1926లో చికాగోలో జన్మించిన హ్యూ కాపీ రైటర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టారు. ఆ తర్వాత 1600 డాలర్లతో 1953లో ప్లే బాయ్‌ను ప్రారంభించారు. తొలినాళ్లలో క్యాలెండర్‌గా దర్శనమిచ్చిన ప్లే బాయ్ తర్వాతి కాలంలో మాగ్జైన్‌గా మారిపోయింది. కవర్ పేజీతోసహా మొత్తం న్యూడ్‌ఫోటోలతో కథనాలను ప్రచురించేంది. సెక్స్ కు సంబంధించిన ఆరోగ్యకర అంశాలను చర్చించాలనే లక్ష్యంతోనే తాను ప్లేబాయ్ కి రూపమిచ్చినట్లు హ్యూ హెన్ఫర్ తరచూ చెబుతుండేవారు. అలా మొదలైన ప్లే బాయ్ ప్రస్థానం సుమారు ఆరు దశాబ్దాలపాటు నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది. ఇంటర్వ్యూలు, కల్పిత గాథలు, ఫిమేల్ సెలబ్రిటీల న్యూడ్ ఫోటో షూట్‌లు ఇలా సంచికలో పలు విషయాలను ప్రచురించేవారు.
అయితే మధ్యలో చాలా వివాదాలు సంచికను చుట్టుముట్టాయి కూడా. నగ్నత్వాన్ని మరీ ఎక్కువగా ప్రదర్శిస్తుండటంతో నిషేధం విధించాలన్న డిమాండ్ కూడా వినిపించింది. అదే సమయంలో యూఎస్ తపాలా శాఖ మాగ్జైన్‌ను బట్వాడా చేయకుండా నిలుపుదల చేసింది. దీంతో ఆయన న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. అలా వివాదాల తర్వాత కాస్త సర్యులేషన్ తగ్గినప్పటికీ... ప్లే బాయ్ అభిమానుల సంఖ్య మాత్రం తగ్గలేదు.
అలాంటి సంచిక ఏడాదిన్నర క్రితం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నగ్న చిత్రాలను ప్రచురించబోమని సంచలన ప్రకటన చేసింది. అయితే, ఏడాది గడవకముందే ప్లే బాయ్ యాజమాన్యం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. మళ్లీ మార్చి నుంచి మళ్లీ పాత తరహాలో నగ్న చిత్రాలతో ప్లేబాయ్ ని తీసుకొచ్చేసింది. హ్యూ హెన్ఫర్ ఒత్తిడి మేరకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బోర్డు ప్రకటించింది కూడా. వయసు పై బడటంతో ప్లేబాయ్ చీఫ్ బాధ్యతలను కొడుకు జూనియర్ హెన్ఫర్‌కు అప్పగించి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.