వేదికపై గాయనిని కాటేసిన నాగుపాము!
45 నిమిషాలు ప్రదర్శన ఇచ్చి మృతి
వేదిక మీద శ్రావ్యంగా పాటలు పాడటమే కాదు.. మధ్యమధ్యలో పాములతో విన్యాసాలు చేయడం ఆమెకు అలవాటు. ఇలాగే తాజాగా వేదిక మీద పాటపాడుతూ.. కాలనాగు తోకను తొక్కడంతో అది బుసకొట్టింది. ఆ గాయని తొడపై కాటేసింది. అయినా తన ప్రదర్శన ఆపని ఆ పాప్‌సింగర్ 45 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రదర్శన ఇచ్చి.. ఆ తర్వాత కుప్పకూలింది. వేదిక మీదే ప్రాణాలు విడిచింది. ఇండోనేషియాకు చెందిన 29 ఏళ్ల పాప్ సింగర్ ఇమ్రా బులె విషాదాంతమిది.
వెస్ట్ జావాలోని కారవాంగ్ గ్రామంలో ఆమె ఇటీవల ప్రదర్శన ఇస్తుండగా ఈ దారుణం జరిగింది. వేదిక మీద పాటలు పాడుతూ మధ్యమధ్య పాములతో విన్యాసాలు చేయడం ఇమ్రా ప్రత్యేకత. ఆమె షోలో విషపూరితమైన నాగుపాములు, కొండచిలువలను ఉపయోగించి విన్యాసాలు చేసేవారు. కానీ గత ప్రదర్శనలో ఆమెను విషపూరితమైన 'రియాంటీ' అనే పాము కాటేసింది. ఆమె తొడపై కాటు వేసి విషాన్ని రక్తంలోకి ఎక్కించింది. పాములను ఆడించే వ్యక్తి వెంటనే దానిని వెనక్కి లాగినా ఫలితం లేకపోయింది.
పాము కాటేసిన తర్వాత కూడా తన గానంతో 45 నిమిషాలపాటు ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఆ తర్వాత వాంతులు చేసుకుంటూ వేదిక మీద కుప్పకూలింది. ఆమె చనిపోయినట్టు స్థానిక వైద్యులు నిర్ధారించారు. 'వేదిక మీద తన రెండో పాట పాడుతున్నప్పుడు ఇమ్రా పాము తోకను తొక్కింది. దీంతో అది ఆమె తొడపై కాటేసింది' అని ఈ ప్రదర్శనలో ప్రేక్షకుడైన ఫెర్లాండో స్థానిక వెబ్‌సైట్‌కు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.