ఈ వారం యూట్యూబ్ హిట్స్
కేప్టెన్ అమెరికా - సివిల్ వార్ : ట్రైలర్
అమెరికన్ సూపర్‌హీరో ఫిల్మ్ ‘కేప్టెన్ అమెరికా : సివిల్‌వార్’ రెండో ట్రైలర్ ఇది. ట్రైలర్ విడుదలై 24 గంటలైనా కాకముందే హిట్స్ రెండు కోట్లు దాటాయి! కేప్టెన్ అమెరికా అనే వ్యక్తి మార్వెల్ కామిక్స్‌లో సూపర్‌హీరో. భూగోళంపై ఆధిపత్యం సంపాదించేందుకు భారీ విధ్వంసాన్ని సృష్టించే అవెంజర్స్‌ను ఈ హీరో నిరోధిస్తుంటాడు. అయితే అందుకు ప్రభుత్వ విధానాలు అడ్డొస్తాయి. ఆ విధానాలకు అతీతంగా కేప్టెన్ హీరో ఎప్పటికప్పుడు స్వయం నిర్ణయాలు తీసుకుంటూ కథను సాఫీగా ముగిస్తాడు. ఇదే కథాంశంతో 2014లో వచ్చిన ‘కేప్టెన్ అమెరికా : ది వింటర్ సోల్జర్’, అంతకు ముందు 2011లో వచ్చిన ‘కేప్టెన్ అమెరికా : ది ఫస్ట్ అవెంజర్స్’ చిత్రాలకు ఈ తాజా చిత్రం సీక్వెల్ అని చెప్పాలి. చిత్రం మే 6న విడుదల అవుతోంది. హాలీవుడ్ అత్యుత్తమ సినీ టెక్నాలజీ ఏ స్థాయిలో ఉందో ఈ ట్రైలర్‌లోని సన్నివేశాలను చూస్తే తెలుస్తుంది.
పాప్‌స్టార్ : నెవర్ స్టాప్ నెవర్ స్టాపింగ్
కెరియర్‌లో ఫ్లాప్ అయితే ఏం జరుగుతుంది? జీవితం కుప్పకూలి పోతుందా? మరో ఆప్షనే లేకుండా పోతుందా? కింద పడిన కెరియర్‌లోనే మళ్లీ పైకి లేచేందుకు వీలవుతుందా? ‘పాప్ : నెవర్ స్టాప్ నెవర్ స్టాపింగ్’ సినిమాలో ఈ ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చు. యాండీ శామ్‌బర్గ్ పాటగాడు. అతడి సెకండ్ ఆల్బమ్ అట్లర్ ఫ్లాప్ అవుతుంది. దాంతో డిప్రెషన్‌లో పడిపోతాడు. అందులోంచి బయటపడడానికి మళ్లీ కష్టపడతాడు. తన లిరిసిస్ట్, డీజే, పబ్లిసిస్ట్‌లతో కలిసి కొత్తగా మరో ప్రయత్నం చేస్తాడు. సక్సెస్ కొడతాడు. అతడే కిందపడి, తిరిగి పైకి లేచే క్రమంలో ప్రేక్షకులను ఎన్నో హాస్యసన్నివేశాలు అలరిస్తాయి. కొంచెం కిక్ కూడా ఇస్తాయి. ఆ కిక్‌ని శాంపిల్‌గా ఈ వీడియోలో వీక్షించవచ్చు.