
ఓల్డెన్‌బర్గ్ : సాధారణంగా నేరస్తులను పట్టుకోవటానికి ‘‘స్టింగ్ ఆపరేషన్’’ చేస్తుంటారు. పక్కాగా ఓ పథకం ప్రకారం నేరగాడ్ని వల వేసి పట్టుకోవటం ఈ స్టింగ్ ఆపరేషన్ ప్రత్యేకత. కానీ, జర్మనీలో చోటుచేసుకున్న స్టింగ్ ఆపరేషన్ మాత్రం ఇందుకు భిన్నమైనది. జైలు నుంచి పారిపోతున్న ఖైదీని పట్టుకోవటానికి కందిరీగలు ‘‘స్టింగ్’’ ఆపరేషన్ చేశాయి(యాదృచ్ఛికంగా). వివరాల్లోకి వెళితే.. జర్మనీ ఓల్డెన్‌బర్గ్‌లోని ఓ జైలు నుంచి 32 ఏళ్ల ఓ ఖైదీ తప్పించుకున్నాడు. జైలు బాల్కనీలోంచి నేరుగా కందిరీగలు ఉన్న తెట్టెపైకి దూకాడు. దీంతో ఆగ్రహానికి గురైన కందిరీగలు అతడ్ని వెంటాడి కుట్టడం ప్రారంభించాయి. నొప్పి తాళలేక అతడు వీధుల్లో పరుగులు పెట్టసాగాడు. అయినప్పటికి అవి అతడ్ని వదలలేదు. ఇక చేసేదేమీ లేక అతడు అక్కడే ఉన్న ఓ ప్లాస్టిక్ స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి తలదాచుకున్నాడు. ఖైదీని వెంటాడుతూ వచ్చిన పోలీసులు పూల్ దగ్గర అతడ్ని పట్టుకున్నారు. ‘‘స్టింగ్’’ ఆపరేషన్‌తో ఖైదీని పట్టించిన కందిరీగలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment