లాస్‌ఏంజెలిస్: ప్రముఖ మ్యాగజైన్ ‘ప్లేబాయ్’ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్ మృతి చెందారు. గురువారం స్వగృహంలో హెఫ్నర్ కన్నుమూసినట్లు ప్లేబాయ్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ప్లేబాయ్ భవనంలో, 91 ఏళ్ల వయసులో, తన ఆత్మీయుల నడుమ, ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు’ అని వెల్లడించింది.
1926 ఏప్రిల్ 9న షికాగోలో జన్మించిన హెఫ్నర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1944–1946 మధ్య) అమెరికా ఆర్మీకి సంబంధించిన పత్రికలో పనిచేశారు. 1949లో ఇలినాయి యూనివర్సిటీ నుంచి బీఏ సైకాలజీలో పట్టా పుచ్చుకున్నారు. తన వద్ద ఉన్న 600 డాలర్లతోపాటు తన తల్లి వద్ద మరో వెయ్యి డాలర్లు తీసుకుని 1953లో ప్లేబాయ్ మ్యాగజైన్‌ను హెఫ్నర్ ప్రారంభించారు.
ప్రత్యేకంగా పురుషుల కోసం ఉన్నతస్థాయిలో మ్యాగజైన్ ఉండాలన్న సంకల్పంతో ప్లేబాయ్‌ని తెచ్చారు. అనతికాలంలోనే ప్రపంచంలోని గొప్ప బ్రాండ్లలో ఒకటిగా మ్యాగజైన్‌ను నిలిపారు. తొలి ఏడాది సెంటర్‌ఫోల్డ్‌లో ప్లేమేట్‌గా ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ మార్లిన్ మాన్రో ఫొటోను ప్రచురించారు.
2015లో మహిళల నగ్న చిత్రాలను ప్రచురించడాన్ని నిలిపివేశారు. 1960ల్లో చాలాచోట్ల నైట్ క్లబ్బులను ప్రారంభించారు. ప్లేబాయ్ మ్యాగజైన్ తొలి కవర్ గర్ల్, హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో సమాధి పక్కనే హ్యూ హెఫ్నర్‌ను ఖననం చేయనున్నారు. 25 ఏళ్ల క్రితమే 75 వేల డాలర్లు వెచ్చించి మార్లిన్ మన్రో సమాధి పక్క స్థలాన్ని హెఫ్నర్ కొనుగోలు చేశారు.